చదువులు సాగేనా?

ABN , First Publish Date - 2021-07-21T06:01:10+05:30 IST

బడిబాటకు కరోనా గండికొడుతోంది.

చదువులు సాగేనా?

వణికిస్తున్న థర్డ్‌వేవ్‌.. పాఠశాల విద్య అగమ్యగోచరం  

ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్‌లైన్‌ తరగతుల ఊసేలేదు

పాత తరగతుల్లోనే విద్యార్థుల అభ్యసన సామర్థ్య పరీక్షలు

కొత్త తరగతుల పుస్తకాలు అందజేయని వైనం

గతేడాది ప్రాథమిక పాఠశాల పనిదినాలు 55 మాత్రమే

టీచర్లకు రెండు డోసుల వ్యాక్సిన్‌ వేసేనా?


బడిబాటకు కరోనా గండికొడుతోంది. ఆగస్టు 16 నుంచి పాఠశాలలను పునఃప్రారంభించాలని ప్రభుత్వం సూచన ప్రాయంగా నిర్ణయించినా, థర్డ్‌వేవ్‌ హెచ్చరికలు వెనకడుగు వేయించే సూచనలు కనిపిస్తున్నాయి. కొవిడ్‌ భయంతో తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలలకు ఎంతవరకు పంపిస్తారనేది సందేహమే. మరోపక్క ప్రభుత్వ పాఠశాలలు తెరుచుకోకపోతే ప్రత్యామ్నాయం గురించి ఆలోచించాలని విద్యావేత్తలు సూచిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో బోధనకు సప్తగిరి చానల్‌కే పరిమితం కాకుండా అమ్మఒడికి ఇచ్చే డబ్బుతో పిల్లలకు ట్యాబ్‌లు కొని అందజేసి ఆన్‌లైన్‌ తరగతులను నిర్వహిస్తే ప్రయోజనం ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 


ఆంధ్రజ్యోతి, మచిలీపట్నం : ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ఈ విద్యాసంవత్సరం చదువు సంకటస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. ఈ ఏడాది పాఠశాలలు ఎప్పటికి తెరచుకుంటాయో స్పష్టతలేదు. ప్రభుత్వం నిర్ణయించినట్టు ఆగస్టు 16వతేదీ నుంచి పాఠశాలలు తెరిచినా తల్లిదండ్రులు పిల్లలను ఎంతవరకు పంపుతారనేది అనుమానమే. కరోనావ్యాప్తి కారణంగా గడిచిన విద్యాసంవత్సరంలో పాఠశాలలు మొక్కుబడిగానే పనిచేశాయి. మొత్తం 220 రోజులు పనిచేయాల్సి ఉండగా, ప్రాథమిక పాఠశాలలు కేవలం 55 రోజులే పనిచేశాయి. ఈ ఏడాది ఎన్నిరోజులు నిర్వహిస్తారనేది కాలమే నిర్ణయించాల్సి ఉంది.


అభ్యసన సామర్థ్య పరీక్షలు 

జిల్ల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు 4,444 ఉన్నాయి. వాటిలో 6.20 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ విద్యాసంవత్సరంలో విద్యార్థులను పై తరగతులకు పంపినా, పాఠ్య పుస్తకాలు అందజేయలేదు. ఈ నెల 27వ తేదీ నుంచి 31వ తేదీ వరకు విద్యార్థుల అభ్యసన సామర్థ్య పరీక్షలు నిర్వహించాలని, గత ఏడాది చదివిన తరగతిలోనే ఈ పరీక్షలు  నిర్వహించాలని నిర్ణయించారు. ఇంటివద్దనే పరీక్షలు రాయించాలని,  ఇందుకోసం బుక్‌లెట్లు, వర్క్‌షీట్లు ఇవ్వాలని విద్యాశాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. వీటిని జిల్లా ఉమ్మడి పరీక్షల నిర్వహణ సంస్థ (డీసీఈబీ) ముద్రించి, పాఠశాలలకు ఇవ్వాలని నిర్ణయించారు. ఒకటి, రెండు తరగతులకు లెవెల్‌-1, ఐదో తరగతి వరకు లెవెల్‌-2 బుక్‌లెట్లు తయారు చేయాలని నిర్ణయించారు. లెవెల్‌-3లో ఆరు నుంచి పదో తరగతి వరకు సబ్జెక్టులవారీగా బుక్‌లెట్లు తయారు చేయాలని నిర్ణయించారు. విద్యార్థుల జవాబు పత్రాలను ఆగస్ట్టు నెలలో మూల్యాంకనం చేయాలని నిర్ణయించారు.  ఆ పరీక్షలు రాసేందుకు విద్యార్థులు ఎంతమేర శ్రద్ధ చూపుతారనేది ఆలోచించాల్సిన అంశం. 


ఎంఈవో కార్యాలయాల్లోనే పాఠ్యపుస్తకాలు

ఈ ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభమై నెలపైనే గడిచింది. ఇంతవరకు పాఠ్యపుస్తకాలు, కిట్‌లు, విద్యార్థులకు అందజేయలేదు. పుస్తకాలను, కిట్లను ఎంఈవో కార్యాలయాల్లో భద్రపరిచి ఉంచారు. ఈ ఏడాది విద్యార్థులకు ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీని కూడా ఇవ్వాలని నిర్ణయించారు. వీటిని ఎప్పటికి అందజేస్తారో తెలియని స్థితి. పాఠశాలలు తెరవకున్నా, విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు ఇస్తే చదువుకునే అవకాశమైనా ఉంటుందనేది విద్యావేత్తల ఆలోచన. 


ఆన్‌లైన్‌ తరగతుల ఊసేది?

ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలల్లో ఆన్‌లైన్‌ తరగతులు కొంతమేర జరుగుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్‌లైన్‌ తరగతుల ఊసేలేదు.  సప్తగిరి చానల్‌ ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమాలనే పాఠ్యాంశాల బోధనగా పరిగణిస్తున్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో విద్యుత్‌ కోతలు, సాంకేతిక సమస్యలు తదితర కారణాలతో సప్తగిరి చానల్‌ద్వారా ప్రసారమయ్యే పాఠ్యాంశాలను ఎంతమంది వింటున్నారనేది ప్రశ్నార్థకమే. దీనికి బదులుగా ప్రభుత్వం అమ్మఒడి పథకంలో భాగంగా ఇస్తున్న డబ్బుతో ట్యాబ్‌లను కొనుగోలు చేసి విద్యార్థులకు అందజేసి ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తే ప్రయోజనం ఉంటుందని పలువురు సూచిస్తున్నారు.


ఉపాధ్యాయులకు వ్యాక్సినేషన్‌ పూర్తయ్యేనా?

కరోనా ఽథర్డ్‌ వేవ్‌ ముంచుకొస్తోందనే హెచ్చరికలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పిల్లలు పాఠశాలలకు రావడానికి దారులు మూసుకుపోతున్నాయి. పాఠశాలలు పునఃప్రారంభించేలోగా ఉపాధ్యాయులకు రెండు డోసుల వ్యాక్సిన్‌ వేయాలని నిర్ణయించారు. కరోనా బారిన పడిన ఉపాధ్యాయులు మూడు నెలల వరకు వ్యాక్సిన్‌ వేయించుకునే అవకాశం లేదు. ఇదే అంశాన్ని కరోనా బారిన పడిన ఉపాధ్యాయులు ప్రభుత్వ దృష్టికి తీసికెళ్లారు. దీనిపై ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి ఉంది.


బుక్‌లెట్లు, వర్క్‌షీట్లు ఇస్తాం

 పాఠశాల విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాన్ని పరీక్షించేందుకు బుక్‌లెట్లు, వర్క్‌షీట్లు ఇస్తాం. విద్యార్థులు పాఠశాలకు రాకుండా ఇంటి వద్దనే పరీక్షలు రాయాలి. ఉపాధ్యాయులు జవాబు పత్రాలను సేకరించి, మూల్యాంకనం చేస్తారు. విద్యార్థులు చదువుతున్న తీరుపై టీచర్ల పర్యవేక్షణ ఉండేలా చూస్తున్నాం. - తెహారా సుల్తానా, జిల్లా విద్యాశాఖాధికారి

Updated Date - 2021-07-21T06:01:10+05:30 IST