రాజధానిలో ష్నీడర్‌ ఫ్యాక్టరీ

ABN , First Publish Date - 2022-09-30T08:44:44+05:30 IST

ఎలక్ట్రిక్‌ రంగంలో అంతర్జాతీయ స్థాయిలో పేరుగాంచిన ఫ్రాన్స్‌కు చెందిన ష్నీడర్‌ ఎలక్ర్టిక్‌ కంపెనీ హైదరాబాద్‌ నగరంలో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమైంది.

రాజధానిలో ష్నీడర్‌ ఫ్యాక్టరీ

  • 18 ఎకరాల్లో, 300 కోట్ల పెట్టుబడులకు సిద్ధం..
  • జీఎంఆర్‌ ఇండస్ర్టియల్‌ పార్క్‌లో ఏర్పాటు
  • సెప్టెంబరు 2023 నాటికి పనులు పూర్తి
  • 3వేల మందికి ఉపాధి అవకాశాలు
  • శంకుస్థాపన చేసిన మంత్రి కేటీఆర్‌
  • నగరంలో ఫ్రెంచ్‌ బ్యూరో, హౌస్‌ ఆఫ్‌ ఫ్రాన్స్‌ 
  • వచ్చే ఏడాది ఫ్రాన్స్‌ వీసా సేవలు ఇక్కడి నుంచే
  • ఫ్రాన్స్‌ రాయబారి ఇమ్మాన్యుయేల్‌ ప్రకటన 

హైదరాబాద్‌, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): ఎలక్ట్రిక్‌ రంగంలో అంతర్జాతీయ స్థాయిలో పేరుగాంచిన ఫ్రాన్స్‌కు చెందిన ష్నీడర్‌ ఎలక్ర్టిక్‌ కంపెనీ హైదరాబాద్‌ నగరంలో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమైంది. విద్యుత్‌ నిర్వహణ, ఆటోమేషన్‌, డిజిటల్‌ ఉత్పత్తుల పరిశ్రమను ఏర్పాటుచేయడానికి ముందుకొచ్చింది. జీఎంఆర్‌ ఇండస్ట్రియల్‌ పార్కులో 18ఎకరాల్లో ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనున్నట్టు ష్నీడర్‌ ఎలక్ర్టిక్‌ గ్లోబల్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ జావేద్‌ అహ్మద్‌ తెలిపారు. గురువారం నగరంలో నిర్వహించిన కార్యక్రమంలో రిమోట్‌ ద్వారా ఫ్యాక్టరీ శంకుస్థాపన పనులను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధులను మంత్రి ప్రశంసించారు. రూ.300 కోట్ల పెట్టుబడితో ఏర్పాటుకానున్న ష్నీడర్‌ ఫ్యాక్టరీ సెప్టెంబరు 2023 నాటికి పూర్తవుతుందన్నారు.


కంపెనీ పూర్తిస్థాయిలో ప్రారంభమైతే దాదాపు 3వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి పేర్కొన్నారు. ఈ కంపెనీ ఏర్పాటుతో స్థానిక పారిశ్రామిక అవసరాలు తీరడంతోపాటు రాష్ట్రంలో ఆదాయం సృష్టించడానికి అవకాశాలు పెరుగుతాయని మంత్రి చెప్పారు. భారత్‌లో ఫ్రాన్స్‌ రాయబారి ఇమ్మాన్యుయేల్‌ లెనైన్‌ మాట్లాడుతూ.. దేశంలో ష్నీడర్‌ ఎలక్ర్టిక్‌ దశాబ్దాలుగా వ్యాపారం చేస్తోందని, కొత్త ఫ్యాక్టరీ ఇండో-ఫ్రెంచ్‌ భాగస్వామ్యానికి ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. ష్నీడర్‌ ఇండియా ఎండీ, సీఈవో అనిల్‌ చౌదరి మాట్లాడుతూ.. హైదరాబాద్‌ కేంద్రంగా ఉత్పత్తుల ఎగుమతులను పెంచాలన్నది తమ లక్ష్యమన్నారు. ఫ్యాక్టరీ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చాక ఇక్కడ తయారైన ఉత్పత్తులను 30 దేశాలకు ఎగుమతి చేస్తామన్నారు.


పెట్టుబడులకు స్వర్గధామం..

వ్యాపార అనుకూల విధానాలతో తెలంగాణ పెట్టుబడుదారులకు స్వర్గధామంగా నిలుస్తోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. గురువారం నగరంలో ఫ్రాన్స్‌ వ్యాపారవేత్తలతో జరిగిన సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పారిశ్రామిక అనుకూల విధానాలు, వివిధ రంగాల్లో తెలంగాణ సాధించిన అభివృద్ధి, భవిష్యత్తు అవకాశాలపై మంత్రి ప్రెజెంటేషన్‌ ఇచ్చారు. టీఎస్‌ ఐపాస్‌ లాంటి విప్లవాత్మక విధానంతో రాష్ట్రంలో పరిశ్రమల సంఖ్య భారీగా పెరుగుతోందని, యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని తెలిపారు. గడచిన ఎనిమిదేళ్లలో జీఎ్‌సడీపీ 125శాతం, ఐటీ ఎగుమతులు 140శాతం పెరిగాయన్నారు. రాష్ట్రంలో ఉన్న వ్యాపార అవకాశాలను వినియోగించుకునేందుకు భారీగా పెట్టుబడులు పెట్టాలని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ ఫ్రాన్స్‌ వ్యాపారవేత్తలకు విజ్ఞప్తి చేశారు.


ఫ్రాన్స్‌ రాయబారి ఇమ్మాన్యుయేల్‌ లెనైన్‌ మాట్లాడుతూ.. నగరంలో ఫ్రెంచ్‌ బ్యూరోను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. అలాగే భారత్‌-ఫ్రాన్స్‌ పారిశ్రామికవేత్తల భేటీలు, ప్రతినిధుల సమావేశాల కోసం హౌస్‌ ఆఫ్‌ ఫ్రాన్స్‌ను ఏర్పాటుచేస్తామన్నారు. రాయబారి ప్రకటనపై మంత్రి కేటీఆర్‌ ట్విటర్‌లో హర్షం వ్యక్తంచేశారు. ఫ్రెంచ్‌ బ్యూరో ఏర్పాటు వచ్చే ఏడాది మధ్యలో పూర్తవుతుందని, తర్వాత వీసా సేవలను ఇక్కడి నుంచే పొందే వీలుంటుందని తెలిపారు.


చేనేతకు చేయూత భేష్‌: ఒడిశా మంత్రి

ఒడిశా చేనేత, జౌళి శాఖ మంత్రి రీటా సాహు నేతృత్వంలోని అక్కడి అధికారుల బృందం గురువారం రాష్ట్రంలో పర్యటించింది. ఇందులో భాగంగా పోచంపల్లి, కొయ్యలగూడెంలోని చేనేత క్లస్టర్‌ను సందర్శించింది. అక్కడి చేనేత కార్మికులతో మంత్రి రీటా సాహు మాట్లాడారు. ప్రధానంగా అక్కడ ఉత్పత్తి చేస్తున్న ఇక్కత్‌ పట్టు చీరలు, వాటి డిజైన్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. చేనేత కార్మికుల నైపుణ్యాన్ని మెచ్చుకున్నారు. ఆ తర్వాత నగరంలో చేనేత, జౌళి, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నేతన్నల సంక్షేమం, చేనేత పరిశ్రమ అభివృద్థి కోసం రాష్ట్రంలో అమలుచేస్తున్న కార్యక్రమాలను రీటా సాహుకు కేటీఆర్‌ వివరించారు. రాష్ట్రంలో టెక్స్‌టైల్‌ పరిశ్రమ అభివృద్ధిని, నేతన్నల కోసం ప్రవేశపెట్టిన పథకాలను ఒడిశా మంత్రి ప్రశంసించారు. తమ రాష్ట్రంలో పర్యటించాల్సిందిగా మంత్రి కేటీఆర్‌ను ఆమె ఆహ్వానించారు. ఈ సందర్భంగా రీటా సాహుతో పాటు ఒడిశా అధికారులను కేటీఆర్‌ సన్మానించారు.

Updated Date - 2022-09-30T08:44:44+05:30 IST