ఉపాధి పనుల్లో రూ.2.48 లక్షల అవినీతి

ABN , First Publish Date - 2020-12-04T05:10:00+05:30 IST

చాగలమర్రి మండలంలోని 19 గ్రామ పంచాయతీల్లో చేపట్టిన ఉపాధిహామీ, వాటర్‌షెడ్‌, కన్వర్జేషన్‌ పనుల్లో రూ.2.48 లక్షలు అవినీతి జరిగినట్లు జిల్లా ఉపాధిహామీ పీడీ అమర్‌నాథ్‌రెడ్డి తెలిపారు.

ఉపాధి పనుల్లో రూ.2.48 లక్షల అవినీతి
సామాజిక తనిఖీ సభలో విచారణ చేస్తున్న పీడీ, ఏపీడీ

  1. ఉపాధిహామీ పీడీ అమర్‌నాథ్‌రెడ్డి 


చాగలమర్రి, డిసెంబరు 3: చాగలమర్రి మండలంలోని 19 గ్రామ పంచాయతీల్లో చేపట్టిన ఉపాధిహామీ, వాటర్‌షెడ్‌, కన్వర్జేషన్‌ పనుల్లో రూ.2.48 లక్షలు అవినీతి జరిగినట్లు జిల్లా ఉపాధిహామీ పీడీ అమర్‌నాథ్‌రెడ్డి తెలిపారు. గురువారం ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో సామాజిక తనిఖీ బహిరంగ సభ నిర్వహించారు. రాష్ట్ర రిసోర్స్‌పర్సన్‌ వెంకటేష్‌, 14 డీఆర్పీల ఆధ్వర్యంలో ఉపాధి పనులు, మొక్కల పెంపకం, వాటర్‌షెడ్‌, హౌసింగ్‌, పంచాయతీరాజ్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌, పశువైద్యశాఖ, అటవీశాఖ, విద్యాశాఖకు సంబంధించిన పనులపై చేసిన విచారణ నివేదికలను సభలో చదివి వినిపించారు. 19 గ్రామ పంచాయతీలలో 2,395 పనులకు రూ.5.94 కోట్లు ఖర్చు చేశారు. జరిగిన పనులపై గ్రామాల్లో విచారణ చేయగా ఉపాధిహామీ పథకంలో రూ.38 లక్షలు, వాటర్‌షెడ్‌ పరిధిలో రూ.2.10 లక్షలు అవినీతి జరిగినట్లు పీడీ తెలిపారు. అధిక వర్షాల వల్ల నాటిన మొక్కలు చనిపోయినట్లు చూపించారని తెలిపారు. నంద్యాల డివిజన్‌ పరిధిలో 80 వేల మొక్కలు చనిపోయి ఉంటాయన్నారు. వాటిపై విచారణ చేస్తున్నామని తెలిపారు. జిల్లాలో 14వ విడత సామాజిక తనిఖీలు నిర్వహిస్తున్నామని అన్నారు. 8 మండలాల్లో సామాజిక తనిఖీ చేశామన్నారు. జిల్లాలో సామాజీక తనిఖీ అవినీతి రూ.9 కోట్లు దాకా ఉంటుందని అన్నారు. జరిగిన అవినీతి సొమ్మును రికవరికి ఆదేశించామని తెలిపారు. జిల్లా అదనపు పీడీ బాలకృష్ణారెడ్డి, విజిలెన్స్‌ అధికారి అన్వర్‌బేగం, వాటర్‌షెడ్‌ అదనపు పీడీ సలీమ్‌, క్వాలిటీ కంట్రోల్‌ ఆఫీసర్‌ భాగ్యరాజు, ప్రత్యేక అధికారి వెంకటసుబ్బారెడ్డి, ఈవోఆర్డీ నాగేంద్రయ్య, ఏపీవో నర్సిరెడ్డి, ఏఈలు జయన్న, ప్రసాద్‌, టీఏ, ఎఫ్‌ఏలు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. 


‘ఉపాధి పనుల కోసం రూ.312 కోట్లు’

జిల్లాలో ఉపాధి పనులు చేయడానికి రూ.312 కోట్లు కేటాయించినట్లు ఉపాధి హామీ పీడీ అమర్‌నాథ్‌రెడ్డి తెలిపారు. గురువారం ఎంపీడీవో కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు రూ.272 కోట్లు ఉపాధి పనుల కోసం ఖర్చు చేశామని తెలిపారు. కరోనా, వర్షాల కారణంగా ఉపాధి పనులు 80 శాతం మాత్రమే జరిగాయన్నారు. మరో నాలుగు నెలల పాటు ఉపాధి పనులు చేయడానికి రూ.50 కోట్లు అదనంగా ఖర్చు చేస్తున్నామని తెలిపారు. 

Updated Date - 2020-12-04T05:10:00+05:30 IST