నెర్రెలుబారిన మరో ఆరు భవనాలు

Published: Wed, 29 Dec 2021 08:44:25 ISTfb-iconwhatsapp-icontwitter-icon
నెర్రెలుబారిన మరో ఆరు భవనాలు

- కూల్చివేతకు రంగం సిద్ధం 

- యుద్ధప్రాతిపదికన ఖాళీ చేయించిన అధికారులు


చెన్నై: స్థానిక తిరువొత్తియూరులో స్లమ్‌ క్లియరెన్స్‌ బోర్డు గతంలో నిర్మించిన మరో ఆరు భవనాలు కూడా శిథిలావస్థకు చేరాయి. అవి ఏ క్షణమైనా కూలేందుకు సిద్ధంగా వున్నట్లు గుర్తించిన అధికారులు.. వాటిల్లో నివశిస్తున్న పేదలను యుద్ధప్రాతిపదికన ఖాళీ చేయించారు. వారందరికీ పలు కల్యాణమండపాలకు తరలించారు. సోమవారం కుప్పకూలిన పాత కట్టడం సమీపంలోనే ఈ ఆరు భవనాలు కూడా వుండడం గమనార్హం. తిరువొత్తియూరు అరివాకుళం వద్దనున్న భవనసము దాయాలలో డీ బ్లాక్‌ కట్టడం కూలిపడడంతో 24 నివాసగృహాలు నేలమట్టమయ్యాయి. రెండు రోజులకు ముందే ఆ గృహాలలో నివసిస్తున్నవారిని ఖాళీ చేయించడంతో ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదు. ఈ ప్రమాదం జరిగినవెంటనే మంత్రి దామో అన్బరసన్‌, గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ కమిషనర్‌ గగన్‌దీప్‌ సింగ్‌ బేదీ అక్కడి పాత భవన సముదాయాలన్నింటిని పరిశీలించారు. ఆ భవన సముదాయాల పటిష్టత  గురించి ఇంజనీరింగ్‌ నిపుణులతో చర్చలు జరిపారు. ఆ తర్వాత అన్నా విశ్వవిద్యా లయానికి చెందిన ఇంజనీరింగ్‌ నిపుణులను రప్పించి పరిశీలన జరిపించారు. సోమవారం రాత్రి అన్నా విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్‌ నిపుణులు క్షుణ్ణంగా తనిఖీ చేసి అక్కడి ఆరు గృహ సముదాయాలు నివాసయోగ్యంగా లేవని నిర్ధారించారు. దీనితో ప్రభుత్వ అధికారులు కూలిపడిన భవన సముదాయానికి చేరువగా ఉన్న ఆరు బ్లాకుల భవన సముదాయాలను కూల్చివేయడానికి సిద్ధమవుతున్నారు. సోమవారం డీబ్లాకు భవనంలోని సగభాగమే కూలింది. మిగత సగభాగం కూలేందుకు సిద్ధంగా ఉంది. ఆ భవనం కూలితే పక్కనే ఉన్న ‘ఈ‘ బ్లాకు భవనం ధ్వంసమవుతుందని భావించిన అధికారులు ఆ బ్లాకులో ప్లాట్లలో నివసిస్తున్నవారిని మంగళవారం ఉదయం నుంచి ఖాళీ చేయిస్తున్నారు. ఇదే విధంగా ఏ, బీ, సీ, ఎఫ్‌ బ్లాక్‌ భవనసముదాయాలను కూడా కూల్చివేయాలని నిర్ణయించి, ఆ బ్లాకులలో వివిధ ప్లాట్లలో నివసిస్తున్నవారిని కూడా అధికారులు ఖాళీ చేయించారు. 


కల్యాణమండపాలకు తరలింపు 

ఆ ప్రాంతంలో ఇళ్ళను ఖాళీ చేయించినవారికి తిరువొత్తియూరు సమీపంలోని నాలుగు కళ్యాణ మండపాలలో అధికారులు బస సదుపాయం కల్పిం చారు. ఆరు బ్లాకులలో నివసించే 300 కుటుంబాలకు పైగా కళ్యాణ మండపాలకు సామగ్రితోపాటు బయలు దేరారు.కళ్యాణమండపాలలో తలదాచుకుంటున్నవారికి వీలైనంత త్వరగా అక్కడి సమీపంలో లేదా నగరంలోని ఇతర ప్రాంతాలలో గృహ నిర్మాణ సంస్థకు చెందిన గృహాలను కేటాయించనున్నట్టు అధికారులు పేర్కొన్నారు.


తనియరసుకు సీఎం ప్రశంస

తిరువొత్తియూరులో కూలిపడిన భవనసముదా యంలో నివసిస్తున్న 200 మందిని సకాలంలో కాపాడిన స్థానిక డీఎంకే మాజీ కౌన్సిలర్‌కు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అక్కడి స్లమ్‌ క్లియరెన్స్‌ బోర్డుకు చెందిన ఏడు బ్లాక్‌లలో నివసిస్తున్నవారు తమ సమస్యలను తనియరసుకు తెలిపి పరిష్కరించుకునేవారు. ఆ దిశగానే రెండు రోజులకు ముందు డీ బ్లాక్‌ భవనసముదాయంలో 24 ప్లాట్లలో నివసిస్తున్నవారు తమ ఇళ్ళలో వరుసగా బీటలు ఏర్పడుతున్నాయని, తరచూ భూకంపం వచ్చినట్టు అటూ ఇటూ ఊగుతున్నాయని తనియరసుకు తెలిపారు. వెంటనే ఆయన ఆ ప్లాట్‌లను పరిశీలించినప్పుడు రెండిళ్ళలో గోడలలో పగుళ్ళు ఏర్పడ్డాయి. దీనితో స్లమ్‌ క్లియరెన్స్‌ బోర్డు చీఫ్‌ ఇంజనీర్‌కు ఫిర్యాదు చేయడం, ఆయన వెంటనే ఆ ఇళ్ళలో నివసిస్తున్నవారిని ఖాళీ చేయించమని ఆదేశించారు. ఆ సమయంలో తనియరసు 24 ప్లాట్లలో నివసిస్తున్నవారికి ఆ భవనం కూలిపడుతుందన్న సమాచారం తెలుపకుండా వీలైనంత త్వరగా వారిని ఖాళీ చేయించారు. ఈ విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి స్టాలిన్‌ మంగళవారం ఉదయం తనియరసును సచివాలయానికి పిలిపించుకుని సత్కరించారు. సీఎంతోపాటు శాసనసభ్యులు ఎస్‌. సుదర్శనం, కేపీ శంకర్‌ ఆయనను అభినందించారు.

నెర్రెలుబారిన మరో ఆరు భవనాలు


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.