Justice Indira Banerjee: 72 ఏళ్ల సుప్రీంకోర్టు చరిత్రలో 11 మంది మహిళా న్యాయమూర్తులు.. జస్టిస్ ఇందిరా బెనర్జీ మనోగతం ఇదే!

ABN , First Publish Date - 2022-09-23T23:28:47+05:30 IST

ఏడు దశాబ్దాల చరిత్ర కలిగిన భారత సుప్రీంకోర్టు (supreme court)లో ఇప్పటి వరకు సేవలు అందించిన 11 మంది

Justice Indira Banerjee: 72 ఏళ్ల సుప్రీంకోర్టు చరిత్రలో 11 మంది మహిళా న్యాయమూర్తులు.. జస్టిస్ ఇందిరా బెనర్జీ మనోగతం ఇదే!

న్యూఢిల్లీ: ఏడు దశాబ్దాల చరిత్ర కలిగిన భారత సుప్రీంకోర్టు (supreme court)లో ఇప్పటి వరకు సేవలు అందించిన 11 మంది మహిళా న్యాయమూర్తుల్లో ఒకరైన జస్టిస్ ఇందిరా బెనర్జీ నేడు పదవీ విరమణ చేశారు. ప్రస్తుతం ధర్మాసనంలో సీనియర్ న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ ఇందిరా బెనర్జీ (Justice Indira Banerjee) ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భవిష్యత్తులో మరింత మంది మహిళలు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా రావాలని ఆకాంక్షించారు.


సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్ అయిన ఐదో న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ ఇందిరా బెనర్జీ నాలుగేళ్లకుపైగా సేవలు అందించారు. ఆమెతోపాటు సుప్రీంకోర్టులో ప్రస్తుతం మరో ముగ్గురు మహిళా న్యాయమూర్తులు జస్టిస్ హిమా కోహ్లీ (Hima Kohli), బీవీ నాగరత్న (B.V. Nagarathna), బేల ఎం త్రివేది (Bela M Trivedi) ఉన్నారు. 


తొలి మహిళా న్యాయమూర్తిగా జస్టిస్ ఎం.ఫాతిమా బీవీ

జస్టిస్ ఇందిరా బెనర్జీ సుప్రీంకోర్టుకు నియమితులైన ఎనిమిదో మహిళా న్యాయమూర్తి కాగా, ఆమె పదవీ విరమణతో సుప్రీంకోర్టులో ఇకపై పైన పేర్కొన్న ముగ్గురు మహిళా న్యాయమూర్తులు మాత్రమే ఉంటారు. 26 జనవరి 1950 ఆవిర్భవించిన సుప్రీంకోర్టులో తొలి మహిళా న్యాయమూర్తిగా జస్టిస్ ఎం. ఫాతిమా బీవీ (Justice M Fathima Beevi) 1989లో అడుగుపెట్టారు. ఆ తర్వాతి నుంచి ఇప్పటి వరకు గత 72 ఏళ్లలో 11 మంది మహిళలు మాత్రమే న్యాయమూర్తులుగా సుప్రీంకోర్టుకు నియమితులయ్యారు. ఇప్పటి వరకు సుప్రీంకోర్టుకు సేవలందించిన మహిళా న్యాయమూర్తుల్లో జస్టిస్ సుజాతా వి మనోహర్ (Sujata V Manohar), రుమా పాల్ (Ruma Pal), జ్ఞాన్ సుధా మిశ్రా(Gyan Sudha Misra), రంజన పి దేశాయ్ (Ranjana P Desai), ఆర్ భానుమతి (R Banumathi), ఇందు మల్హోత్రా (Indu Malhotra) ఉన్నారు. 


చివరి పని రోజు అయిన శుక్రవారం భారత ప్రధాన న్యాయమూర్తి యూయూ లలిత్‌తో జస్టిస్ బెనర్జీ సెరెమోనియల్ బెంచ్‌ను పంచుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ.. రెండున్నర దశాబ్దాలకుపైగా కెరియర్‌లో న్యాయవ్యవస్థకు ఆమె చేసిన సేవలను కొనియాడారు. ఆమె తన కెరియర్‌లో న్యాయవ్యవస్థకు అవసరమైనవన్నీ ఇచ్చారన్న జస్టిస్ యూయూ లిలిత్ ()U U Lalit.. ఆమె చాలా హార్డ్ వర్కర్ అని, అమోఘమైన తెలివితేటలు కలవారని అన్నారు.  న్యాయమూర్తికి కావాల్సిన అన్ని అర్హతలు ఆమెకు ఉన్నాయని అన్నారు. ఆమెను సోదరిగా సంబోధిస్తూ తామందరం ఆమెను మిస్సవుతున్నట్టు చెప్పారు. ఆమె ఎప్పటికీ తమ గుండెల్లో నిలిచిపోతారని అన్నారు. ఈ సందర్భంగా ఆమెకు ‘ఆల్ ద బెస్ట్’ చెప్పారు. 


పదోన్నతిపై సుప్రీంకోర్టుకు..

జస్టిస్ ఇందిరా బెనర్జీ మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న సమయంలో 7 ఆగస్టు 2018న పదోన్నతిపై సుప్రీంకోర్టుకు నియమితులయ్యారు. రాజ్యాంగం ప్రకారం సుప్రీంకోర్టు న్యాయమూర్తుల రిటైర్మెంట్ వయసు 65 ఏళ్లు. జస్టిస్ బెనర్జీ రిటైర్మెంట్ కార్యక్రమానికి అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, ఎస్‌సీబీఏ ప్రెసిడెంట్, సీనియర్ అడ్వకేట్ వికాస్ సింగ్ తదితరులు హాజరై ఆమెను ప్రశంసించారు.


1985లో ప్రారంభమైన ప్రస్థానం

24 సెప్టెంబరు 1957న జన్మించిన జస్టిస్ బెనర్జీ కలకత్తా యూనివర్సిటీలోని లా కాలేజీ నుంచి ఎల్ఎల్‌బీ పట్టా అందుకున్నారు. 5 జులై 1985న న్యాయవాదిగా తన పేరును నమోదు చేసుకున్నారు. ఆ తర్వాత కలకత్తా హైకోర్టులో ఒరిజినల్, అప్పీలేట్ సైడ్స్‌లో క్రిమినల్ లా మినహా అన్ని న్యాయ శాఖలలో ప్రాక్టీస్ చేశారు. సుప్రీంకోర్టు, ఇతర కోర్టులు, ట్రైబ్యునల్స్‌కు కూడా హాజరయ్యారు. 5 ఫిబ్రవరి 2002లో కలకత్తా హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 8 ఆగస్టు 2016న ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. అలాగే, ఢిల్లీ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి చైర్‌పర్సన్‌గానూ పనిచేశారు. 5 ఏప్రిల్ 2017లో మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. 7 ఆగస్టు 2018న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 

Updated Date - 2022-09-23T23:28:47+05:30 IST