చేసేదేం లేదు! ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో ప్రగతిని పట్టించుకునే వారేరీ..!

ABN , First Publish Date - 2020-10-27T18:00:26+05:30 IST

‘అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని’ అన్న చందంగా తయారైంది ఒంగోలు నగరపాలక సంస్థ పనితీరు.ప్రభుత్వం ప్రగతి ఊసును..

చేసేదేం లేదు! ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో ప్రగతిని పట్టించుకునే వారేరీ..!

అభివృద్ధి పనులకు ఆగిన బిల్లులు 

ఏడాదిన్నరగా రూ.15కోట్లకుపైనే బకాయిలు 

ఎస్సీ సబ్‌ప్లాన్‌ నిధులకూ గ్రహణం

కొత్తగా ప్రగతి ప్రతిపాదనలు కరువు 


ఒంగోలు: ‘అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని’ అన్న చందంగా తయారైంది ఒంగోలు నగరపాలక సంస్థ పనితీరు.ప్రభుత్వం ప్రగతి ఊసును పక్కకు నెట్టేసింది. కొత్త అభివృద్ధి పనుల ప్రతిపాదనలను పట్టించుకోవడం లేదు. పైగా గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన  పనులకు బిల్లులు మంజూరు చేయకుండా  నిలిపేసింది. దీంతో ప్రస్తుతం పనులు లేక, గతంలో చేసిన పనులకు పైసా కూడా చెల్లింపులు లేక కాంట్రాక్టర్లు గగ్గోలు పెడుతున్నారు. మరోవైపు ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాలేదా అని అంటే ఆ ఒక్కటీ అడక్కండి అని అధికారులు బదులిస్తున్నారు. మొత్తం మీద కార్పొరేషన్‌లో రూ.15 కోట్ల బిల్లులు నిలిచిపోయాయి.  కొత్తగా పనులు చేపట్టడంపై అధికారులు సైతం దృష్టిసారించకపోగా ఏడాదిన్నరగా పలు అభివృద్ధి పనులకు ఆటంకాలు ఎదురవుతున్నాయి.


ఒంగోలు నగరంలో ప్రగతి పనులకు గ్రహణం పట్టింది. ప్రధానంగా నిధుల కష్టాలు నెలకొన్నాయి. దీంతో కొత్తగా ఎటువంటి పనులు చేపట్టలేని దుస్థితి కొనసాగుతోంది. గత ప్రభుత్వ హ యాంలో రహదారులు, పైపులైన్లు, డ్రెయిన్లు, పార్కుల అభివృద్ధితోపాటు వివిధ రకాలైన పనులు విరివిగా చేపట్టారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ కింద రూ.10 కోట్ల పనులు పూర్తిచేయగా, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరో కోటి వరకు ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ కింద పనులు చేపట్టారు.అంతేకాకుండా ప్రజ లు పన్నుల రూపంలో చెల్లించే జనరల్‌ ఫండ్‌ నుంచి మరో రూ.4కోట్లకుపైగా అభివృద్ధి పనులు చేపట్టారు. దీంతోపాటు ఏఎస్‌సీ గ్రాంట్లతో నగర ప్రజలకు తాగునీటి అవసరాలకు ప్రైవేటు ట్యాంకర్లు ఏర్పాటు చేశారు. కాగా ప్రస్తుత ప్ర భుత్వం వచ్చినప్పటి నుంచి ఎలాంటి బిల్లులు చెల్లించకపోవడంతో ఏడాదిన్నర కాలంగా రూ. 15కోట్ల బిల్లుల  చెల్లింపులు నిలిచిపోయాయి.  


గత ప్రభుత్వ  హయాంలో భారీగా పనులు 

ఒంగోలు నగరంలోని ఎస్సీకాలనీల అభివృద్ధి కోసం ప్రత్యేక దృష్టిసారించిన గత ప్రభుత్వం ఎస్సీ సబ్‌ప్లాన్‌ నిధులు కేటాయించింది. దీంతో విలీనగ్రామాల్లో మొదటగా అభివృద్ధి చేయడానికి అధికారులు చర్యలు చేపట్టారు. మొత్తం 84 పనులకు రూ.34.63కోట్లు కేటాయించారు.కొప్పోలు, గాంధీనగర్‌, త్రోవగుంట, పాత అంబేడ్కర్‌కాలనీ, ప్రగతికాలనీ, శాంతినగర్‌ ప్రాంతాల్లో తాగునీటి సరఫ రా కోసం రూ.5.92కోట్లతో పనులు చేపట్టగా, త్రోవగుంట, ముక్తినూతలపాడు, నీలాయపాలెం, తూర్పు క్రిస్టియన్‌పాలెం, పీవీరెడ్డి ఎస్సీకాలనీ, గాంధీనగర్‌ ఎస్సీకాలనీ, బత్తులవారికుంట, ప్రగతికాలనీ, చెరువుకొమ్ముపాలెం, వెంగముక్కల పాలెం, గద్దలగుంట, ఇందిరానగర్‌, క్రిస్టియన్‌పాలెం, ఎన్టీఆర్‌కాలనీ దళితవాడ, పేర్నమిట్ట ఎస్సీకాలనీల్లో మురుగు నీటిపారుదల వ్యవస్థ కోసం రూ.4.62కోట్లు ఖర్చుచేశారు. అరవకాలనీలో, వెంగముక్కలపాలెంలో మీడియం డ్రెయిన్స్‌ కోసం ఎస్సీ కాలనీల్లో శ్మశాన వాటికల అభివృద్ధికి రూ.4.52 కోట్లు, త్రోవగుంట, ముక్తినూతలపాడు, చినమల్లేశ్వరకాలనీ, పలు విలీన గ్రామాల్లోని ఎస్సీ కాలనీ ల్లో రహదారుల నిర్మాణం కోసం రూ.17.05 కోట్లు, పాఠశాల భవనాలు ఆధు నికీకరణ కోసం రూ.50లక్షలు, ఐమాక్స్‌ లైట్లు ఏర్పాటుకు రూ.1.2కోట్లు, క్లౌపే టలో సెంట్రల్‌ లైటింగ్‌ కోసం రూ. 25లక్షలు వెచ్చించారు. దీంతో పలు కాల నీల్లో ప్రగతి పనులు కార్యరూపం దాల్చాయి. అయితే అందుకు సంబంధించిన బిల్లులు మా త్రం నేటికీ ప్రభుత్వం విడుదల చే యకపోవడంతో కొత్తగా ఎస్సీ కాలనీల్లో అభివృద్ధి పనులు ఏడాదిగా పట్టిం చుకున్న నాథుడే లేరు.


దీనావస్థలో పలు దళిత కాలనీలు 

ఎస్సీ, ఎస్టీల సంక్షేమం కోసం పెద్దపీట వేస్తున్నామని ప్రభుత్వాలు పేర్కొం టున్నా, ఆచరణలో సాధ్యపడటం లేదు. జిల్లాకేంద్రమైన ఒంగోలు నగరంలో నేటికి పలు ఎస్సీ, ఎస్టీకాలనీలు అభివృద్ధి దూరంగా ఉన్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికీ కనీస రహదారులు, కాలువలు లేకుండా మరింత దయనీయంగా ఉన్నాయి. అభివృద్ధి చేయాలని, మౌలిక వసతులు కల్పించాలనిఆ ప్రాంత ప్రజలు కార్పొరేషన్‌ కార్యాలయం చుట్టూ కాళ్ళరిగేలా తిరుగుతున్నా పట్టించుకునే నాథుడు కరువయ్యారు. కొన్ని కాలనీల్లో ఇళ్ళలోని మురుగునీరు బయటకు వెళ్ళేందుకు కనీస డ్రైనేజ్‌లు నిర్మాణానికి నోచుకోలేదు.


ప్రభుత్వం నుంచి నిధులు రావాల్సి ఉంది

సబ్‌ప్లాన్‌తోపాటు వివిధ పనులకు సంబంధించిన బిల్లులు పెండింగ్‌ ఉన్న మాట వాస్తవమే. కార్పొరేషన్‌ వైపు నుంచి ఎటువంటి లోపం లేదు. బిల్లుల మంజూరు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదన పంపాం. గత ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందే కాని నిధులు మంజూరు చేయలేదు. అందుకోసం జాప్యం జరుగుతోంది. ప్రభుత్వం నుంచి నిధులు వస్తే అందరికీ చెల్లిస్తాం.

- నిరంజన్‌రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌


Updated Date - 2020-10-27T18:00:26+05:30 IST