ప్రతి నెలా అప్పులే!

ABN , First Publish Date - 2022-08-08T06:14:11+05:30 IST

‘విద్యార్థుల సంఖ్యా పరంగా చంద్రంపాలెం జడ్పీ ఉన్నత పాఠశాల రాష్ట్రంలో ప్రథమస్థానంలో ఉంది.

ప్రతి నెలా అప్పులే!
ఆరిలోవ ఎస్‌ఐజీ నగర్‌ ప్రాథమిక పాఠశాలలో విరిగిన బెంచీలు(ఫైల్‌ ఫొటో)

పాఠశాలల నిర్వహణలో హెచ్‌ఎంలపై ఆర్థిక భారం

ఇప్పటికీ అందని గత విద్యా సంవత్సరం నిధులు  

ముందుగా విడుదల చేయాలని కోరుతున్న హెచ్‌ఎంలు


విశాఖపట్నం, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): ‘విద్యార్థుల సంఖ్యా పరంగా చంద్రంపాలెం జడ్పీ ఉన్నత పాఠశాల రాష్ట్రంలో ప్రథమస్థానంలో ఉంది. పాఠశాలలో 52 గదులు, కంప్యూటర్‌ ల్యాబ్స్‌ ఉండడంతో ప్రతి నెలా విద్యుత్‌ బిల్లు  రూ.20 వేల నుంచి రూ.23వేల వరకు వస్తోంది. రోజువారీ పాఠశాల నిర్వహణకు స్టేషనరీ, మరుగుదొడ్ల నిర్వహణ ఖర్చు అదనం. అయితే పాఠశాలల నిర్వహణ గ్రాంట్‌ను రెండేళ్లుగా ప్రభుత్వం పీడీ ఖాతాల్లోకి మార్చడంతో చంద్రంపాలెం స్కూలుకు 2021-22 విద్యా సంవత్సరం గ్రాంట్‌ విడుదల కాలేదు. గత విద్యా సంవత్సరంలో నిర్వహణకు దాతలు, విద్యార్థులు ఇచ్చిన సొమ్ము ఖర్చుచేసినా ఇంకా అప్పులున్నాయి. ఈలోగా కొత్త విద్యాసంవత్సరం మొదలై నెల దాటింది. యధావిధిగా విద్యుత్‌ బిల్లు, ఇతర చెల్లింపులకు ప్రధానోపాధ్యాయుడు ఎదురుచూస్తున్నారు’’.

 

ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ సంబంధిత ప్రధానోపాధ్యాయులకు భారంగా మారుతోంది. ముఖ్యంగా ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు కక్కలేక, మింగలేక అన్న  పరిస్థితిలో ఉన్నారు. పాఠశాల స్థాయిని బట్టి ప్రతినెలా విద్యుత్‌ బిల్లు, ఇతరత్రా ఖర్చులు ఉంటాయి. మరుగుదొడ్లను శుభ్రపరిచి, వాటి ఫొటోలు ప్రతిరోజు పాఠశాల విద్యాశాఖ యాప్‌కు అప్‌లోడ్‌ చేయాలి. అంటే మరుగుదొడ్లు శుభ్రంగా ఉంచేందుకు ప్రభుత్వం ఇచ్చే ఫినాయిల్‌, చీపర్లు సరిపోవు. స్థానికంగా ఫినాయిల్‌, చీపుర్లు, యాసిడ్‌, బ్రష్‌లు కొనుగోలు చేస్తుంటారు. ఎప్పటికప్పుడు ట్యాప్‌లు విరిగిపోవడం, గదుల్లో ఫ్యాన్లు, లైట్లు పనిచేయకపోతే మార్చడం, మరమ్మతులు జరుగుతుంటాయి. దీనికితోడు స్టేషనరీ, ఎ-4 బండిల్స్‌ కొనుగోలు, ఇతర ఖర్చులు మామూలే. వీటన్నింటికి పాఠశాల విద్యార్థుల సంఖ్య మేరకు ప్రభుత్వం నిర్వహణ గ్రాంట్‌ విడుదల చేస్తుంటుంది. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు నిధులు సరిపోతాయి. కానీ 400కు మించి విద్యార్థులున్న ఉన్నత పాఠశాలలకు ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్‌ ఏమాత్రం సరిపోవడం లేదు. దీనిపై ప్రధానోపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


మారిన పద్ధతితో తంటాలు 

 2019-20 వరకు నేరుగా హెచ్‌ఎం ఖాతాలకు ఈ గ్రాంట్‌ జమచేసేవారు. కానీ 2020-21 నుంచి కొత్తగా పీడీ ఖాతాలు తెరవడంతో పాఠశాలల వారీగా బిల్లులు అప్‌లోడ్‌ చేస్తేనే గ్రాంట్‌ విడుదలకు అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో గత విద్యా సంవత్సరానికి సంబంధించి కొన్ని పాఠశాలలకు ఇంతవరకు నిర్వహణ గ్రాంట్‌ విడుదల కాలేదు. రూ. లక్షకు మించి ఉన్న గ్రాంట్లు ఎప్పుడు విడుదలవుతాయో తెలియని పరిస్థితి ఉంది. అంతేకాదు ఈ ఏడాది మార్చిలో పెట్టిన బిల్లులు వెనక్కి వచ్చేశాయి. ఈ గ్రాంట్‌ వస్తుందో? లేదో అనేది ఎవరూ చెప్పడం లేదు. పాఠశాల స్థాయిని బట్టి ప్రధానోపాధ్యాయులు అందినకాడికి అప్పులు చేసి, నిర్వహణ కోసం ఖర్చు చేశారు. దీంతో ఈ  సొమ్ము రాకపోతే హెచ్‌ఎం సొంత నిధుల నుంచి ఇవ్వాల్సి ఉంటుంది.  ప్రస్తుత ఏడాదికి సంబంధించి నిర్వహణ ఖర్చును హెచ్‌ఎంలే  భరిస్తున్నారు. పాఠశాలల నిర్వహణ కోసం కొత్తగా ప్రతి హెచ్‌ఎం ఆరు నెలల క్రితం యూనియన్‌ బ్యాంకులో ఖాతాలు తెరిచారు. ఇంతవరకు ఈ ఖాతాకు ఎటువంటి గ్రాంట్‌ జమకాలేదు. నాడు-నేడు ఇతరత్రా నిధుల నుంచి ప్రతి పాఠశాలలో గదుల నిర్మాణం, ప్రతి గదిలో నాలుగు ఫ్యాన్లు, రెండు నుంచి మూడు ట్యూబ్‌లైట్లు ఏర్పాటు చేస్తుండడంతో విద్యుత్‌ బిల్లు తడిసిమోపెడవుతోంది. ఈ నేపథ్యంలో ప్రతి ఏటా విద్యా సంవత్సరం ప్రారంభం నాటికే పాఠశాలల నిర్వహణ గ్రాంట్‌ విడుదల చేయాలని హెచ్‌ఎంలు కోరుతున్నారు. 

Updated Date - 2022-08-08T06:14:11+05:30 IST