23 మంది రైతులే సాక్ష్యులా? లఖింపూర్ ఘటనపై ప్రశ్నించిన సుప్రీం

ABN , First Publish Date - 2021-10-26T22:45:25+05:30 IST

ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్‌లో జరిగిన కారు ప్రమాదంపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఆందోళనలో వందలాది మంది రైతులు ఉండగా కేవలం 23 మందినే ప్రత్యక్ష సాక్షులుగా పేర్కొనడం ఏంటని సీజేఐ రమణ నేతృత్వంలోని బెంచ్ ప్రశ్నించింది. ఈ కేసుకు సంబంధించి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తరపున సీనియర్ లాయర్ హరీష్ సాల్వే వాదనలు వినిపిస్తూ..

23 మంది రైతులే సాక్ష్యులా? లఖింపూర్ ఘటనపై ప్రశ్నించిన సుప్రీం

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్‌లో జరిగిన కారు ప్రమాదంపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఆందోళనలో వందలాది మంది రైతులు ఉండగా కేవలం 23 మందినే ప్రత్యక్ష సాక్షులుగా పేర్కొనడం ఏంటని సీజేఐ రమణ నేతృత్వంలోని బెంచ్ ప్రశ్నించింది. ఈ కేసుకు సంబంధించి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తరపున సీనియర్ లాయర్ హరీష్ సాల్వే వాదనలు వినిపిస్తూ ఈ కేసులో మొత్తం 68 మంది సాక్షులు ఉన్నారని అందులో 30 మంది సాక్షుల నుంచి వివరాలు సేకరించామని, ఇందులో 23 మంది ప్రత్యక్ష సాక్షులని కోర్టుకు తెలిపారు. కాగా, కోర్టు దీనిపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ‘‘ప్రమాదం జరిగిన సమయంలో 4,000-5,000 మంది రైతులు ఆందోళన నిర్వహిస్తున్నారు. వాళ్లందరి మధ్యనే ప్రమాదం జరిగింది. చిత్రంగా 23 మంది మాత్రమే ప్రత్యక్ష సాక్షులు ఉండటం ఏంటి?’’ అని ప్రశ్నించింది.


అయితే ఆందోళనలో ఉన్న వారు కారును, కారులో ఉన్న వ్యక్తులను చూడలేదని, చాలా కొద్ది మంది మాత్రమే ప్రమాదంపై పూర్తి అవగాహన ఉందని ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. కాగా, సీఆర్‌పీసీ సెక్షన్ 164 కింద సాక్ష్యాధారాలను నమోదు చేసే పనిని సమీప జ్యుడీషియల్ మేజిస్ట్రేట్‌లకు అప్పగించాలని సంబంధిత జిల్లా న్యాయమూర్తిని తాము ఆదేశిస్తామని సుప్రీం పేర్కొంది. ఎక్కువ మంది ప్రత్యక్ష సాక్షులు ఉంటే మరిన్న వాస్తవాలు తెలుస్తాయని, కేసు దర్యాప్తు తొందరగా జరగడంతో పాటు పారదర్శకత ఉంటుందని కోర్టు అభిప్రాయపడింది.

Updated Date - 2021-10-26T22:45:25+05:30 IST