మళ్లీ ‘స్థానిక’ సమరం

ABN , First Publish Date - 2021-11-02T06:22:32+05:30 IST

జిల్లాలోని స్థానిక సంస్థల్లో గతంలో వివిధ కారణాలతో నిలిచిపోయిన ఎన్నికలను నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ సోమవారం షెడ్యూల్‌ను విడుదల చేసింది.

మళ్లీ ‘స్థానిక’ సమరం

ఎన్నిక నిలిచిపోయిన స్థానాలకు షెడ్యూల్‌ విడుదల

రేపు ఎన్నికల నోటిఫికేషన్‌ 

14న పంచాయతీలకు.. 

15న పురపాలక సంఘాలకు.. 

16న జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్‌.. 

ఎన్నికలు జరిగే స్థానాలు 101

జెడ్పీటీసీలు 3

పురపాలక సంఘాలు 2

పంచాయతీలు 5

పంచాయతీ వార్డులు  91 


ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం : జిల్లాలోని స్థానిక సంస్థల్లో గతంలో వివిధ కారణాలతో నిలిచిపోయిన ఎన్నికలను నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ సోమవారం షెడ్యూల్‌ను విడుదల చేసింది. జిల్లాలో పెడన, విస్సన్నపేట, జి-కొండూరు జెడ్పీటీసీ స్థానాలకు, జగ్గయ్యపేట, కొండపల్లి పురపాలక సంఘాలకు, ఐదు పంచాయతీలు, 91 పంచాయతీ వార్డు సభ్యుల పదవులకు, ఆరు ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిపేందుకు షెడ్యూల్‌ను విడుదల చేశారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలతో పాటు పంచాయతీలు, పురపాలక సంఘాల్లో ఎన్నికల నిర్వహణ కోసం ఈ నెల మూడో తేదీన రిటర్నింగ్‌ అధికారులు నోటిఫికేషన్‌ జారీ చేస్తారు. ఆ రోజు నుంచి ఐదో తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఆరో తేదీన నామినేషన్ల పరిశీలన, 7, 8 తేదీల్లో అభ్యంతరాలు స్వీకరిస్తారు. పురపాలక సంఘాల్లో అభ్యర్థుల నామినేషన్లపై అభ్యంతరాల స్వీకరణ ఉండదు. ఎనిమిదో తేదీనే నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు. అదే రోజు మధ్యాహ్నం మూడు గంటలకు అభ్యర్థుల తుది జాబితాలను ప్రకటిస్తారు. పంచాయతీలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణకు గడువు తొమ్మిదో తేదీ. అదేరోజు మధ్యాహ్నం మూడు గంటలకు పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాలను ప్రకటిస్తారు. 


14న పంచాయతీల్లో పోలింగ్‌ 

పంచాయతీల్లో ఈ నెల 14వ తేదీ ఉదయం ఏడు గంటల నుంచి మఽధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్‌ నిర్వహిస్తారు. రెండు గంటల నుంచి కౌంటింగ్‌ నిర్వహించి, ఫలితాలను వెల్లడిస్తారు. పంచాయతీల్లో ఏదైనా కారణంతో రీపోలింగ్‌ నిర్వహించాల్సి వస్తే 15వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించి, అదే రోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఓట్లు లెక్కించి, తుది ఫలితాలు వెల్లడిస్తారు.  


15న పురపాలక సంఘాల్లో..  

పురపాలక సంఘాల్లో ఈ నెల 15వ తేదీ ఉదయం ఏడు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్‌ నిర్వహిస్తారు. రీపోలింగ్‌ నిర్వహించాల్సి వస్తే 16వ తేదీన నిర్వహిస్తారు. 17వతేదీ ఉదయం ఎనిమిది గంటల నుంచి ఓట్లు లెక్కించి, ఫలితాలను వెల్లడిస్తారు. 


16న ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు ...

జిల్లాలోని ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు 16వ తేదీ ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటలవరకు పోలింగ్‌ నిర్వహిస్తారు. రీపోలింగ్‌ జరపాల్సి వస్తే 17న జరుపుతారు. 18వ తేదీ ఉదయం ఎనిమిది గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి, తుది ఫలితాలను వెల్లడిస్తారు.


రెండు పురపాలక సంఘాల్లో..

జిల్లాలో కొత్తగా ఏర్పడిన జగ్గయ్యపేట, కొండపల్లి పురపాలక సంఘాలకు మొట్టమొదటిసారిగా ఎన్నికలు జరగనున్నాయి. వీటితో పాటు మచిలీపట్నం మునిసిపల్‌ కార్పొరేషన్‌లోని 32వ డివిజన్‌కు ఉప ఎన్నికను నిర్వహించనున్నారు. ఇక్కడ వైసీపీ కార్పొరేటర్‌ చింతాగిరి మృతి చెందడంతో ఉప ఎన్నిక అవసరమైంది.


ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలు ఇవీ...

ముదినేపల్లి మండలంలోని వణుదుర్రు, ముదినేపల్లి-2, నాగాయలంక మండలంలోని పర్రచివర, గన్నవరం మండలంలోని చినఅవుటపల్లి, పెనుగంచిప్రోలు మండలంలోని కొణకంచి, నూజివీడు మండలంలోని దేవరగుంట ఎంపీటీసీ స్థానాలకు, విస్సన్నపేట, పెడన, జి- కొండూరు జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరపనున్నట్లు జెడ్పీ సీఈవో సూర్యప్రకాశరావు తెలిపారు. 


ఎన్నికలు జరిగే పంచాయతీలు ఇవీ..

జిల్లాలోని  ఘంటసాల మండలంలోని మల్లంపల్లి, కలిదిండి మండలంలోని కలిదిండి, అమరావతి,  ముదినేపల్లి మండలంలోని ములకపల్లి, నందివాడ మండలంలోని పోలుకొండ పంచాయతీలకు, 44 పంచాయతీల్లోని 91 వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు జరగనున్నాయి. 63 పోలింగ్‌ స్టేషన్లలో 21,503 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఆయా పంచాయతీలవారీగా వార్డు సభ్యులకు రిజర్వేషన్లు ప్రకటించినట్టు జిల్లా పంచాయతీ అధికారి డి.జ్యోతి తెలిపారు. 

Updated Date - 2021-11-02T06:22:32+05:30 IST