మైనార్టీ పాఠశాల ఎప్పటికో

ABN , First Publish Date - 2022-09-14T05:36:19+05:30 IST

ముస్లిం మైనార్టీ విద్యార్థుల విద్యాభివృద్ధి, సంక్షేమం పాలకులకు పట్టడంలేదు. పల్నాడులో ముస్లిం మైనార్టీల విద్యాభివృద్ధి కోసం గత ప్రభుత్వం నరసరావుపేట మండలం పెదతురకపాలెంలో రూ.15 కోట్లతో రెసిడెన్షియల్‌ స్కూల్‌ నిర్మాణాన్ని చేపట్టింది.

మైనార్టీ పాఠశాల ఎప్పటికో
నిలిచిన స్కూల్‌ భవనం పనులు

మూడేళ్లకు 40 శాతం పనులే పూర్తి

ముస్లిం విద్యాభివృద్ధి పట్టని ప్రభుత్వం

సాగుతున్న రెసిడెన్షియల్‌ స్కూల్‌ నిర్మాణం

రూ.15 కోట్లకు ఇప్పటికి రూ.6.50 కోట్ల పనులే

చోద్యం చూస్తున్న ముస్లిం మైనార్టీ సంక్షేమ శాఖ


నరసరావుపేట, సెప్టెంబరు 13: ముస్లిం మైనార్టీ విద్యార్థుల విద్యాభివృద్ధి, సంక్షేమం పాలకులకు పట్టడంలేదు. పల్నాడులో ముస్లిం మైనార్టీల విద్యాభివృద్ధి కోసం గత ప్రభుత్వం నరసరావుపేట మండలం పెదతురకపాలెంలో రూ.15 కోట్లతో రెసిడెన్షియల్‌ స్కూల్‌ నిర్మాణాన్ని చేపట్టింది. అయితే ప్రస్తుత ప్రభుత్వం ఈ స్కూల్‌ నిర్మాణాన్ని మూడేళ్లుగా పూర్తి చేయలేపోయింది. తరగతి గదులు, విద్యార్థుల వసతి గృహం, స్టాఫ్‌ క్వార్టర్ల నిర్మాణం చేపట్టగా ఈ పనులు 40 శాతం మాత్రమే పూర్తయ్యాయి. పూర్తయిన పనులు విలువ సుమారు రూ.6.50 కోట్లు ఉంటుందని సంబంధిత అధికారులు తెలిపారు. భవనాల నిర్మాణం ఏపీఈడబ్ల్యుఐడీసీ పర్యవేక్షణలో జరుగుతున్నాయి. ఈ విద్యా సంవత్సరంలో రెసిడెన్సియల్‌ స్కూల్‌ ప్రారంభం అవుతుందన్న ముస్లిం మైనార్టీ విద్యార్థుల తల్లిదండ్రుల అశ అడియాసగానే మిగిలింది. కాంట్రాక్టర్‌ పనులను అర్ధాంతరంగా నిలిపివేశారు.  ఏడాదిగా పనులు ముందుకు సాగడంలేదు. చర్యలు తీసుకోవాల్సిన ముస్లిం మైనార్టీ సంక్షేమ శాఖ చోద్యం చూస్తోంది. ఈ పరిస్థితుల్లో వచ్చే విద్యా సంవత్సరానికి కూడా ఈ స్కూల్‌ ప్రారంభమయ్యే పరిస్థితులు లేవని చెప్పవచ్చు. ముస్లిం మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం ఈ స్కూల్‌ నిర్మాణాన్ని పూర్తి చేయడంలో చిత్తశుద్ధి చూపడంలేదన్న విమర్శలొస్తున్నాయి. పనులను తిరిగి ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఏపీఈడబ్ల్యూఐడీసీ ఈఈ అంబటి రమేష్‌ తెలిపారు. సదరు కాంట్రాక్టర్‌కు నోటీసులు కూడా జారీ చేశామన్నారు. 

Updated Date - 2022-09-14T05:36:19+05:30 IST