అమ్మవారి విశ్వరూప దర్శనానికి పోటెత్తిన భక్తులు
వైభవోపేతం కుప్పం గంగమ్మ విశ్వరూప దర్శనం
విచిత్ర వేషాలు.. ఒడలు తెలియని పూనకాలు.. దవడలకు గుచ్చుకున్న శూలాలు.. శిరస్సులపై పిండిముద్దల నైవేద్యాలు.. బలిపీఠం వద్ద కర్పూర హారతులు.. తలలు తెగుతున్న మూగజీవాలు.. రాళ్లపొయ్యిలపై ఉడుకుతున్న పొంగళ్లు.. వీఽధుల పొడవునా బారులుతీరిన అంగళ్లు.. భుజాలపై చిన్నారుల మోతలు.. క్యూలైన్లలో గంటలతరబడి నిరీక్షణలు.. పోలీసు బలగాల సర్వేక్షణలు.. అయినా తప్పని తోపులాటలు.. కిలోమీటర్ల పొడవునా ట్రాఫిక్ కష్టాలు.. మేళతాళాలు.. ఆదిమ వాద్య నాదాలు.. అర్చకపూజారుల మంత్రోచ్చారణలు.. కుప్పం గంగమ్మ విశ్వరూప దర్శన వైభవమిది.
కుప్పంలోని ప్రసన్న తిరుపతి గంగమాంబ విశ్వరూప దర్శన ఉత్సవం బుధవారం వైభవోపేతంగా జరిగింది. మంగళవారం ఉదయం బయలుదేరిన అమ్మవారి శిరస్సు ఊరేగింపు.. బుధవారం ఉదయం 11 గంటలదాకా సాగింది. 11.30 గంటల ప్రాంతంలో ఆలయానికి చేరిన అమ్మవారి శిరస్సును.. అసంపూర్ణ దేహానికి అమర్చారు పూజారులు. విశేషాలంకరణలు చేసి సర్వాభరణాలు అలంకరించి భక్తులను దర్శనానికి అనుమతించారు. క్యూలైన్లు కనీసం కిలోమీటరు పొడవున జనంతో కిటకిటలాడాయి. గంగమ్మ ఆలయ ఛైర్మన్ కేఏ మంజునాథ్ ఆధ్వర్యంలో గంగమ్మ విశ్వరూప దర్శన ఉత్సవం జరిగింది. ప్రభుత్వం తరపున మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సారె సమర్పించారు. బుధవారం రాత్రి పదకొండున్నర గంటలదాకా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. అర్ధరాత్రి పన్నెండు గంటలు దాటాక అమ్మవారి శిరస్సు తొలగించి ఊరేగింపుగా ఆర్టీసీ బస్టాండు ఆవరణలోని పురాతనమైన జలధి బావి వద్దకు తీసుకొచ్చారు. శిరస్సుకున్న కళ్లు తొలగించారు. అంటే గంగమ్మ ఉగ్రరూపాన్ని ఉపసంహరింపజేసి, జలావాసం చేయించారన్నమాట. మళ్లీ పూజలు చేయడంతో జలావాస ఘట్టం పూర్తయింది.
- కుప్పం
ప్రభుత్వం తరపున సారె తీసుకొస్తున్న మంత్రి పెద్దిరెడ్డి
అమ్మవారిని దర్శించుకుంటున్న భక్తులు
ఓం శక్తి భక్తుల విన్యాసం
మొక్కులు తీర్చుకోవడానికి వెళ్తున్న భక్తులు
అమ్మవారి వేషధారణలో ఎంపీపీ అశ్విని