పాఠశాలల్లో..డేంజర్‌ బెల్స్‌

ABN , First Publish Date - 2021-04-18T05:39:40+05:30 IST

పాఠశాలల్లో డేంజర్‌బెల్స్‌ మోగుతున్నాయి. గుంటూరు నగరంలోని విద్యాసంస్థల్లో కరోనా కలకలం కొనసాగుతూనే ఉంది.

పాఠశాలల్లో..డేంజర్‌ బెల్స్‌
ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులకు కరోనా పరీక్షలు చేస్తున్న దృశ్యం

గుంటూరు నగరంలో రెండు పాఠశాలల్లో కరోనా కలకం

 

గుంటూరు(విద్య), ఏప్రిల్‌ 17: పాఠశాలల్లో డేంజర్‌బెల్స్‌ మోగుతున్నాయి. గుంటూరు నగరంలోని విద్యాసంస్థల్లో కరోనా కలకలం కొనసాగుతూనే ఉంది. తాజాగా మరో రెండు పాఠశాలల్లో ఉపాధ్యాయులకు కొవిడ్‌ సోకడంతో విద్యార్థులు, ఇతర ఉపాధ్యాయులకు హుటాహుటిన కొవిడ్‌ పరీక్షలు నిర్వహించారు. స్థానిక పాతబస్టాండు వద్ద ఉన్న ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో, ఏటీ అగ్రహారం ఎస్‌కేబీఎం స్కూల్‌లో ఇద్దరేసి చొప్పున మొత్తం నలుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. శనివారం పాత బస్టాండు వద్ద ఉన్న ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో దాదాపు 90 మందికిపైగా విద్యార్థులకు కొవిడ్‌ పరీక్షలు నిర్వహించారు. ఇప్పటికే గుంటూరు నగరంలోని రెండు మున్సిపల్‌ స్కూల్స్‌లో ఉపాధ్యాయులు, విద్యార్థులు కరోనా బారినపడి మరణించారు. కొవిడ్‌ భయంతో  గత వారం రోజుల నుంచి జిల్లావ్యాప్తంగా అనేక పాఠశాలల్లో విద్యార్థుల హాజరుశాతం గణనీయంగా పడిపోయింది. గుంటూరులోని అనేక పాఠశాలల్లో  సగం మంది విద్యార్థులకు పాఠశాలలకు రావడం లేదని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ప్రైవేటు స్కూల్స్‌లో సైతం ఆన్‌లైన్‌ ద్వారా పరీక్షలు నిర్వహిస్తుండగా, సీబీఎస్‌ఈ విద్యార్థులకు  ఈనెలాఖరు వరకు ఆన్‌లైన్‌ ద్వారా క్లాసులు నిర్వహించడానికి కేంద్రీయ విద్యాలయం ఇతర విద్యాసంస్థల్లో ఏర్పాట్లు చేసుకున్నారు. 

Updated Date - 2021-04-18T05:39:40+05:30 IST