విద్వత్కథకుడు

ABN , First Publish Date - 2020-10-30T06:23:14+05:30 IST

ఆంధ్రత్వం మూర్తీభవించిన అనన్య సదృశములైన రచనలతో అజరామరమైన కీర్తిని సముపార్జించుకున్న శ్రీ శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి మరణం తెనుగుల దురదృష్టం...

విద్వత్కథకుడు

ఆంగ్ల వాసనలేనిది అతి ఛాందసమగుననుకొనే రోజులలో, ఆ వాసన పొంతపోకనే అత్యాధునికతా విలసితాలైన అనేక కథలలో అపూర్వమైన ఆంధ్రత్వం వలపుల గుబాళింపు జేసి, తన రచనల కొక విశిష్ట వ్యక్తిత్వం సముపార్జించుకొన్న ఆ విద్వత్కథకుని సాహిత్య స్రవంతి తెనుగు మాగాణాలలో బంగరుపంట పెట్టి పోయినది. కోసికొను చేవకొలది అందలి అనితర ప్రతిభా సంపత్తి దృగ్గోచరమవుతుంది. హృదయ వికాసక మవుతుంది.


ఆంధ్రత్వం మూర్తీభవించిన అనన్య సదృశములైన రచనలతో అజరామరమైన కీర్తిని సముపార్జించుకున్న శ్రీ శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి మరణం తెనుగుల దురదృష్టం. ఆంధ్ర మహోదధిని తఱచి వెలికిదీసిన మీగడ తఱకలతో ఆయన కలానికొక విశిష్టత లభించినది. తెనుగు వైదిక కుటుంబాలలోని మనుగడ, ఆ మనుగడ నాలంబనం చేసుకొని తీవసాగిన తెనుగు, మాటకు వ్రాతకు మధ్యనున్న తెరను తొలగించుకొని నిర్మల స్ఫటికం వలె ఆయన కథలలో, నాటికలలో సాక్షాత్కరించినది. 


అలనాటి ఆంధ్ర సంస్థానాలలో అవతరించి, నలుదిక్కుల గుబుల్కొన్న సంస్కృతీ విశేషం ఆయన కొన్ని రచనలలో నిస్తుల రూపంలో తొణికిసలాడి పాఠకులను విస్మయావిష్టులను చేసింది. జావా సుమత్రాలలో ఆనాడు తెనుగువాడు ఎగురవేసిన జయపతాక ఈనాటి శ్రీసుబ్రహ్మణ్యశాస్త్రిగారి కలంలో రెపరెపలాడింది. 

వాల్మీకి వాక్కులలోని మధురిమ, మార్దవం, వ్యాసుని ప్రవచనాలలోని గభీరతా ముద్ర ఆయన తెనుగు చేసుకొని, తన ముద్రతో ముద్రించి చిరస్థిర కీర్తి మూర్తితో కలకాలం మనగల దారినెన్నడో కనుగొన్నాడు. ఆంగ్ల వాసనలేనిది అతి ఛాందసమగుననుకొనే రోజులలో, ఆ వాసన పొంతపోకనే అత్యాధునికతా విలసితాలైన అనేక కథలలో అపూర్వమైన ఆంధ్రత్వం వలపుల గుబాళింపు జేసి, తన రచనల కొక విశిష్ట వ్యక్తిత్వం సముపార్జించుకొన్న ఆ విద్వత్కథకుని సాహిత్య స్రవంతి తెనుగు మాగాణాలలో బంగరుపంట పెట్టి పోయినది. కోసికొను చేవకొలది అందలి అనితర ప్రతిభా సంపత్తి దృగ్గోచరమవుతుంది. హృదయ వికాసక మవుతుంది. ఆయనను పోగొట్టుకున్న ఆంధ్రులకిదే మా సానుభూతి నందిస్తున్నాము. 


1969 ఫిబ్రవరి 28 ‘ఆంధ్రజ్యోతి’ సంపాదకీయం

‘విద్వత్కథకుడు: శ్రీ శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి’ నుంచి

Updated Date - 2020-10-30T06:23:14+05:30 IST