నడి వయసులో బడి పంతులు

ABN , First Publish Date - 2022-06-25T05:24:48+05:30 IST

జీవితంలో అన్నిటికీ వయసుతో నిమిత్తం ఉంటుంది.

నడి వయసులో బడి పంతులు
కాడెడ్లతో ఆదిమూలం నరసింహుడు

1998 డీఎస్సీలో వరించిన ఉద్యోగాలు

వ్యవసాయం చేసి అలిసిపోయిన నరసింహులు 

సీడ్‌ కంపెనీలో కష్టం చేస్తున్న దస్తగిరి

ఎట్టకేలకు ఉద్యోగం వచ్చిందని ఆనందం  


రుద్రవరం, జూన్‌ 24: జీవితంలో అన్నిటికీ వయసుతో నిమిత్తం ఉంటుంది. చదువు, ఉద్యోగం, పెళ్లి, పిల్లలు... అన్నిటికీ ఒక క్రమం ఉంటుంది. అంతా సవ్యంగా జరిగితే అంతకంటే ఏం కావాలి? కానీ ప్రభుత్వం అనేక విచిత్రాలు పోతుంది. 1998 డీఎస్పీ ఉద్యోగాలు ఇప్పటికి ఇచ్చింది. అప్పుడు డీఎస్సీ రాసిన వాళ్లు ఇప్పుడు నడి వయసులోకి వచ్చారు. పిల్లాపాపలు కలిగి వాళ్లూ పై చదువులకు వచ్చారు. వాళ్లు కూడా  ఉద్యోగ వేటలో ఉన్నారు. ఈ వయసులో నంద్యాల జిల్లా రుద్రవరం మండలం పెద్దకంబలూరు పంచాయతీ మజరా గోనంపల్లె గ్రామానికి చెందిన ఆదిమూలం నరసింహుడుకు టీచర్‌ ఉద్యోగం వచ్చింది. ఇప్పుడు ఆయనకు 55 ఏళ్లు. 15 ఏళ్లుగా ఆయన ఒక  జత ఎద్దులతో వ్యవసాయం చేసి ఈ ఏడాదే వదిలేశా అన్నారు. భార్య రాములమ్మ, కుమారుడు రవివర్మతో కలిసి 10 ఎకరాల్లో భూముల్లో వ్యవసాయం చేసి అప్పు మిగిల్చుకున్నా అన్నారు. తాజాగా 1998 డీఎస్సీలో.. టీచర్‌ ఉద్యోగం రావడంతో సంతృప్తిగా ఉందన్నారు. ఇంకొన్నేళ్లయినా ప్రభుత్వ ఉద్యోగం చేయడం సంతోషమన్నారు. అలాగే  రుద్రవరానికి చెందిన దూదేకుల దస్తగిరికి కూడా 1998 డీఎస్పీలో ఉపాధ్యాయ ఉద్యోగం వచ్చింది. 1994, 1996లో డీఎస్సీ రాసినా ఆయనకు ఉద్యోగం రాదేదు.  1998లో డీఎస్సీలో క్వాలిఫై అయ్యారు. అప్పటి నుంచి సీడు కంపెనీలో, ఓ దినపత్రికలో పని చేస్తూ వచ్చారు. ఎట్టకేలకు ప్రభుత్వ ఉద్యోగి అయ్యారు. ఆయనకు భార్యా పిల్లలు ఉన్నారు. ఈ సంతోష సమయాన స్నేహితులు, కుటుంబసభ్యులు స్వీట్లు తినిపించి ఆనందించారు. 



Updated Date - 2022-06-25T05:24:48+05:30 IST