ప్రాణాలు కాపాడండి

ABN , First Publish Date - 2021-11-30T04:51:49+05:30 IST

‘బిల్లులు చెల్లించి ప్రాణాలు కాపాడండి.. నాడు పోషకులం... నేడు యాచకులం.. ఆస్తులు కరిగాయి... అప్పులు పెరిగాయి’ అంటూ కాంట్రాక్టర్లు ప్రభుత్వానికి గోడు వినిపించారు. పది నెలలుగా బిల్లులకు నోచుకోక పడుతున్న ఇబ్బందులను ఏకరువు పెట్టారు.

ప్రాణాలు కాపాడండి
మున్సిపల్‌ కార్యాలయం ముందు ధర్నా చేస్తున్న కాంట్రాక్టర్లు

పది నెలలుగా అందని బిల్లుల కోసం కాంట్రాక్టర్ల ధర్నా

బొబ్బిలి రూరల్‌, నవంబరు 29: ‘బిల్లులు చెల్లించి ప్రాణాలు కాపాడండి.. నాడు పోషకులం... నేడు యాచకులం.. ఆస్తులు కరిగాయి... అప్పులు పెరిగాయి’ అంటూ కాంట్రాక్టర్లు ప్రభుత్వానికి గోడు వినిపించారు. పది నెలలుగా బిల్లులకు నోచుకోక పడుతున్న ఇబ్బందులను ఏకరువు పెట్టారు. బొబ్బిలి మున్సిపాలిటీలో చేపట్టిన  వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి 15 మంది కాంట్రాక్టర్లకు రూ.4.50 కోట్ల బిల్లుల బకాయిలను ప్రభుత్వం చెల్లించకపోవడంపై వారంతా మున్సిపల్‌ కార్యాలయం ఎదుట సోమవారం నిరసన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాంట్రాక్టర్ల ప్రతినిధులు వంగపండు మురళీధర్‌, చప్ప చంద్రశేఖర్‌, బోరే శేషుబాబు మాట్లాడుతూ లక్షలాది రూపాయల బిల్లులను చెల్లించకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామని, కుటుంబ పోషణ కూడా కష్టతరమవుతోందన్నారు. వెలమల మహేంద్ర అనే కాంట్రాక్టరు ఆర్థికపరమైన సంక్షోభాన్ని తట్టుకోలేక బ్రెయిన్‌ హెమరైజ్‌కు గురై ప్రస్తుతం ఆసుపత్రిలో కోమాలో ఉన్నారని వారంతా వాపోయారు. అనంతరం మున్సిపల్‌ చైర్మన్‌ సావు వెంకటమురళీకృష్ణారావు, కమిషనర్‌ సత్తారు శ్రీనివాసరావులకు వేర్వేరుగా వినతిపత్రాలు అందజేశారు. మున్సిపల్‌ సిబ్బంది తమ డిపాజిట్లను వాపసు చేయడానికి కూడా అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఫిర్యాదు చేశారు. కాంట్రాక్టర్ల సమస్యలను మరోసారి ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామని కమిషనర్‌ వారికి హామీ ఇచ్చారు.



Updated Date - 2021-11-30T04:51:49+05:30 IST