పాఠశాల గ్రాంట్స్‌ విడుదల

ABN , First Publish Date - 2020-10-15T07:46:14+05:30 IST

పాఠశాలల్లో కనీస వసతుల కల్పన, స్వచ్ఛ కార్య క్రమాల అమలు, అవసరమైన సామగ్రి కొనుగోలు నిమిత్తం

పాఠశాల గ్రాంట్స్‌ విడుదల

పాఠశాలలకు నిర్వహణ నిధుల విడుదల

జిల్లాకు మొదటి విడతగా రూ.79 లక్షలు

ఎస్‌ఎంసీ ఖాతాల్లో జమ

విద్యార్థుల సంఖ్య ఆధారంగా కేటాయింపు


కామారెడ్డి టౌన్‌, అక్టోబరు 14: పాఠశాలల్లో కనీస వసతుల కల్పన, స్వచ్ఛ కార్య క్రమాల అమలు, అవసరమైన సామగ్రి కొనుగోలు నిమిత్తం జిల్లా వ్యాప్తంగా ఉన్న 1,014 ప్రభుత్వ పాఠశాలలకు గ్రాంట్స్‌ విడుదలయ్యాయి. సర్వశిక్ష అభియాన్‌ ద్వారా ఈ నిధులను విడుదల చేయగా జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ప్రాథమిక, ప్రాఽఽథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు ఈ నిధులు కేటాయించారు. ఈ మేరకు ఆయా పాఠశాలల ఎస్‌ఎంసీ ఖాతాల్లో నిధులు జమ చేశారు. సాధారణంగా ప్రతీ విద్యా సంవత్సరం ఆరంభంలోనే ఈ గ్రాంట్స్‌ విడుదలయ్యేవి. కానీ ఈ సారి కరోనా కారణంగా గ్రాంట్స్‌ విడుదలలో తీవ్ర జాప్యం జరిగింది. కామారెడ్డి జిల్లాకు మొత్తం రూ.2 కోట్లకు పైగా రావాల్సి ఉండగా  మొదటి విడత కింద 25 శాతం నిధులు రూ.79 లక్షలు విడుదల చేశారు. ఈ నిధులను ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఎస్‌ఎంసీలో  తీర్మానం చేసి ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఖర్చు చేసిన ప్రతీ వాటికి ఆడిట్‌ ఉంటుంది.


జిల్లాలో 1,014 పాఠశాలలు

జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,014 పాఠశాలలు ఉన్నాయి. ఇందులో ప్రాథమిక పాఠశాలలు 697, ప్రాథమికోన్నత పాఠశా లలు 128, ఉన్నత పాఠశాలలు 186 ఉన్నాయి. ఇందులో సుమారు  90వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. అయితే కరోనా లాక్‌డౌన్‌తో పాఠశాలలు మార్చి నుంచి మూత పడగా సెప్టెంబరు నుంచి తెరుచుకున్నాయి. ప్రస్తుతం విద్యా ర్థులకు ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తున్నారు. ఉపాధ్యాయు లు మాత్రం ప్రతీరోజు సగం మంది చొప్పున పాఠశాలలకు హాజరవుతున్నారు. పాఠశాలలు మూత పడడంతో పాఠశాల నిర్వహణ లేక పరిసర ప్రాంతాలు అధ్వానంగా తయారవడం తో పాటు తరగతి గదులలో విద్యుత్‌ మరమ్మతులు చేపట్టాల్సి ఉన్నదని ఉపాధ్యాయులు, పాఠశాల ప్రధానోపాధ్యా యులు పేర్కొంటున్నారు.


మరమ్మతులకు అవకాశం

సర్వశిక్ష అభియాన్‌ ద్వారా విడుదల చేస్తున్న ఈ గ్రాంట్స్‌తో పాఠశాలలో వివిధ రకాల పనులు చేసుకునే అవకాశం ఉంటు ంది. ఉపాధ్యాయులు ప్రస్తుతం బోధన లేకుండా ఉంటున్న నేపథ్యంలో నిధులు మంజూరు చేస్తే మేలని భావించిన ప్రభు త్వం గ్రాంట్స్‌ విడుదల చేసినట్లు అధికారులు పేర్కోంటున్నా రు. ఈ గ్రాంట్స్‌ ద్వారా మరుగుదొడ్లు, మూత్రశాలలు, ఇతర భవనాల మరమ్మతులతో పాటు విద్యుత్‌ బిల్లులు చెల్లించు కునే అవకాశం ఉంది. ప్రధానోపాధ్యాయులు, యాజమాన్య కమిటీ అఽధ్యక్షుల పేరుతో బ్యాంకులో జాయింట్‌ ఖాతా తెర వాలి. ఎస్‌ఎంసీ తీర్మానం మేరకు చాక్‌పీస్‌లు, తెల్ల కాగితాలు, రిజిస్టర్‌లు, ఇతర స్టేషనరీ, పరీక్షల నిర్వహణ, జాతీయ పండుగల నిర్వహణ, విద్యుత్‌ బిల్లు, కంప్యూటర్‌, ప్రొజె క్టర్‌, టీవీ కేబుల్‌, ఇంటర్‌నెట్‌ చార్జీలు, ప్రయోగశాల పరిక రాలకు ఖర్చు చేయవచ్చు. నిబంధనల ప్రకారం మొత్తం 10శాతం స్వచ్ఛ కార్యక్రమాలకు వినియోగించాల్సి ఉం టుంది.


విద్యార్థుల సంఖ్య ఆధారంగా కేటాయింపులు

పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఆధారంగా ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. 1 నుంచి 15 మంది విద్యార్థులు ఉంటే రూ.12,500, 15 నుంచి 100 మంది లోపు ఉంటే రూ.25వేలు, 100 నుంచి 250 మంది ఉంటే రూ.50వేలు, 250 నుంచి 1000 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలలకు రూ.75వేల చొప్పున, వెయ్యి మందికి పైగా విద్యార్థులు ఉన్న పాఠశాలలకు రూ.1 లక్ష చొప్పున నిధులు మంజూరు చేశారు. కాగా జిల్లాకు పాఠశాలల నిర్వహణ గ్రాంట్‌ కింద మొత్తం రూ.2కోట్లకు పైగా విడుదల కావాల్సి ఉండగా మొదటి విడతగా రూ.79లక్షలు మాత్రమే ప్రస్తుతం విడుదల చేశారు. వీటిని నేరుగా ఎస్‌ఎంసీ ఖాతాల్లోనే జమ చేస్తు న్నారు. ఈ నిధులతో పాఠశాలల్లో నెలకొన్న చిన్న చిన్న సమస్యలు తీరుతాయని ప్రధానోపాధ్యాయులు పేర్కొంటున్నారు. విద్యార్థులు పాఠశాలలకు హాజరయ్యే నాటికి మౌలిక వసతులకు సంబంధించి అన్ని పనులు పూర్తవుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


పాఠశాలల ఖాతాల్లో నిధులు జమయ్యాయి..రాజు, డీఈవో, కామారెడ్డి.

జిల్లా వ్యాప్తంగా 1,014 పాఠశాలలు ఉండగా ఆ పాఠశా లల ఖాతాల్లో నిర్వహణ నిధులు జమ అయ్యాయి. వాటిని ఎస్‌ఎం సీ తీర్మానం మేరకు ఖర్చు చేసుకోవాలి.  జిల్లాకు రూ.2 కోట్లకు పైగా నిధులు రావాల్సి ఉండగా మొదటి విడతగా రూ.79లక్షలు వచ్చాయి. వీటిని పాఠశాలలో స్టేషనరీ, భవనాల మరమ్మతులకు తదితర సౌకర్యాల నిమిత్తం ఖర్చు చేయాల్సి ఉంటుంది. నిబంధనల ప్రకారం ప్రతీ బిల్లుకు ఆడిట్‌ చేయిం చుకుని ఖర్చు చేయించుకోవాల్సి ఉంటుంది.

Updated Date - 2020-10-15T07:46:14+05:30 IST