చిత్తూరు జిల్లాలో ‘గురు’రూప కీచకుడు

ABN , First Publish Date - 2022-04-30T12:42:32+05:30 IST

చిత్తూరు జిల్లాలో ‘గురు’రూప కీచకుడు

చిత్తూరు జిల్లాలో ‘గురు’రూప కీచకుడు

  • ఆరు నెలలుగా చిన్నారులపై లైంగిక వేధింపులు 


చిత్తూరు జిల్లా/బంగారుపాళ్యం : చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలంలోని చిల్లగుండ్లపల్లె ప్రాథమిక పాఠశాల విద్యార్థినులపై ఉపాధ్యాయుడు ఆబు ఆరు నెలలుగా వికృత చేష్టలకు పాల్పడుతున్న వ్యవహారం శుక్రవారం వెలుగు చూసింది. హెచ్‌ఎం పార్వతి చొరవతో పిల్లలు.. ఈ లైంగిక వేధింపుల గురించి తల్లిదండ్రులుకు చెప్పడంతో వారు ఉదయాన్నే పెద్దఎత్తున పాఠశాలకు చేరుకున్నారు. ఈ విషయం తెలిసి ఆబు ముందుగానే పాఠశాలకు గైర్హాజరయ్యాడు. ఆందోళన సమాచారంతో మధ్యాహ్నం తర్వాత డీఈవో పురుషోత్తం, తహసీల్దార్‌ సుశీల, ఎంపీడీవో విద్యారమ, ఎంఈవో నాగేశ్వరరావు, సీడీపీవో వాణి శ్రీదేవి పాఠశాలకు చేరుకుని విద్యార్థులు, గ్రామస్థుల నుంచి వివరాలు సేకరించారు.


పిల్లలు మరుగుదొడ్లకు వెళితే ఉపాధ్యాయుడు కూడా లోపలికి వెళ్ళి గడియ పెట్టి లైంగిక వేధింపులకు పాల్పడేవాడని వారు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించడంతో పిల్లలు చెప్పలేకపోయారని వాపోయారు. ఉపాధ్యాయుడి ఆగడాలను చూసి భరించలేక హెచ్‌ఎం పార్వతి.. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పాలని, మిమ్మల్ని ఎవరూ కొట్టకుండా తాను చూసుకుంటానని చిన్నారులకు నచ్చచెప్పారు. దీంతో వారు ఉపాధ్యాయుడి ఆకృత్యాల గురించి తల్లిదండ్రులకు తెలిపారు. ఆవేదన.. ఆగ్రహంతో గ్రామస్థులు, తల్లిదండ్రులు శుక్రవారం ఉదయం పాఠశాల వద్దకు చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ఉపాధ్యాయుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఈవో పురుషోత్తం హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.  


సస్పెండ్‌ చేశాం: డీఈవో పురుషోత్తం

చిత్తూరు (సెంట్రల్‌): విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడు ఆబును సస్పెండు చేసినట్లు డీఈవో పురుషోత్తం తెలిపారు. చిల్లగుండ్లపల్లె ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం జరిపిన విచారణలో తేలిన వివరాల ఆధారంగా కలెక్టర్‌ ఆమోదంతో ఈ చర్యలు తీసుకున్నామన్నారు. 




Updated Date - 2022-04-30T12:42:32+05:30 IST