పర్యావరణ హితంగా... వెలుగు సుగంధం

ABN , First Publish Date - 2022-08-08T05:46:51+05:30 IST

కాసేపు అలా వెలిగి కరిగిపోయే కొవ్వొత్తులు తెలుసు. కానీ... గంటల కొద్దీ మండి... అలంకరణలో అమరి... సువాసనలు వెదజల్లే ‘సోయా వ్యాక్స్‌’ క్యాండిల్స్‌ చూశారా! పర్యావరణ హితమైన ఈ కాన్సెప్ట్‌నే తన పెట్టుబడిగా మార్చుకుని...

పర్యావరణ హితంగా... వెలుగు సుగంధం

కాసేపు అలా వెలిగి కరిగిపోయే కొవ్వొత్తులు తెలుసు. కానీ... 

గంటల కొద్దీ మండి... అలంకరణలో అమరి... 

సువాసనలు వెదజల్లే ‘సోయా వ్యాక్స్‌’ క్యాండిల్స్‌ చూశారా! 

పర్యావరణ హితమైన ఈ కాన్సెప్ట్‌నే తన పెట్టుబడిగా మార్చుకుని...

వంటింటి నుంచి ‘లక్కీ క్యాండిల్స్‌’ అధిపతిగా ఎదిగిన సుజాత మెడబాల కథ ఇది. 


‘‘పదేళ్ల కిందట మొదలైంది... నా ఈ క్యాండిల్‌ కథ. అప్పుడు మేము విశాఖపట్టణంలో ఉండేవాళ్లం. మా వారు స్టీల్‌ ప్లాంట్‌లో పనిచేసేవారు. మాకు ఇద్దరు పిల్లలు. ఇంటి పనులు పూర్తయిన తరువాత ఖాళీగా ఉండేదాన్ని. నాకది నచ్చలేదు. దీంతో కొన్నాళ్లు ప్రైవేట్లు చెప్పాను. అవి లేనప్పుడు వేరే పనులు చేస్తుండేదాన్ని. మా ఊళ్లో ఒకరోజు కొవ్వొత్తుల తయారీపై వన్డే వర్క్‌షాప్‌ నిర్వహించారు. నేనూ వెళ్లాను. కొత్తగానే కాదు... ఆసక్తిగానూ అనిపించింది. తరువాత మైనం తెచ్చుకుని ఇంట్లో సరదాగా ప్రయత్నించాను. అక్కడా ఇక్కడా చూసి నేర్చుకోవడం... తయారు చేయడం... అలా సరదాగా మొదలైన వ్యాపకం చివరకు నా దినచర్యలో భాగమైంది. 


థీమ్‌ క్యాండిల్స్‌ చూసి... 

ఈ క్రమంలోనే ఎకో ఫ్రెండ్లీ క్యాండిల్స్‌ గురించి తెలిసింది. వాటిపై లోతుగా అధ్యయనం చేశాను. మా అబ్బాయి భరత్‌ ఒక ఈవెంట్‌కు వెళ్లినప్పుడు అక్కడ ఒక థీమ్‌లో పేర్చిన క్యాండిల్స్‌ చూశాడు. అప్పట్లో థీమ్‌ క్యాండిల్స్‌ ఒకటి రెండు పెద్ద మాల్స్‌లో మినహా దొరికేవి కాదు. అప్పుడు అనిపించింది... నేనెందుకు ఇలా విభిన్నమైన క్యాండిల్స్‌ తయారు చేయకూడదని! అవి కూడా పర్యావరణ హితమైనవైతే అటు ప్రకృతికి, ఇటు వినియోగదారులకు ప్రయోజనకరంగా ఉంటుంది కదా! నా ఆలోచన ఇంట్లో వాళ్లకు చెబితే... ఎంతో బాగుందని ప్రోత్సహించారు. 


వెజిటబుల్‌ వ్యాక్స్‌తో...  

మా కొవ్వొత్తుల్లో ప్రత్యేకత ఏంటంటే... పూర్తిగా పర్యావరణ హితమైనవి. సాధారణంగా క్యాండిల్స్‌ను తయారీలో పారాసైన్‌ ఉపయోగిస్తారు. అంటే పెట్రోలియం ఉత్పత్తిలో మిగిలిపోయిన మెటీరియల్‌ నుంచి ఈ వ్యాక్స్‌ తీస్తారు. అవి వెలిగించినప్పుడు హానికరమైన కార్బన్‌మోనాక్సైడ్‌ విడుదలవుతుంది. పొగ కూడా ఎక్కువగా వస్తుంది. అయితే మా క్యాండిల్స్‌లో వెజిటబుల్‌ వ్యాక్స్‌ వాడతాం. ఉదాహరణకు సోయాబీన్‌, పామ్‌ ఆయిల్‌, హనీ బీ నుంచి తీసిన మైనంతో చేస్తున్నాం. త్వరలోనే కోకోనట్‌ వ్యాక్స్‌తో కూడా రూపొందించే ఆలోచనలో ఉన్నాం. ఈ క్యాండిల్స్‌ వెలిగించినప్పుడు విషపూరితమైన ఉద్గారాలు విడుదల కావు. ఒకవేళ మనం పారేసినా సులువుగా భూమిలో కలిసిపోతాయి. మేం వాడే కంటైనర్లు కూడా పర్యావరణ హితమైనవే. 


లైఫ్‌స్టయిల్‌కు తగినట్టు... 

వ్యాక్స్‌లన్నీ విదేశాల నుంచి దిగుమతి అవుతాయి. అవి తయారు చేయాలంటే పెద్ద మిషనరీ కావాలి. మేం చేసేదల్లా డిజైనింగ్‌, షేపింగ్‌, కలరింగ్‌, మేకింగ్‌. సువాసనల కోసం కెమికల్స్‌ కాకుండా ప్రకృతి సిద్ధమైన ఎసెన్షియల్‌ ఆయిల్స్‌ ఉపయోగిస్తాం. లైఫ్‌స్టయిల్‌కు తగినట్టు... అంటే పూజ గదిలో వాడే వాటికి ఒక రకమైన సువాసనలు, వేడుకల్లో వెలిగించే వాటికి మరొక థీమ్‌తో అందిస్తాం. మున్ముందు హెల్దీ క్యాండిల్స్‌ కూడా తేవాలనుకొంటున్నాం. మా దగ్గర ఉన్న వెరైటీలు చూపించి అమ్మడం కాకుండా... కస్టమర్లు కోరుకున్న థీమ్‌లో అందివ్వడం మా ప్రత్యేకత. అందుకే పోటీ తట్టుకుని నిలబడగలుగుతున్నాం. పిల్లర్‌, సెంటెడ్‌, గ్లాస్‌, జార్‌, టెక్చ్సర్‌, ఎల్‌ఈడీ, ఫ్లోటింగ్‌, జల్‌, సోయా, బ్లెండెడ్‌ ఇలా కస్టమర్ల అభిరుచికి అనుగుణంగా రకరకాల క్యాండిల్స్‌ రూపొందిస్తున్నాం. ఇన్ని రకాల వ్యాక్స్‌లతో క్యాండిల్స్‌ తయారు చేసే కంపెనీలు దేశంలోనే చాలా తక్కువ. 




అదీ ముఖ్యమే... 

ఇతర దేశాల నుంచి కూడా ఆర్డర్లు వస్తున్నాయి. మా దగ్గర కొనుక్కొని చాలామంది అమెజాన్‌ వంటి వాటిల్లో రీటైల్‌గా విక్రయిస్తున్నారు. ధర ఒకటికి ముప్ఫైతో మొదలై కొన్ని వేల వరకు ఉంటుంది. ఉదాహరణకు ఓ కస్టమర్‌ కోసం 30 కేజీల క్యాండిల్‌ చేశాం. దానికి రూ.20 వేలు ఖర్చయింది. మరొకరు 45 గంటలు వెలిగే కొవ్వొత్తి కావాలన్నారు. ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ వాళ్లకు బర్నింగ్‌ టైమ్‌ కూడా ముఖ్యం. రెండు మూడు గంటల తరువాత ఆరిపోయిందనుకోండి... మళ్లీ మన దగ్గరకు రారు. ముందుగానే కస్టమర్‌కు ఏంకావాలో తెలుసుకొని చేస్తాం కాబట్టి మా బిజినె్‌సలో పెద్దగా ఇబ్బందులు, సమస్యలంటూ ఏమీ ఉండవు.’’ 


ఇంట్లో మొదలై... 

ఇక ఆలస్యం చేయలేదు. ఆలోచనను వెంటనే ఆచరణలో పెట్టాను. అనేక ప్రయోగాలు, ప్రయత్నాల తరువాత ఎకో ఫ్రెండ్లీ కాన్సె్‌ప్టతో 2012లో ‘లక్కీ క్యాండిల్స్‌’ ప్రారంభమైంది. అంతా బానే ఉంది. కానీ తయారు చేసిన కొవ్వొత్తులకు మార్కెటింగ్‌ ఎలా? ఆ బాధ్యతను తన భుజాన వేసుకున్నాడు మా అబ్బాయి. మావారికి స్టోర్‌ ఉంది. దాని ద్వారా కూడా ఆర్డర్లు వస్తుంటాయి. కొన్ని వందల రూపాయలతో ఇంట్లో మొదలైన కుటీర పరిశ్రమ మాది. ఇప్పుడు ఏడాదికి యాభై లక్షలకు పైగా టర్నోవర్‌తో మార్కెట్‌లో పోటీపడుతున్నాం. కేజీ... రెండు కేజీలు... అలా పెరుగుతూ ప్రస్తుతం నెలకు ఏడెనిమిది టన్నుల వ్యాక్స్‌ ఉపయోగిస్తున్నాం. మిషన్లు లేవు. ఎన్ని వేల ఆర్డర్‌ అయినా చేతులతోనే తయారు చేస్తాం. మా దగ్గర పనిచేసే వారందరూ మహిళలే. నాలాంటి మహిళలకు ఆదాయ మార్గాలు చూపించాలన్న లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నా. ఆసక్తి ఉన్నవారికి శిక్షణ కూడా ఇస్తున్నాను.


 హనుమా 


Updated Date - 2022-08-08T05:46:51+05:30 IST