తనిఖీలు మొక్కుబడి!

ABN , First Publish Date - 2022-08-19T06:31:41+05:30 IST

ఉమ్మడి జిల్లాలో దాదాపు 45 శాతం మండలాలకు పూర్తిస్థాయి ఎంఈవోలు లేరు.

తనిఖీలు మొక్కుబడి!
కోటవురట్ల ఎంఈవో కార్యాలయం

ఉమ్మడి జిల్లాలో సగానికిపైగా ఎంఈవో పోస్టులు ఖాళీ

21 మండలాల్లో ఇన్‌చార్జులు

ఏళ్ల తరబడి భర్తీకి నోచుకోని మండల విద్యాశాఖాధికారి పోస్టులు

పాఠశాలలపై తగిన పర్యవేక్షణ కరవు


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

ప్రభుత్వ పాఠశాలల్లో చదువులు సక్రమంగా సాగాలంటే అధికారుల పర్యవేక్షణ ఎంతో అవసరం. ఇందుకోసం ప్రతి మండలానికి ఒక విద్యా శాఖ అధికారి (ఎంఈవో) ఉంటారు. కానీ ఉమ్మడి జిల్లాలో దాదాపు 45 శాతం మండలాలకు పూర్తిస్థాయి ఎంఈవోలు లేరు. కొత్త జిల్లాల ఏర్పాటు తరువాతే కాదు...జిల్లాల పునర్విభజనకు ముందు కూడా ఇదే పరిస్థితి ఉండేది. 

ఉమ్మడి విశాఖ జిల్లాలో 39 మండలాలు వుండగా ప్రస్తుతం 21 మండలాలకు ఎంఈవోలు లేరు. అనకాపల్లి జిల్లాలో 24 మండలాలకుగాను 13 మంది మాత్రమే ఎంఈవోలు ఉన్నారు. విశాఖ జిల్లాలో రెండు మండలాలకు రెగ్యులర్‌ ఎంఈవోలు ఉండగా, నాలుగు మండలాలకు పెందుర్తిలో వున్న డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ స్కూల్స్‌...ఇన్‌చార్జిగా ఉన్నారు. ఇక జీవీఎంసీలో 146 పాఠశాలలతోపాటు క్వీన్‌మేరీస్‌ ఉన్నత పాఠశాలను అర్బన్‌ డీఐ పర్యవేక్షిస్తున్నారు. రెగ్యులర్‌ ఎంఈవోలు లేని చోట్ల పక్క మండలాల ఎంఈవోలు లేదా ప్రధానోపాధ్యాయులు, ఇతరులు ఇన్‌చార్జి ఎంఈవోలుగా వ్యవహరిస్తున్నారు. పదోన్నతుల కల్పన ద్వారా ఎంఈవో పోస్టుల భర్తీకి 2009లో ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. అయితే ఎంఈవోలుగా తమకు ప్రాధాన్యం ఇవ్వాలంటూ ప్రభుత్వ, జిల్లా పరిషత్‌ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఎవరికి వారు కోర్టును ఆశ్రయించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఎంఈవోల పదోన్నతుల పక్రియ నిలిచిపోయింది. ఇప్పటివరకు పునరుద్ధరణకు నోచుకోలేదు. ఎంఈవో పోస్టుల్లో ఇన్‌చార్జులే బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 


కొరవడిన పర్యవేక్షణ..

మండల విద్యాశాఖాధికారి తన పరిధిలో నెలకు కనీసం 15 పాఠశాలలను సందర్శించి అక్కడ పరిస్థితులను పరిశీలించాలి. అంటే ఎంఈవోలు నెలలో కనీసం పది రోజుల పాటు క్షేత్రస్థాయిలో వుండి పాఠశాలలను తనిఖీలు చేయాలి. విద్యా బోధన, పిల్లల్లో అభ్యసన సామర్థ్యాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి. అప్పుడే ఉపాధ్యాయుల పనితీరు బాగుంటుంది. ఇంకా మధ్యాహ్న భోజనం పథకం అమలుతీరు, పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను గుర్తించి త్వరగా పరిష్కరించడానికి వీలవుతుంది. కానీ ఉమ్మడి విశాఖ జిల్లాలో సగానికిపైగా మండలాలకు పూర్తిస్థాయి ఎంఈవోలు లేకపోవడంతో పాఠశాలల పర్యవేక్షణ, తనిఖీలు సరిగా జరగడం లేదు. జిల్లాల పునర్విభజన తరువాత విశాఖపట్నం జిల్లాలో ఏడు మండలాలకు ఇద్దరు ఎంఈవోలు మాత్రమే ఉన్నారు. భీమిలి ఎంఈవో పద్మనాభం మండల బాధ్యతలు అదనంగా నిర్వహిస్తున్నారు. పెందుర్తిలో వున్న డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ స్కూల్స్‌...పెందుర్తి, చినగదిలి, పెదగంట్యాడ, గాజువాక మండలాలను పర్యవేక్షిస్తున్నారు. అనకాపల్లి జిల్లాలో 24 మండలాలు వుండగా 13 మండలాల్లో...అనకాపల్లి, అచ్యుతాపురం, దేవరాపల్లి, కె.కోటపాడు, నక్కపల్లి, నర్సీపట్నం, నాతవరం, పరవాడ, పాయకరావుపేట, రాంబిల్లి, రోలుగుంట, ఎస్‌.రాయవరం, వి.మాడుగులలో మాత్రమే పూర్తిస్థాయి ఎంఈవోలు ఉన్నారు. చీడికాడ ఎంఈవో ఇటీవల సస్పెండ్‌ అయ్యారు. బుచ్చెయ్యపేట, చోడవరం, గొలుగొండ, కశింకోట, మాకవరపాలెం, మునగపాక, కోటవురట్ల, రావికమతం, సబ్బవరం, ఎలమంచిలి మండలాలు ఇన్‌చార్జుల పాలనలో ఉన్నాయి. 

అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో 11 మండలాలు వుండగా, ప్రస్తుతం పాడేరు, హుకుంపేట, పెదబయలు, అరకులోయ, జి.మాడుగుల, అనంతగిరి, కొయ్యూరు మండలాలకు పూర్తిస్థాయి ఎంఈవోలు ఉన్నారు. మిగిలిన నాలుగు మండలాలు ఇన్‌చార్జుల పాలనలోనే కొనసాగుతున్నాయి. ఇదిలావుండగా ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు వెబ్‌ కాన్ఫరెన్సులు, వీడియో కాన్ఫరెన్స్‌లు, సమీక్షలు, కోర్టు కేసులకు హాజరు, తదితర కార్యక్రమాలతో ఎంఈవోలు బిజీబిజీగా గడుపుతున్నారు. దీంతో పాఠశాలల తనిఖీని పక్కనపెట్టేశారు.

Updated Date - 2022-08-19T06:31:41+05:30 IST