బడులకు రక్షణేది..!?

ABN , First Publish Date - 2022-06-27T01:43:02+05:30 IST

ప్రభుత్వం విద్యాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెపుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో అనేకచోట్ల సమస్యలు వెంటాడుతున్నాయి.

బడులకు రక్షణేది..!?
ప్రహారీ లేని ఉదయగిరి ఉర్దూ ప్రాథమిక పాఠశాల

ప్రహారీలు లేని పాఠశాలలు

లోపలికి వచేస్తున్న మూగజీవాలు  

విద్యార్థుల చదువుకు ఆటంకాలు

ఉదయగిరి, జూన్‌ 26: ప్రభుత్వం విద్యాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెపుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో అనేకచోట్ల సమస్యలు వెంటాడుతున్నాయి. ఉదయగిరి మండలంలో అనేక దశాబ్దాల క్రితం నిర్మించిన పలు మండల పరిషత్‌ పాఠశాలలకు చుట్టూ ప్రహారీలు లేకపోవడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఈ విషయంపై పలుమార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తరగతులు నిర్వహించాలన్నా ఉపాధ్యాయులకు కష్టతరమవుతోంది. మండలంలోని వెంకట్రావుపల్లి ఎస్సీ కాలనీ, కొండాయపాళెం, ఉదయగిరి ఉర్దూ పాఠశాల తదితర చోట్ల పాఠశాలల చుట్టూ ప్రహారీలు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రహారీలతోపాటు తరగతి గదుల చుట్టూ కంపచెట్లు, పిచ్చిమొక్కలు మొలవడంతో విషపురుగుల సంచారం అధికంగా ఉంది. పాఠశాలలకు ప్రహారీలు లేకపోవడంతో పాఠశాలల ఆవరణలోకి పశువులు, కుక్కలు, కోళ్లు, రాత్రివేళల్లో అడవి జంతువులు సైతం వచ్చేస్తున్నాయి. కొద్దిపాటి వర్షం కురిసినా మేకలు, గొర్రెలు పాఠశాల ఆవరణతోపాటు వరండాల్లో చేరి మలమూత్రాలు విసర్జించడంతో దుర్వాసన వెదజల్లుతున్నాయి. పాఠశాలకు వచ్చిన విద్యార్థులు శుభ్రపర్చడంలో తలమునకలవుతున్నారు. దీంతో విద్యార్థుల చదవులకు ఆటంకం కలుగుతుంది. ఇప్పటికైనా అధికారులు దృష్టిసారించి ప్రహారీలు ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు. 

Updated Date - 2022-06-27T01:43:02+05:30 IST