బడి ‘వంట’కు.. ధరల మంట.. తినలేకపోతున్న విద్యార్థులు!

ABN , First Publish Date - 2021-11-08T18:40:38+05:30 IST

ప్రభుత్వ పాఠశాలలోని మధ్యాహ్న భోజనం రుచి తగ్గింది. ధరల మంటతో నిర్వాహకులు..

బడి ‘వంట’కు.. ధరల మంట.. తినలేకపోతున్న విద్యార్థులు!

  • మధ్యాహ్న భోజనంలో తగ్గిన నాణ్యత
  • నాసిరకం కూరగాయలతో వంటలు 

ప్రభుత్వ పాఠశాలలోని మధ్యాహ్న భోజనం రుచి తగ్గింది. ధరల మంటతో నిర్వాహకులు నాసిరకం వంటలను వడ్డిస్తున్నారు. ఆ భోజనం తినలేక పేద పిల్లలు అవస్థలు పడుతున్నారు. పప్పు దినుసులు, కూరగాయల ధరలు పెరగడంతోనే పిల్లలకు నాణ్యమైన భోజనం కరువవుతోంది.


హైదరాబాద్‌ సిటీ : జిల్లాలో 16 మండలాల పరిధిలో 690 ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలున్నాయి. ఆయా స్కూళ్లలో కలిపి ప్రస్తుతం 1.10 లక్షల మంది చదువుతున్నారు. కొవిడ్‌కు ముందు జిల్లా పరిధిలోని ప్రతి బడిలో 78 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. కాగా, కొవిడ్‌ ఆంక్షల నేపథ్యంలో గత సెప్టెంబర్‌ 1 నుంచి పాఠశాలలు పునఃప్రారంభమైన నేపథ్యంలో రోజుకు సగటున 40 శాతం మంది హాజరు ఉంటుంది.


నీళ్లచారు.. నాసిరకం కూరగాయలు

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న వారిలో ఎక్కువశాతం దినసరి కూలీలు, నిరుపేద కుటుంబాలకు చెందిన పిల్లలే ఉంటున్నారు. నిబంధనల ప్రకారం 2020 జూలై వరకు ప్రాథమిక పాఠశాలలో చదివే విద్యార్థికి ప్రతిరోజూ భోజనం కింద రూ.4.48 పైసలు, ప్రాథమికోన్నత, ఉన్నత విద్యార్థికి రూ. 6.71 చెల్లించేవారు. పెరుగుతున్న ధరలను దృష్టిలో ఉంచుకుని 2020 ఆగస్టు 29 నుంచి ప్రాథమిక విద్యార్థికి రోజుకు రూ.4.97 పైసలు (49 పైసలు అదనం), యూపీఎస్‌ విద్యార్థులకు రూ.7.45 పైసలు (74 పైసలు అదనం)గా చెల్లిస్తున్నారు. మార్కెట్‌లో కూరగాయలు, నూనెల ధరలు రోజురోజుకు ఎగబాకుతున్న నేపథ్యంలో సర్కారు బడుల్లోని పిల్లలకు తరచూ నీళ్లచారు, నాసిరకం కూరగాయల భోజనమే అందుతోందని ఉపాధ్యాయులు వాపోతున్నారు. దీంతో జిల్లాలోని చాలా పాఠశాలల్లోని పిల్లలు ఇంటినుంచే లంచ్‌బాక్సులను తెచ్చుకుంటున్నట్లు వారు పేర్కొంటున్నారు.


హాస్టళ్లలో మరీ అధ్వానం..

జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టళ్లలో చదువుకుంటున్న విద్యార్థుల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. జిల్లాలోని బీసీ వెల్ఫేర్‌ ప్రీ-మెట్రిక్‌ హాస్టళ్లు 30, పోస్టుమెట్రిక్‌ హాస్టళ్లు 38 ఉండగా, 6,100 మంది విద్యాభాసం చేస్తున్నారు. ఎస్సీ వెల్ఫేర్‌ ప్రీమెట్రిక్‌ 13, పోస్టుమెట్రిక్‌ 24 హాస్టళ్లలో కలిపి 4,800 మంది, ట్రైబల్‌ వెల్ఫేర్‌ (ఎస్టీ)లో ప్రీ మెట్రిక్‌ 4, పోస్టు మెట్రిక్‌ 10 గృహాల్లో 1400 మంది చదువుతున్నారు. ప్రస్తుతం పోస్టు మెట్రిక్‌ హాస్టళ్లలో 65శాతం మంది చదువుకుంటుండగా, నాసిరకం కూరలు వడ్డిస్తున్నారని విద్యార్థులు వాపోతున్నారు. వీటిపై ప్రశ్నిస్తే మార్కెట్‌లో కూరగాయల ధరలు పెరుగుతున్నాయని, మంచి భోజనం ఎలా పెడుతామని పేర్కొంటున్నారని చెబుతున్నారు.


అసమానతలు ఎందుకు..?

ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులందరినీ ఒకేలా చూడాలి. సర్కారు బడుల్లో చదివే వారిని ఒకలా, గురుకులాలు, మోడల్‌ స్కూళ్లలో చదివే వారిని మరోలా చూడడం అన్యాయం. గురుకులాల్లోని పిల్లలకు అందిస్తున్న పోషకాహారాన్ని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న వారికి సైతం ఇవ్వాలి. అప్పుడే ఉపాధ్యాయులు చెబుతున్న పాఠాలను సరిగ్గా అర్థం చేసుకుంటారు. అసమానతలు లేని పోషకాహారం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. - ముత్యాల రవీందర్‌, టీపీటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు.


పోషకాహారం అందించాలి..

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న, సంక్షేమ హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి. ధరలు పెరుగుదలను సాకుగా చూపించి నిరుపేద విద్యార్థులకు నాసిరకం కూరలు పెట్టడం తగదు. కొవిడ్‌ కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం మధ్యాహ్న భోజనంతోపాటు విరామ సమయంలో బలవర్ధక ఆహారం అందించాలి. - పగిడిపల్లి శ్రీహరి, ఏబీవీపీ సెంట్రల్‌ మెంబర్‌.

Updated Date - 2021-11-08T18:40:38+05:30 IST