విలీనంపై భగ్గు

ABN , First Publish Date - 2022-07-06T06:15:51+05:30 IST

పాఠశాలల విలీనంపై విద్యార్థుల తల్లిదండ్రులు భగ్గుమన్నారు. బడుల పునఃప్రారంభం తొలిరోజునే తిరుగుబాటు చేశారు. దగ్గరలో ఉన్న తరగతులను తీసుకెళ్లి, దూరంగా ఉన్న బడిలో కలపడం ఏంటని మండిపడ్డారు. దూరంగా వెళ్లక తప్పదంటే.. బడి మాన్పిస్తాంగానీ, తమ పిల్లలను పంపమని స్పష్టం చేశారు.

విలీనంపై భగ్గు

తరగతుల తరలింపుపై

విద్యార్థుల తల్లిదండ్రుల ఆగ్రహం

బడి మాన్పిస్తాం గానీ, దూరంగా ఉన్నదానికి పంపమని స్పష్టం

హిందూపురంలో పాఠశాలకు 

తాళం వేసి, నిరసన

తొలిరోజే తిరుగుబాటు


హిందూపురం టౌన


పాఠశాలల విలీనంపై విద్యార్థుల తల్లిదండ్రులు భగ్గుమన్నారు. బడుల పునఃప్రారంభం తొలిరోజునే తిరుగుబాటు చేశారు. దగ్గరలో ఉన్న తరగతులను తీసుకెళ్లి, దూరంగా ఉన్న బడిలో కలపడం ఏంటని మండిపడ్డారు. దూరంగా వెళ్లక తప్పదంటే.. బడి మాన్పిస్తాంగానీ, తమ పిల్లలను పంపమని స్పష్టం చేశారు. ఏకంగా పాఠశాలలోని టీచర్లను బయటకు పంపించేసి, తాళం వేశారు. అక్కడే నిరసనకు దిగారు. 

హిందూపురం పట్టణంలోని మేళాపురంలో ఉన్న ప్రాథమికోన్నత పాఠశాలలో 6 నుంచి 8వ తరగతి వరకు 86 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ మూడు తరగతులను 2కి.మీ., దూరంలో ఉన్న దండు రోడ్డులోని ఉన్నత పాఠశాలలో విలీనం చేశారు. మంగళవారం పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో విద్యార్థులంతా వెళ్లారు. వారిని దూరంగా ఉన్న ఉన్నత పాఠశాలకు వెళ్లాలని ఉపాధ్యాయులు చెప్పారు. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల వద్దకు చేరుకుని, ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలలోని ఉపాధ్యాయులు, విద్యార్థులను బయటకు పంపి, గేటుకు తాళాలువేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ తమ పిల్లలను పాఠశాలైనా మాన్పిస్తాం కానీ, 2కి.మీ., దూరంలో ఉన్న ఉన్నత పాఠశాలకు పంపే ప్రసక్తే లేదన్నారు. పాఠశాలలో లక్షలాది రూపాయలు వెచ్చించి, అదనపు తరగతి గదులు నిర్మించినది విద్యార్థులను ఇంకో పాఠశాలకు పంపేందుకేనా అని నిలదీశారు. విషయం తెలుసుకున్న ఎంఈఓ గంగప్ప.. పాఠశాల వద్దకు చేరుకుని, సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా వారు వినలేదు. గంటపాటు పాఠశాల ముందు నిరసన వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పాఠశాలను ఇక్కడే కొనసాగించాలని పట్టుబట్టారు. పాఠశాల దగ్గరలో ఉంటేనే విద్యార్థులు వస్తారనీ, దూరంగా ఉంటే వెళ్లరనీ, దీనివల్ల వారి భవిష్యత్తు నాశనం అవుతుందని ఆవేదన చెందారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని ఎంఈఓ గంగప్ప సర్దిచెప్పడంతో పాఠశాలకు వేసిన తాళాలను తెరిచారు. తమ పిల్లలను ఇళ్లకు తీసుకెళ్లారు. 


Updated Date - 2022-07-06T06:15:51+05:30 IST