ఆర్భాటపు ప్రకటనలు.. అత్తెసరు నిధులు!

ABN , First Publish Date - 2022-09-27T05:47:51+05:30 IST

జిల్లాలో ఈ విద్యా సంవత్సరానికి పాఠశాల నిర్వహణ గ్రాంట్‌ కింద రూ.1,26,47,000, స్కూల్‌ కాంప్లెక్స్‌లకు రూ.60,42,000, మండల రిసోర్స్‌ సెంటర్లకు రూ.32,90,000, జూనియర్‌ కళాశాలలకు రూ.51.22 లక్షలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది.

ఆర్భాటపు ప్రకటనలు..  అత్తెసరు నిధులు!

ఈ ఏడాది స్కూళ్ల నిర్వహణ కష్టమే

కావాల్సింది రూ.8.88 కోట్లు.. విడుదలైంది 1.77 కోట్లు 

దిక్కుతోచక తలలు పట్టుకుంటున్న హెచ్‌ఎంలు

గతేడాది బిల్లులూ విడుదల చేయని ప్రభుత్వం


‘పాఠశాలల రూపురేఖలు మార్చేశాం.. కోట్లాది రూపాయలు వెచ్చించాం. నాడు-నేడుతో అన్ని పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాం’’ అని ఆర్భాటపు ప్రచారం చేసుకుంటున్న ప్రభుత్వం పాఠశాలల నిర్వహణకు మాత్రం అరకొర నిధులు విడుదల చేసి చేతులు దులుపుకుంటోంది. ఈ ఏడాది వార్షిక గ్రాంట్‌లో కేవలం 20 శాతం మాత్రమే విడుదల చేయడంతో పాఠశాలల నిర్వహణ కష్టమేనంటూ ప్రధానోపాధ్యాయులు తలలు పట్టుకుంటున్నారు. అత్యధిక మంది విద్యార్థులు ఉన్న పాఠశాలల్లో కనీస అవసరాలు కూడా తీర్చే పరిస్థితులు లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


నెల్లూరు (విద్య), సెప్టెంబరు 26 : జిల్లాలో ఈ విద్యా సంవత్సరానికి పాఠశాల నిర్వహణ గ్రాంట్‌ కింద రూ.1,26,47,000, స్కూల్‌ కాంప్లెక్స్‌లకు రూ.60,42,000, మండల రిసోర్స్‌ సెంటర్లకు రూ.32,90,000, జూనియర్‌ కళాశాలలకు రూ.51.22 లక్షలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. వాస్తవానికి జిల్లాకు పాఠశాలల నిర్వహణ గ్రాంట్‌ ఏడాదికి రూ.8,88,45,000 విడుదల చేయాల్సి ఉండగా దీనిలో కేవలం 20శాతం మాత్రమే  కేటాయించారు. జిల్లాలో ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు మొత్తం 2,904 ఉండగా వీటికి రూ.6,32,35,000 బడ్జెట్‌ కేటాయించారు. ఒక్కో పాఠశాలకు రూ.10వేలు చొప్పున కేటాయించిన బడ్జెట్‌లో 20శాతం నిధులు అంటే రూ.1,26,47,000 మాత్రమే విడుదల చేశారు. అలాగే ఉన్నత పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు  439 ఉండగా వీటికి రూ.2,56,10,000 కేటాయించారు. వీటిలో ఒక్కో దానికి రూ.25వేలు చొప్పున 20శాతం  అంటే రూ.51,22,000 విడుదల చేశారు. మొత్తం 3,343 పాఠశాలలు, కళాశాలలకు కలిపి ఈ ఏడాది రూ.8,88,45,000 బడ్జెట్‌ కేటాయించగా రూ.1,77,69,000 విడుదల చేశారు. అదేవిధంగా వీటితోపాటు జిల్లాలోని 47 మండల రిసోర్స్‌ సెంటర్‌లకు ఒక్కో దానికి రూ.70వేలు చొప్పున, 318 స్కూల్‌ కాంప్లెక్స్‌లకు ఒక్కోదానికి రూ.20 వేలు చొప్పున మంజూరు చేశారు. ఈ నిధులను పాఠశాలల కమిటీల ఖాతాలకు జమ చేయనున్నారు. 


అరకొర నిధులతోనే నిర్వహణ..

పాఠశాలల నిర్వహణ కోసం ప్రభుత్వం విడుదల చేసే నిధులతోనే విద్యుత్‌, ఇంటర్నెట్‌ బిల్లుల చెల్లింపు, ఫ్యాన్లు, వాష్‌రూమ్‌లలో ట్యాప్‌లు, పైపులలు, కంప్యూటర్ల మరమ్మతులు, స్టేషనరీ ఖర్చుల కోసం విడుదలైన గ్రాంట్‌ను ఉపయోగించుకోవాలి. కేటాయించిన బడ్జెట్‌ ప్రకారం నిధులను విడుదల చేస్తే ఏడాది మొత్తానికి సరిపోతాయి. అయితే పాఠశాలు ప్రారంభమై నాలుగు నెలలు గడుస్తుండగా ప్రస్తుతం కేటాయించిన బడ్జెట్‌లో కేవలం 20శాతం మాత్రమే నిధులు విడుదల చేయడంతో హెచ్‌ఎంలు తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటివరకు పెట్టిన ఖర్చులకు కూడా ఈ నిధులు సరిపోవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అత్యధిక మంది విద్యార్థులున్న ఉన్నత పాఠశాలల్లో అయితే నిర్వహణ గ్రాంట్‌ సరిపోక ఎక్కడి రిపేర్లు అక్కడే ఆగిపోయాయి. వీటిని పట్టించుకునే వారు లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆర్‌ఓ ప్లాంట్‌లు, బాత్‌రూంల నిర్వహణ లేక అధిక ప్రాంతాల్లో ఇవి నిరుపయోగంగా మారాయని ఉపాధ్యాయులు చెబుతున్నారు. అలాగే గత ఏడాది నిర్వహణ గ్రాంట్‌ లక్ష రూపాయలు దాటిన పాఠశాలలకు ప్రభుత్వం ఇప్పటి వరకు బిల్లులు విడుదల చేయలేదు. ఈ ఏడాది మార్చి నెలలో బిల్లులు పెడితే వీటిని సీఎంఎ్‌ఫఎ్‌సలో తిరస్కరించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో బిల్లులను ఖచ్చితంగా విడుదల చేస్తామని చెప్పిన అధికారులు దాన్ని పట్టించుకోకపోవడంతో చేతిడబ్బులు ఖర్చు చేసిన హెచ్‌ఎంలు ఏం చేయాలో దిక్కుతోచక ఆవేదన చెందుతున్నారు. ఈ ఏడాది విడుదలైన అత్తెసరు నిధులతో పాఠశాలల నిర్వహణ కష్టమేనని తేల్చి చెపుతున్నారు.

Updated Date - 2022-09-27T05:47:51+05:30 IST