కానుక లేకుండానే.. గణగణ

ABN , First Publish Date - 2022-07-05T06:01:46+05:30 IST

సాధారణంగా విద్యా సంవత్సరం అంటే జూన్‌ రెండో వారంలో ప్రారంభం కావాలి. కాని ఈ ఏడాదికి సంబంధించి జూలై 4(సోమవారం) నుంచి ప్రారంభిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

కానుక లేకుండానే.. గణగణ
బూట్లు పంపిణీ కోసం సైజులు తీసుకుంటున్న ఉపాధ్యాయులు(పాతచిత్రం)

నేటి నుంచి బడుల పునః ప్రారంభం

ఇంకా పాఠశాలలకు చేరని జగనన్న విద్యా కిట్లు

ప్రారంభోత్సవానికి మండలానికి 15 కిట్లు సరఫరా

ప్రచార ఆర్భాటమంటున్న ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు 

 


గుంటూరు(విద్య), జూలై 4: సాధారణంగా విద్యా సంవత్సరం అంటే జూన్‌ రెండో వారంలో ప్రారంభం కావాలి. కాని ఈ ఏడాదికి సంబంధించి జూలై 4(సోమవారం) నుంచి ప్రారంభిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. చివరకు అది ఒక రోజు వాయిదా పడి మంగళవారమైంది. అయినా ఉమ్మడి జిల్లాలోని పాఠశాలలకు పూర్తిగా జగనన్న విద్యా కానుక కిట్లు అందలేదు. కానుకలు లేకుండానే పాఠశాలల పునః ప్రారంభంపై అటు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఇటు ఉపాధ్యాయుల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతుంది. ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు దాదాపు 3,500పైగా ఉన్నాయి. ఆయా పాఠశాలల్లో ప్రభుత్వ లెక్కల ప్రకారం 4.50 లక్షల మంది విద్యార్థులు విద్యాభాస్యం చేస్తున్నారు. ఆయా విద్యార్థులకు ప్రభుత్వం ఏటా జగనన్న విద్యా కానుక పేరుతో పుస్తకాలు, బ్యాగు, బూట్లు, బెల్టు, యూనిఫాం, డిక్షనరీ వంటి వస్తువుల్ని ఒక కిట్‌గా చేసి అందజేస్తున్నారు. అయితే ఈ ఏడు ఆలస్యంగా పాఠశాలలను ప్రారంభిస్తున్నా ఆ కిట్లు పూర్తిగా అందలేదు. ఉమ్మడి జిల్లా పరిధిలో 57 ఎమ్మార్సీలకు ఒక్కో మండలానికి కేవలం 15 కిట్లు మాత్రమే  సరఫరా చేశారు. పాఠశాలలు తెరిచిన రోజునే విద్యార్థులకు జగనన్న విద్యాకిట్స్‌ పంపిణీ చేస్తామని మూడు నెలలుగా అధికారులు ప్రకటించారు. అయితే అందుకు విరుద్ధంగా పరిస్థితులు ఉన్నాయి. అంటే మంగళవారం తూతూమంత్రంగా ఆ కిట్లను విద్యార్థులకు పంపిణీ చేసి కార్యక్రమాన్ని మమ మమ అనిపించడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ప్రతీ ఏటా ఈ కార్యక్రమం ప్రచార ఆర్భాటంగా ఉంటుందే తప్ప క్షేత్రస్థాయిలో విద్యార్థులకు పూర్తిగా ఆ వస్తువులు పంపిణీ కావడం లేదని ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. ఇక పుస్తకాల పరంగా చూస్తే అన్ని పాఠశాలలకు అన్ని సబ్జెక్టులవి రాలేదు. కొన్ని పాఠశాలలకు  బెల్టులు మాత్రమే వచ్చాయి. 


నెలాఖరు వరకు పంపిణీ

జగనన్న విద్యాకానుక కిట్లు ఇంకా పాఠశాలలకు పూర్తిగా అందని కారణంగా నెలఖరు వరకు ఈ కార్యక్రమం నిర్వహించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలలకు పూర్తిస్థాయిలో కిట్లు రావడానికి కనీసం 15రోజులు సమయం పడుతుంది. వచ్చిన కిట్లు వచ్చినట్లు పాఠశాలలకు అందజేయాలని ఉన్నతాధికారులు సూచించారు. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు పుస్తకాలు 18.35 లక్షల వరకు పంపిణీ చేశారు.  ఇంకా సగం వరకు పంపిణీ చేయాల్సి ఉంది. గత ఏడాది విద్యార్థులకు పంపిణీ చేసిన బూట్లు సైజులు విషయంలో గందరగోళం నెలకొంది. ఈ పరిస్థితుల్లో ఈ ఏడాదైనా ఆ గందరగోళం లేకుండా చూడాలని విద్యార్థులు కోరుతున్నారు.  యూనిఫాం కుట్టించుకునేందుకు జతకు రూ.80 వరకు చెల్లిస్తున్నారు. అయితే ఆ ధరకు ఎక్కడా దుస్తులు కుట్టేవారు లేరు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులపై అదనపు భారం పడుతుంది.  


 

Updated Date - 2022-07-05T06:01:46+05:30 IST