ప్రమాదంలో పాఠశాల విద్య!

Published: Wed, 15 Jun 2022 01:53:02 ISTfb-iconwhatsapp-icontwitter-icon

ఉమ్మడి జిల్లాలో 2300 ప్రాథమిక బడుల్లో రెండో టీచర్‌ పోస్టు రద్దు

94 హైస్కూళ్లలో హెచ్‌ఎం, పీఈటీ పోస్టులు కూడా.. 


చిత్తూరు, ఆంధ్రజ్యోతి: ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే.. అది ఆ రంగాన్ని మెరుగుపరిచేలా ఉండాలి. మరింత అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లాలి. కానీ, విద్యారంగానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం.. జారీ చేసిన జీవో ప్రాథమిక విద్యను ప్రమాదంలో పడేసేలా ఉంది. పిల్లలకు, పాఠశాలలకు మధ్య దూరం పెరగడమే కాకుండా.. పేదలకు, ప్రభుత్వ విద్యకు కూడా దూరం పెరగనుంది. పాఠశాలలు, టీచర్‌ పోస్టుల సంఖ్యను నాడు- నేడు పరిశీలించి చూస్తే ఎన్ని తగ్గిపోతున్నాయో.. దీని ప్రభావం విద్యారంగంపై ఎలా ఉండబోతుందో తెలుస్తుంది. 


ఆరు నుంచి పదో తరగతి వరకుండే ఉన్నత పాఠశాలల్లో 93 మంది కంటే తక్కువ విద్యార్థులుంటే.. మూడు నుంచి పదో తరగతి వరకు 137 మంది కంటే తక్కువ విద్యార్థులుంటే ప్రధానోపాధ్యాయుడు, వ్యాయామ ఉపాధ్యాయుడి పోస్టులు రద్దు కానున్నాయి. 

30 మంది కంటే తక్కువ విద్యార్థులున్న ప్రాథమిక పాఠశాలలన్నీ ఇక నుంచి ఏకోపాధ్యాయ పాఠశాలలే. 

ఈ నిర్ణయాలు విద్యారంగాన్ని ఉద్దరించేలా ఉన్నాయా అంటే.. లేదన్నదే విద్యావేత్తల సమాధానం. ఇప్పటికే ఖాళీగా ఉన్న టీచర్‌ పోస్టులను భర్తీ చేయాల్సిన అవసరం లేకుండా, ఉన్న పోస్టులను కత్తిరించేలా ఈ నిబంధనలు ఉన్నాయంటున్నారు. దీనివల్ల గ్రామీణ విద్యపై ప్రతికూల ప్రభావం పడనుంది. ఎన్నికలకు ముందు ఉపాధ్యాయులను, ప్రభుత్వ విద్యారంగాన్ని ఉద్ధరిస్తామని చెప్పిన జగన్‌.. సీఎం అయ్యాక ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. ప్రస్తుత జీవోతో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పెద్దఎత్తున పాఠశాలలు, టీచరు పోస్టులు మాయం కానున్నాయి. టీచర్లపై పనిభారం మూడింతలు పెరగనుంది. దీనిపై తీవ్ర అసంతృప్తి, ఆగ్రహావేశాలు వ్యక్తమవుతోంది. ఉపాధ్యాయ సంఘాలు ఒకొక్కటిగానూ, మూకుమ్మడిగానూ ఉద్యమాలకు సన్నద్ధమవుతున్నాయి. 


94 హైస్కూళ్లకు హెచ్‌ఎంలు ఉండరు 


ఉమ్మడి జిల్లాలో 4260 ప్రాథమిక, 731 ప్రాథమికోన్నత, 1228 ఉన్నత.. మొత్తం కలిపి 6219 అన్ని రకాల ప్రభుత్వ పాఠశాలలున్నాయి. రేషనలైజేషన్‌పై ప్రభుత్వం తాజాగా ఇచ్చిన జీవో 117 ప్రకారం ఉమ్మడి జిల్లాలో 93 మంది (ఆరు నుంచి పదో తరగతి వరకు) కంటే తక్కువ విద్యార్థులు కలిగిన ఉన్నత పాఠశాలలు 40 ఉన్నాయి. ఇక, నూతన విద్యా విధానం అమల్లో భాగంగా ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులను కిలోమీటరు దూరంలోని ఉన్నత పాఠశాల్లో విలీనం చేస్తున్నారు. అలా 137 మంది (మూడు నుంచి పదో తరగతి వరకు) కంటే తక్కువ విద్యార్థులున్న ఉన్నత పాఠశాలలు జిల్లాలో 54 ఉన్నాయి. 6-10 తరగతుల 40 పాఠశాలలు, 3- 10 తరగతుల 54 పాఠశాలలు.. మొత్తం కలిపి 94 ఉన్నత పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయుడు, వ్యాయామ ఉపాధ్యాయుడి పోస్టులు రద్దు కానున్నాయి. ఆయా పాఠశాలల్లో సీనియర్‌ స్కూల్‌ అసిస్టెంట్‌ హెచ్‌ఎం బాధ్యతలు చూస్తారు. ఇక నుంచి 94 ఉన్నత పాఠశాలల్లో హెచ్‌ఎం, పీడీలు ఉండరు.


300 ఏకోపాధ్యాయ బడులు 


ఇక ఉమ్మడి జిల్లాలో 30 మంది కంటే తక్కువ విద్యార్థులు గల ప్రాథమిక పాఠశాలలు 2300కుపైగా ఉన్నాయి. వీటిలో చాలాచోట్ల ఇద్దరేసి టీచర్లు పనిచేస్తున్నారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఆ 2300 పాఠశాలలు ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మారనున్నాయి. ఇద్దరు పనిచేస్తున్న చోట ఒక పోస్టును రద్దు చేస్తున్నారు. ఒకవేళ ఆ టీచరు అత్యవసర పనుండి సెలవు పెడితే పాఠశాల మూతపడాల్సిందే.


2 వేలకుపైగా టీచరు పోస్టుల రద్దు!


ఓ అంచనా ప్రకారం ఉమ్మడి జిల్లాలో రెండు వేలకుపైగా టీచరు పోస్టులు రద్దవుతాయి. దీన్ని రద్దుగా చెప్పకూడదని, పోస్టును ఓ పాఠశాలనుంచి మరో పాఠశాలకు మార్పు చేసినట్లు పరిగణనలోకి తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారులు అంటున్నారు. పేరు ఏదైనా.. దీని ప్రభావం మాత్రం బోధనపై పడుతుందని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల మరో రెండేళ్ల వరకు డీఎస్సీ ఉండకపోవచ్చని, ఆ తర్వాత డీఎస్సీ నిర్వహించినా పోస్టుల్లో భారీగా కోత పడుతుందని చెబుతున్నారు.


నిరుద్యోగులకూ నిరాశే 


విద్యార్థులకు మెరుగైన బోధన అందకపోవడం.. టీచర్లపై పనిభారం పెరగడమే కాదు.. నిరుద్యోగులకూ నిరాశ కలిగించేలా ప్రభుత్వ నిర్ణయం ఉంది. ఉన్న పోస్టులు తగ్గిపోవడంతో ఇప్పట్లో డీఎస్సీ నియామకాలు చేపట్టే పరిస్థితి లేదు. ఈ పరిణామంతో నిరుద్యోగులూ ఆందోళన చెందుతున్నారు. 


ముగ్గురు తగ్గారని.. ఇద్దరు ఔట్‌ 


పెనుమూరు మండలంలోని లక్కలపూడివాండ్లఊరు ఉన్నత పాఠశాలలో 90 మంది (6-10 తరగతులు) విద్యార్థులున్నారు. తాజా రేషనలైజేషన్‌ ఉత్తర్వుల ప్రకారం ఇక్కడ 93 మంది విద్యార్థులు లేరు. ఈ కారణంగా ప్రధానోపాధ్యాయుడు, వ్యాయామ ఉపాధ్యాయుడి పోస్టులు రద్దు కానున్నాయి. ప్రస్తుతం ఇక్కడ పనిచేస్తున్న ఆ ఇద్దరిని 93కంటే ఎక్కువ మంది విద్యార్థులున్న ఉన్నత పాఠశాలకు బదిలీ చేస్తారు. ఇక నుంచి ఇక్కడ పనిచేస్తున్న సీనియర్‌ స్కూల్‌ అసిస్టెంట్‌ పాఠశాలకు హెడ్‌మాస్టర్‌గా వ్యవహరిస్తారు. ఇలాంటి పాఠశాలలు జిల్లాలో 40 ఉన్నాయి.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.