‘గుంత’ల్లో కాసుల వేట

ABN , First Publish Date - 2022-07-03T09:34:46+05:30 IST

‘గుంత’ల్లో కాసుల వేట

‘గుంత’ల్లో కాసుల వేట

ఆర్‌అండ్‌బీలో అధికారుల అవినీతి బాగోతం 

రోడ్డు మరమ్మతు పనుల్లో చేతివాటం

వర్క్‌ విలువలో 2 శాతం వసూలు 

ఇస్తేనే కాంట్రాక్టర్లతో ఒప్పందాలు 

కోస్తాలో చుక్కలు చూపించిన ఓ అధికారి  

పైఅధికారుల హెచ్చరికలూ బేఖాతర్‌ 

సొమ్ము అందాకే పాత తేదీలతో ఒప్పందాలు

మరో అధికారి ఏకంగా బెదిరింపులు 


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

రోడ్లు, భవనాల శాఖలో ఇటీవల బదిలీల బేరాల బాగోతం బయటకు రాగా.. ఇప్పుడు అధికారుల కాసుల కక్కుర్తి కంపు కొడుతోంది. రోడ్లపై గుంతలు పూడ్చే పనుల్లోనూ కొందరు అధికారులు చేతివాటం చూపారు. సెల్ఫ్‌టాక్స్‌ పేరిట వర్క్‌ విలువలో రెండు శాతం మేర కాంట్రాక్టర్ల నుంచి పిండుకున్నారు. కష్టాల్లో ఉన్నామని, ఇప్పుడేమీ ఇవ్వలేమన్న కాంట్రాక్టర్లకు అగ్రిమెంట్లు నిలిపివేసి మరీ దారికి తెచ్చుకున్నారు. కాంట్రాక్టర్లను ఇబ్బంది పెట్టొద్దంటూ సూచనలు వచ్చినా అంతా పైవారి ఆజ్ఞ అంటూ వసూలు కార్యక్రమం కొనసాగించారు. కాంట్రాక్టర్లు చేతికి చిక్కాకే పాత తేదీలతో ఒప్పందాలు చేసుకున్నారు. కొందరు అధికారులు కాంట్రాక్టర్లకు చుక్కలు చూపించిన ఉదంతాలు వెలుగు చూస్తున్నాయి. కోస్తాంధ్రలో కరువుకు కేరా్‌ఫగా నిలిచిన జిల్లాలో పనులు చేస్తున్న ఇద్దరు కాంట్రాక్టర్లను వేధించిన వైనం ఆడియో టేపుల ద్వారా బయటకొచ్చింది. ఓ అధికారి తనకు సెల్ఫ్‌టాక్స్‌ 2 శాతం చెల్లించాలని కాంట్రాక్టర్లకు కండీషన్‌ పెట్టినట్లు తెలిసింది. లంచం, కమిషన్‌, ముడుపులు అనే పదాలు ఆయన వద్ద వాడటానికి వీల్లేదట. అందుకే ఆయన ముద్దుగా సెల్ఫ్‌టాక్స్‌ అనే పేరు పెట్టారు. అది చేతికి అందితేనే అగ్రిమెంట్లపై సంతకాలు చేస్తానని మెలికపెట్టారు. సదరు అధికారి తీరుపై విసుగుచెందిన కాంట్రాక్టర్లు ఆ జిల్లా మంత్రిని కలిసి ఫిర్యాదు చేశారు. ఇదే విషయంపై ఆర్‌అండ్‌బీ ఉన్నతాధికారులు నిర్వహించిన సమావేశంలో చర్చకు వచ్చినట్లు తెలిసింది. కాంట్రాక్టర్లతో వెంటనే ఒప్పందాలు చేసుకోవాలని, పిచ్చివేషాలు వేయవద్దంటూ ఉన్నతాధికారులు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. అయినా నెలరోజుల పాటు కాంట్రాక్టర్లతో ఒప్పందాలు చేసుకోలేదని తెలిసింది. దీంతో పనులు చేయకపోయినా, ఆలస్యమైనా బ్యాంక్‌ గ్యారెంటీలు, ఈఎండీలు పనికిరావేమోనన్న దిగులుతో కాంట్రాక్టర్లు వర్క్‌ విలువలో 2 శాతం సొమ్మును సెల్ఫ్‌టాక్స్‌ కింద చెల్లించినట్లు తెలిసింది. ఆ తర్వాతే  సదరు అధికారి అగ్రిమెంట్లు చేసుకున్నట్టు తెలిసింది. 38 వర్క్‌లకు పాత తేదీలతోనే సంతకాలు చేసినట్లు తెలిసింది. ఆ తర్వాతే ఆయా కాంట్రాక్టర్లు ఇచ్చిన బ్యాంక్‌ గ్యారెంటీల వాస్తవికతను నిర్ధారించుకునేందుకు బ్యాంకులకు లేఖలు రాశారు. గత ఏడాది డిసెంబరు 29న అగ్రిమెంట్‌ అయిన వర్క్‌లకు ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్‌లో బ్యాంకులకు లేఖ రాయడం గమనార్హం. ఇదే అంశంపై కాంట్రాక్టర్లు ఆర్‌అండ్‌బీ ఉన్నతాధికారికి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. 


ఆఫీసులోనే కాంట్రాక్టర్‌కు వార్నింగ్‌!

రాజధానికి సమీప జిల్లాలో పనిచేస్తున్న అధికారిపై కూడా భారీగా ఫిర్యాదులు వచ్చాయి. టెండర్ల నుంచి వర్క్‌ అగ్రిమెంట్లు చేసుకునే విషయంలోనూ కాంట్రాక్టర్లను తీవ్రస్థాయిలో బెదరగొట్టారన్నది ఆ ఫిర్యాదుల్లోని సారాంశం. ఓ కాంట్రాక్టర్‌ ఏం చేయాలో బహిరంగంగా దిశానిర్దేశం చేయడంతో పాటు తనకు ఎదురొచ్చే సాహసం చేయవద్దంటూ ఆఫీసులోనే హెచ్చరించినట్లు తెలిసింది. ఇటీవల ఓ కాంట్రాక్టర్‌తో పెద్ద గొడవే జరిగినట్లు తెలిసింది. ఇది ప్రభుత్వం దృష్టికి వెళ్లింది. 


బ్యాంకు రుణంతో రోడ్డు పనులు

రాష్ట్రంలో 8 వేల కిలోమీటర్ల రోడ్ల మరమ్మతుల కోసం సర్కారు బ్యాంకు ఆఫ్‌ బరోడా నుంచి 2205 కోట్ల రూపాయల రుణం తీసుకుంది. ఉమ్మడి జిల్లాల వారీగా మొత్తం 1161 పనులకు గత ఏడాది టెండర్లు పిలిచారు. ఇవికాకుండా రెగ్యులర్‌ పిరియాడికల్‌ మెయింటెనెన్స్‌ కింద రోడ్డు మరమ్మతు పనులకు టెండర్లు పిలిచారు. కరోనా నేపఽథ్యంలో కాంట్రాక్టర్లు ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటారనే ఉద్దేశంతో వర్క్‌ విలువలో ఒక శాతం మేర ఈఎండీ చెల్లించేలా ప్రభుత్వం వెసులుబాటు ఇచ్చింది. నిబంధనల ప్రకారం టెండర్‌ ఖరారు చేశాక ఎల్‌1గా నిలిచిన కాంట్రాక్టర్‌ వర్క్‌ చేయడానికి ఏదో ఒక జాతీయ బ్యాంకు నుంచి బ్యాంక్‌ గ్యారెంటీలు తీసుకురావాలి. ఆ తర్వాత కాంట్రాక్టర్‌కు వర్క్‌ చేయడానికి సమ్మతం లేఖ (ఎల్‌ఓఏ) ఇస్తారు. కాంట్రాక్టర్‌ సమర్పించిన బ్యాంకు గ్యారెంటీ నిజమైనదా? కాదా అని నిర్ధారించుకునేందుకు వెంటనే సంబంధిత బ్యాంకు నుంచి వాస్తవిక నిర్ధారిత సర్టిఫికెట్‌ కోరుతారు. అది వచ్చిన వెంటనే కాంట్రాక్టర్‌తో ఒప్పందం చేసుకుంటారు.

Updated Date - 2022-07-03T09:34:46+05:30 IST