సవాంగన్ననూ సాగనంపారు!

ABN , First Publish Date - 2022-02-16T07:11:47+05:30 IST

‘‘ఎల్వీ అన్న, సవాంగన్న నాకు రెండు కళ్లు! మీరే నాకు మార్గ నిర్దేశం చేయాలి’’... చీఫ్‌ సెక్రటరీ ఎల్వీ సుబ్రమణ్యం, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌లను ఉద్దేశించి ముఖ్యమంత్రి అయిన..

సవాంగన్ననూ  సాగనంపారు!

చెప్పినవన్నీ చేసినా తీరని దాహం

అవమానకర రీతిలో బదిలీ వేటు

టూర్‌ నుంచి వచ్చేసరికి చేతిలో ఆర్డర్‌

ఉద్యోగులపై విరుచుకు పడలేదనేనా?

పోలీసు వర్గాల్లో విస్తృత చర్చ

చాలాకాలం కిందటే పొగబెట్టి

సెలవుపై వెళ్లక తప్పని పరిస్థితిలోకి నెట్టి

ఇప్పుడు.. ఏకంగా బదిలీ వేటు

ఆర్నెల్ల ముందే చెప్పిన ‘ఆంధ్రజ్యోతి’

తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న డీజీపీగా ముద్ర


నాడు ఎల్వీ సుబ్రమణ్యం, నిన్న ప్రవీణ్‌ ప్రకాశ్‌, 

నేడు సవాంగ్‌! 

అడ్డదిడ్డంగా వాడుకో... ఆపైన వదిలెయ్‌! 

ఇదే జగనన్న విధానమా!? అధికార వర్గాల్లో 

జరుగుతున్న చర్చ ఇది!


‘‘ఎల్వీ అన్న, సవాంగన్న నాకు రెండు కళ్లు! మీరే నాకు మార్గ నిర్దేశం చేయాలి’’... చీఫ్‌ సెక్రటరీ ఎల్వీ సుబ్రమణ్యం, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌లను ఉద్దేశించి ముఖ్యమంత్రి అయిన తొలినాళ్లలో జగన్‌ పలికిన పలుకులు ఇవి! ‘అడిగారు కదా... మార్గనిర్దేశం చేద్దాం’ అనుకున్న పాపానికి ఎల్వీ సుబ్రమణ్యాన్ని అర్ధాంతరంగా సాగనంపారు. ఇక... డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ ఏలినవారి మనసును పూర్తిగా అర్థం చేసుకుని, అన్ని విధాలుగా సహకరించి, ప్రతిపక్షాల దృష్టిలో పలుచనైపోయినా, గతంలో ఏ డీజీపీ పడనన్ని మాటలు పడినా... ఆయనకూ పొగపెట్టి, అత్యంత అవమానకర రీతిలో సాగనంపారు! 


(అమరావతి - ఆంధ్రజ్యోతి)

అనుకున్నదే అయ్యింది! ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ను రాష్ట్ర ప్రభుత్వం అవమానకర రీతిలో సాగనంపింది. నిన్నటికి నిన్న విశాఖ, విజయనగరం జిల్లాల్లో అధికారిక పర్యటనల్లో పాల్గొన్న సవాంగ్‌... మంగళవారం మధ్యాహ్నం ఆఫీసుకు వచ్చేసరికి బదిలీ ఉత్తర్వు ప్రత్యక్షమైంది. వెంటనే జీఏడీలో రిపోర్టు చేయాలని ఆయనను ప్రభుత్వం ఆదేశించింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే... గౌతమ్‌ సవాంగ్‌ను పోలీస్‌ బాస్‌గా నియమించింది. ప్రత్యర్థులపైకి పోలీసులను విచ్చలవిడిగా ప్రయోగించడమూ మొదలైంది. పాలకుల రాజకీయ లక్ష్యాలు ఎలా ఉన్నప్పటికీ... ఐపీఎస్‌ అధికారిగా, డీజీపీగా నిబంధనల ప్రకారం వెళ్లాల్సిన గౌతమ్‌ సవాంగ్‌ పూర్తిస్థాయిలో ప్రభుత్వ పెద్దలకు సహకరించారు. దాడులు జరుగుతున్నా, తప్పుడు కేసులు పెడుతున్నా చూసీ చూడనట్లు ఉండిపోయారు. దీంతో... గతంలో ఏ డీజీపీ ఎదుర్కోనన్ని విమర్శలను ఎదుర్కొన్నారు. వివాదాస్పదుడిగా మిగిలిపోయారు.


ఇలా గౌతమ్‌ సవాంగ్‌ను ప్రభుత్వం పూర్తిస్థాయిలో ఉపయోగించుకుంది. అయినా సరే... సర్కారు వారికి ఆయన సేవలపై ‘సంతృప్తి’ కలగలేదు. ‘ఎల్వీ అన్న, సవాంగన్న నాకు రెండు కళ్లు. మీరే నాకు మార్గనిర్దేశం చేయాలి’ అంటూ తొలుత సూక్తులు వల్లించిన జగన్‌... ‘నేను చెప్పింది చేయాలంతే! రూల్స్‌ గీల్స్‌ జాంతానై’  అన్నట్లుగా సవాంగ్‌పై స్వారీ చేశారని పోలీసు అధికారుల్లో  చర్చలు జరుగుతున్నాయి. ఆర్నెళ్ల క్రితమే సవాంగ్‌ను సాగనంపే ప్రయత్నాలు జరిగాయి. ఈ వ్యవహారాన్ని ‘ఆంధ్రజ్యోతి’ బయటపెట్టింది. ‘పొమ్మనకుండా పొగపెట్టి... సెలవులో వెళ్లేలా చేస్తున్నారు’ అని తెలిపింది. కానీ... తాము ఆశించింది జరగకపోవడంతో, బదిలీవేటు వేశారు. 


ఎంత చేసినా... అంతే!

రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న ఘటనలు, పోలీసుల నిష్ర్కియాపర్వంపై ఢిల్లీలోని కేంద్ర హోంశాఖ అధికారులు సైతం అనేకమార్లు సవాంగ్‌ను నిలదీసినట్లు ప్రచారం జరిగింది. అయినా సరే... ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగానే సవాంగ్‌ వ్యవహరించారు. ఎవరిపై కేసు పెట్టాలన్నా.. ఎవర్ని పోలీస్‌ స్టేషన్లో వేయాలన్నా.. ఏకపక్షంగా పని చేస్తూ వచ్చారు. ‘విపక్షం వారైతే కేసు. అధికారపక్షంపై నో కేస్‌’... అనే ఏకైక సూత్రాన్ని అనుసరిస్తూ, ప్రభుత్వ పెద్దలను సంతృప్తి పరచడమే లక్ష్యంగా వ్యవహరించారు. ఈ క్రమంలో డీజీపీ స్థాయి అధికారి చేయకూడని వ్యాఖ్యలు కూడా చేసి... జనం దృష్టిలో పలుచనయ్యారు. విపక్షనేత చంద్రబాబుపై వైసీపీ శ్రేణులు అమరావతిలో రాళ్లు, చెప్పులు విసిరినప్పుడు... ‘ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ఎవరికైనా ఉంటుంది’ అని ప్రకటించారు. విజయనగరం జిల్లా రామతీర్థంలో అనుమతి లేకుండా వెళ్లిన విజయసాయి రెడ్డి వాహనాన్ని టీడీపీ కార్యకర్తలు అడ్డుకుని నిరసన తెలిపారంటూ... నాడు ఆ సమయంలో అక్కడలేని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావుపై కేసుపెట్టించారు. చంద్రబాబు ఇంటిపైకి దాడి చేసేందుకు వాహనాలతో వెళ్లిన వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్‌ను అరెస్టు చేయకుండా... వినతిపత్రం ఇచ్చేందుకు డీజీపీ కార్యాలయానికి వెళ్లిన టీడీపీ నేతలపై కేసు నమోదు చేసి అరెస్టు చేయించారు. ఆఖరికి డీజీపీ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న టీడీపీ ఆఫీసుపై పట్టపగలు వైసీపీ శ్రేణులు దాడులకు పాల్పడితే కనీసం స్పందించలేదు. ఇక... కొవిడ్‌ నిబంధనల ఉల్లంఘన పేరుతో టీడీపీ నేతలపై కుప్పలు తెప్పలుగా కేసులు పెట్టారు. పలు విషయాల్లో సవాంగ్‌ కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది. హైకోర్టు ఆయనపై ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది. అయినా సరే... సవాంగ్‌ మారలేదు. ప్రభుత్వ పెద్దలను సంతోషపెట్టడమే లక్ష్యంగా పని చేస్తూ... గతంలో ఏ పోలీస్‌ బాస్‌ ఎదుర్కోనన్ని ఆరోపణలు, అవమానాలు భరించారు. ఇలా ఎంత చేసినప్పటికీ... సర్కారు వారి దాహం తీరలేదు. ‘ఆయన మనం అనుకున్నట్లుగా, ఆశించినట్లుగా చేయడంలేదు’ అంటూ చివరికి బదిలీ వేటు వేశారు. 


డోన్ట్‌ కేర్‌...

శారీరకంగా ఫిట్‌గా కనిపించే గౌతమ్‌ సవాంగ్‌... పోలీసింగ్‌లో మాత్రం అంత సమర్థుడు కారనే అభిప్రాయం ఐపీఎస్‌ అధికారుల్లో ముందు నుంచీ ఉంది. సవాంగ్‌ను జగన్‌ డీజీపీగా నియమించినప్పటికీ... దిగువస్థాయి అధికారులు ఆయనకు పూర్తిగా సహకరించలేదు. ‘ఒకసారి చాంబర్‌కు రండి’ అని అడిషనల్‌ డీజీ స్థాయి అధికారిని గౌతమ్‌ సవాంగ్‌ ఆదేశించగా... ‘నువ్వు పిలిస్తే నేను వచ్చేదేంటి’ అన్నట్లుగా ఆ అధికారి అటువైపే రాలేదు. ఇక... ఒక వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహణపైనా ఎదురు తిరగడం అప్పట్లో చర్చనీయాంశమైంది.


సొంత ముద్ర లేకుండా...

గౌతమ్‌ సవాంగ్‌ 2019 మే 31న డీజీపీగా నియమితులయ్యారు. ఇప్పటికి... రెండున్నరేళ్లు పోలీ్‌సబా్‌సగా ఉన్నారు. అయినా... పోలీసు శాఖపై తన ముద్ర వేశారా? అంటే... అదీ లేదు. పోలీసులకు వీక్లీ ఆఫ్‌లు ఇవ్వలేక పోయారు. మూడేళ్లుగా ఖాళీల భర్తీకి నియామక నోటిఫికేషన్‌ రాలేదు. ఆఖరికి కేంద్ర హోంశాఖ నిధులు కూడా రాష్ట్రానికి తెచ్చుకోలేని దుస్థితి! దేశంలో వాహనాల్లేని పోలీసు స్టేషన్లు అత్యధికంగా ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్నట్లు ఇటీవల పార్లమెంట్‌ స్టాండింగ్‌ కమిటీ వెల్లడించడం ఏపీ పోలీసుశాఖ దుస్థితికి నిదర్శనం.


సవాంగ్‌ను ఇప్పుడో ‘నామ్‌కే వాస్తే’ డీజీపీగా మార్చారు. ఇప్పుడు బదిలీ వేటు వేయడానికి... ‘ఉద్యోగుల నిరసన’ కూడా కారణమనే ప్రచారం జరుగుతోంది. రివర్స్‌ పీఆర్సీపై ఈనెల 3న ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ‘చలో విజయవాడ’ పేరిట కదం తొక్కారు. ఇది ప్రభుత్వానికి పెద్ద షాక్‌! దీంతో ఆగ్రహానికి గురైన సీఎం జగన్‌... ‘చలో’ విజయవంతానికి పోలీసుల వైఫల్యమే కారణమని సవాంగ్‌పై అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘మీ వాళ్లు సహకరించారా? బాధ్యులు ఎవరో గుర్తించారా? ఏం చర్యలు తీసుకున్నారో చెప్పండి’ అని అడిగారు. పోలీసుల సహకారం వల్లే ఉద్యోగుల ఉద్యమం విజయవంతమైందని, అందుకే తాను కొంతమేర తగ్గాల్సి వచ్చిందని, లేదంటే ఉద్యోగులపట్ల మరింత కఠినంగా ఉండేవాడినని అత్యంత సన్నిహితుల వద్ద సీఎం వ్యాఖ్యానించినట్లు కూడా ప్రచారం జరిగింది.

Updated Date - 2022-02-16T07:11:47+05:30 IST