ltrScrptTheme3

గోడ చాటున నిజం!

Oct 26 2021 @ 00:59AM

కైకలూరు ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌లో భారీ కుంభకోణం

దారి మళ్లుతున్న వేలాది బస్తాల చౌక బియ్యం

సరుకు విలువ సుమారు రూ.2 కోట్లు

స్టాక్‌ ఉన్నట్టు భ్రమ కల్పించేందుకు గోడౌన్‌లో గోడ

అధికారుల తనిఖీలతో వెలుగులోకి.. 

చర్యలు తీసుకోకుండా తాత్సారం

రూ.40 లక్షల లంచం డిమాండ్‌!


పేదల బియ్యం వెనుక గోడ కట్టి, నిజాన్ని పాతిపెట్టారు కైకలూరు ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ నిర్వాహకులు. గోడౌన్లో ఉన్నది మొత్తం బియ్యం బస్తాలే అనే భ్రమ కల్పించి, అధికారులకు మస్కా వేస్తూ వచ్చారు. అది ఎంతో కాలం దాగలేదు.. కైకలూరు ఎంఎల్‌ఎస్‌ గోడౌన్లో ఉన్నది మొత్తం సరుకు కాదని, అక్కడ ఉండాల్సిన 25 వేల బియ్యం బస్తాలు మాయమయ్యాయని అధికారులు గుర్తించారు. అయితే వెంటనే చర్యలకు ఉపక్రమించాల్సిన అధికారులు కూడా కక్కుర్తిపడ్డారు. రూ.40 లక్షలు ఇస్తే నేరాన్ని తక్కువ చేసి చూపి, శిక్ష తగ్గేలా సహకరిస్తానని పౌరసరఫరాల శాఖలోని ఓ అధికారే బేరం కుదుర్చుకునే ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం. రూ.2 కోట్ల పేదల బియ్యాన్ని పక్కదారి పట్టించినవాళ్లపై చర్యలు తీసుకోవలసిన అధికారే లంచం డిమాండ్‌ చేయటం కలకలాన్ని సృష్టిస్తోంది. 


(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : కొన్నేళ్లుగా వివాదస్పద కేంద్రంగా ఉన్న కైకలూరు మండల లెవల్‌ స్టాక్‌ (ఎంఎల్‌ఎస్‌) పాయింట్‌ గోడౌన్‌ నుంచి వేలాది బియ్యం బస్తాలు మాయమయ్యాయి. దాదాపు 15 లారీల బియ్యంలోడు.. అంటే దాదాపు ఓ మండలానికి సరఫరా చేసే బియ్యం పక్కదారి పట్టినట్టు తెలుస్తోంది. ఇంత భారీగా పేదల బియ్యాన్ని మింగేసేందుకు ప్రయత్నించిన బకాసురుడిపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు లంచం కోసం ఆశపడి, ఉన్నతాధికారులకు రిపోర్టు చేయకుండా కాలయాపన చేయటం గమనార్హం. అధికారుల తనిఖీల్లో వెలుగు చూసిన అక్రమాన్ని అధికారులే మాఫీ చేయడానికి ప్రయత్నం చేయడం కంటే నేరం ఇంకొకటి ఉంటుందా?


జరిగింది ఇదీ..

కైకలూరు ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ నిర్వహణ చాలా కాలంగా అస్తవ్యస్థంగా సాగుతోంది. వచ్చిన బియ్యం బస్తాలను రికార్డు చేయటంలో కానీ, డీలర్లకు సక్రమంగా పంపిణీ చేయటంలో కానీ సరైన నిర్వహణ లేదని సివిల్‌ సప్లయిస్‌ ఉన్నతాధికారులకు వందలాది ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ క్రమంలో అధికారులు కైకలూరు ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆ తనిఖీల్లో గోడౌన్‌లో బియ్యం బస్తాల మాటున గోడ కట్టి ఉండడాన్ని గుర్తించారు. ఈ గోడ కనిపించకుండా బస్తాలను ఉంచారు. ఎవరైనా గోడౌన్‌లోకి వస్తే బస్తాలే ఉన్నట్టు కనిపిస్తాయి. బియ్యం బస్తాల మధ్యలో చేయి పెట్టిన ఓ అధికారి  గోడ ఉన్నట్టు గుర్తించారు. అక్కడ ఉండాల్సినన్ని బియ్యం బస్తాలు లేవని గుర్తించి, ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే కేసుకట్టి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాల్సిన సివిల్‌ సప్లయిస్‌ అధికారులు ఆ దిశగా ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదు. ఈ వ్యవహారంలో బాధ్యులెవరన్నది గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇందులో ఓ ప్రయివేటు వ్యక్తి ప్రమేయం కూడా ఉన్నదనే ఆరోపణలు వస్తున్నాయి. నిజం నిగ్గు తేలాల్సి ఉంది. 


ఇలా ఎలా మేనేజ్‌ చేస్తున్నారు? 

ప్రతి నెలా ఎంఎల్‌ఎస్‌ పాయింట్లకు ఇండెంట్‌ ప్రకారం బియ్యం సరఫరా చేస్తారు. ప్రస్తుతం రైతుల నుంచి కొనుగోలు చేసి ఆడించిన బియ్యమే కాకుండా, కేంద్ర కోటాలో భాగంగా ఎఫ్‌సీఐ నుంచి కూడా ఎంఎల్‌ఎస్‌ పాయింట్లకు బియ్యం లోడు వస్తోంది. ఈ సరుకును ఎంఎల్‌ఎస్‌ పాయింట్లకు దిగుమతి కానీయకుండా పక్కదారి పట్టించేస్తున్నట్టు కూడా అధికారుల పరిశీలనలో వెలుగు చూసినట్టు సమాచారం. అది తెలియకుండా చేసేందుకే గోడౌన్లో సరుకు ఉన్నట్టు భ్రమింపజేసేలా గోడ కట్టారని అర్థమవుతోంది. డీలర్లకు కొలత ప్రకారం కాకుండా బియ్యం బస్తాలు ఇస్తూ, మిగిల్చిన బస్తాలను, చాలా కాలంగా స్టోర్‌ చేస్తూ వచ్చిన వేలాది బస్తాలను మాయం చేసినట్టు అధికారులు గుర్తించినట్టు తెలుస్తోంది.


రూ.40 లక్షల బేరం.. ఎవరి కోసం? 

మొత్తం రూ.2 కోట్ల స్కామ్‌గా భావిస్తున్న ఈ వ్యవహారంలో బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాల్సి ఉంది. నిబంధనల ప్రకారం ఈ సరుకు తరలించినవారిపై క్రిమినల్‌ చర్యలతో పాటు పీడీ యాక్ట్‌ను కూడా ప్రయోగించాల్సి ఉంటుంది. ఇందుకు భిన్నంగా అక్రమానికి పాల్పడిన వారితో అధికారులు బేరసారాలకు దిగుతున్నట్టు తెలుస్తోంది. రూ.2 కోట్ల స్కామ్‌ కాబట్టి రూ.40 లక్షలు ఇస్తే కేసు తీవ్రత తగ్గించి, శిక్ష తగ్గేలా చూస్తామని ఆఫర్‌ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ ఆఫర్‌ ఎవరి కోసం అనేది వెలుగు చూడాల్సి ఉంది.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.