వెనక్కి పంపేస్తున్నారు..!

ABN , First Publish Date - 2021-11-09T15:57:39+05:30 IST

రాష్ట్రంలో..

వెనక్కి పంపేస్తున్నారు..!

గదుల్లేవు... గురువులూ లేరు

హైస్కూళ్లలో బడుల విలీనంతో ఇదీ పరిస్థితి

రాష్ట్రంలో సంక్షోభంలో పడిన పిల్లల చదువు 

విలీన నిర్ణయంతో విద్యా వ్యవస్థ అస్తవ్యస్తం

బడుల నుంచి భారీగా వస్తున్న పిల్లలు

ఎక్కడ కూర్చోబెట్టాలి? ఎవరు చదువు చెప్పాలి? 

ఉపాధ్యాయుల కొరత మరో సమస్య

దిక్కుతోచక మళ్లీ వెనక్కి పంపేస్తున్న వైనం


(అమరావతి, ఆంధ్రజ్యోతి): గుంటూరు జిల్లా గుత్తికొండ ఉన్నత పాఠశాలలో ఇప్పుడున్న ఆరునుంచి పదో తరగతి వరకు పిల్లలకే తరగతి గదుల్లేవు. వరండాల్లో కూర్చోబెట్టి తరగతులు చెప్పాల్సిన పరిస్థితి. ఉపాధ్యాయులూ అంతంతమాత్రమే. ఇంతలో సమీపంలోని ప్రాథమిక పాఠశాల నుంచి 3,4,5తరగతుల్ని కలిపేయడంతో కొత్తగా 176మంది పిల్లలు వచ్చారు. ఉన్నవారికే తరగతి గదుల్లేవు. ఇక వీరినెక్కడ కూర్చోబెడ్డాలి? ఇంతమందికి టీచర్లను ఎక్కడ కేటాయించాలి? దీంతో గప్‌చు్‌పగా మళ్లీ ఆ పిల్లల్ని సదరు ప్రాథమిక పాఠశాలకే పంపించివేశారు.. 


ఉన్నత పాఠశాలల్లో ప్రాథమిక పాఠశాలల విలీనం కిందిస్థాయులో విద్యా వ్యవస్థను అస్తవ్యస్తం చేసేసింది. ప్రాథమిక పాఠశాలల్లో 1నుంచి 5తరగతుల వరకు ఉండగా... వాటిలోని 3,4,5తరగతులను సమీపంలోని ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఆ తరగతులతో పాటు ఆయా తరగతుల పిల్లలకు పాఠాలు చెప్పే ఉపాధ్యాయుల్ని కూడా విలీనం చేసేయాలని ఆదేశించింది. అయితే ఏమాత్రం కసరత్తు చేయకుండా, కనీస ఆలోచన చేయకుండా చేసేసిన ఈ పని బడి పిల్లల చదువులను సంక్షోభంలోకి నెట్టేసింది. కొత్తగా వచ్చిన విద్యార్థులను ఎక్కడ కూర్చోబెట్టాలి? ఎవరు వారికి పాఠాలు చెప్పాలన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే ఉన్న తరగతి గదులే అరకొర...మళ్లీ కొత్తగా మూడు తరగతులంటే వారిని ఎక్కడ కూర్చోబెట్టాలి. ఏ చెట్లకిందో, వరండాలోనో కూర్చోబెట్టేద్దాం. అయితే, పిల్లలొచ్చారు కానీ...వారికి పాఠాలు చెప్పేందుకు సరిపడా ఉపాధ్యాయులు రాలేదు. దీంతో పలుచోట్ల వచ్చిన విద్యార్థులను వచ్చినట్టే తిరిగి ప్రాథమిక పాఠశాలలకే పంపేస్తున్నారు. ఒకవేళ ఉన్నత పాఠశాలకు రానిచ్చినా.. ఎక్కడో ఒక చోట ఊరికే కూర్చోబెడుతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంచి ఇంటికి పంపేస్తున్నారు! రాష్ట్రంలో ఉన్నత పాఠశాలల్లో విలీనమైన 50శాతం ప్రాథమిక పాఠశాలల్లో ఇదే పరిస్థితి నెలకొంది. 


పిల్లలే వచ్చారు..

కొన్నిచోట్ల విలీనం కారణంగా ప్రాథమిక పాఠశాల నుంచి ఉన్నత పాఠశాలకు విద్యార్థులు వచ్చారు. కానీ ఉపాధ్యాయులు మాత్రం రాలేదు. వచ్చేందుకు అక్కడున్నది ఒకరు, ఇద్దరే ఉపాధ్యాయులు. అక్కడ మిగిలిన 1,2తరగతులకు చెప్పేందుకే సరిపోరు. ఇక ఇక్కడికేం వస్తారు. దీంతో ఉన్నత పాఠశాలకు కేవలం విద్యార్థులొచ్చారు. కానీ వారికి పాఠాలు చెప్పేందుకు ఉపాధ్యాయులు రాలేదు. ఇక్కడా వారికి చెప్పేందుకు తగినంత మంది ఉపాధ్యాయుల్లేరు. దీంతో విద్యార్థులకు ఎవరు పాఠాలు చెప్పాలో తెలీని పరిస్థితి. 


టీచర్లూ వచ్చారు.. 

ప్రాథమిక పాఠశాల నుంచి విద్యార్థులొచ్చారు. ఉపాధ్యాయులు కూడా కొంతమేర వచ్చారు. కానీ ఉన్నత పాఠశాలల్లో కూర్చునేందుకు తరగతి గదుల్లేవు. దీంతో పిల్లల్ని చెట్లకిందో లేక వరండాల్లోనో కూర్చోబెట్టాల్సిన పరిస్థితి.


సబ్జెక్ట్‌ మిస్‌..

విద్యార్థులు మాత్రం వస్తారు. కానీ సబ్జెక్టు ఉపాధ్యాయులు రారు. ఇక్కడా చెప్పేందుకు ఉపాధ్యాయులు లేరు. అదే సమయంలో తరగతి గదులూ లేవు. ఇలా ఏ పరిస్థితి చూసినా విద్యార్థుల చదువులకు దిక్కెవరు అన్నట్లుగానే ఉంది. 


పిల్లలు 712.. టీచర్లు 24

కృష్ణా జిల్లాలోని జి.కొండూరు ఉన్నత పాఠశాలలో 535మంది విద్యార్థులున్నారు. ఇక్కడ తెలుగు, ఆంగ్ల మాధ్యమ సెక్షన్లు రెండూ ఉన్నాయి. ఇంతమందికి పాఠాలు చెప్పేందుకు 24మంది ఉపాధ్యాయులుండాలి. హెడ్‌మాస్టరు, పీఈటీ వేరే. కానీ ఇక్కడ ఉన్నది 22మందే. అంటే ఉన్నదే అరకొర. ఇప్పుడు ప్రభుత్వం 250మీటర్ల దూరంలో ఉన్న ప్రాథమిక పాఠశాలల్ని విలీనం చేయాలని అనడంతో...ఒక పాఠశాల విలీనమైంది. అక్కడినుంచి 3,4,5తరగతులు వచ్చి కలిశాయి. మొత్తం 177మంది విద్యార్థులు వచ్చి  చేరారు. వీరికి పాఠాలు చెప్పేందుకు అదే ప్రాథమిక పాఠశాల నుంచి కనీసం ఆరుగురు ఉపాధ్యాయులు వచ్చి ఉండాలి. కానీ ఇద్దరు మాత్రం వచ్చారు. అంటే అవసరమైన దానిలో 17శాతం మంది మాత్రమే వచ్చారు. అప్పటికే గురువుల కొరతతో ఉన్న ఆ పాఠశాలకు మళ్లీ మూడు తరగతులు, విద్యార్థులు రావడంతో ఇక పాఠాలు చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. అంతేకాదు...తరగతి గదులూ చాలినన్ని లేవు. దీంతో వారిని ఎక్కడ కూర్చోబెట్టాలో తెలీని దుస్థితి! ప్రకాశం జిల్లా గుడ్లూరు ఉన్నత పాఠశాల, అదే జిల్లా చినలాటరసి పాఠశాల...ఇలా ఎక్కడ చూసినా ఇదే సీన్‌. రాష్ట్రంలో ప్రభుత్వ నిర్ణయం కారణంగా విలీనమైన దాదాపు 50శాతం పాఠశాలల్లో ఇదే పరిస్థితి నెలకొంది. విద్యార్థులున్నారు. ఉపాధ్యాయులూ, తరగతి గదులూ లేవు. 


రెంటికీ చెడ్డ రేవడి

విలీనం వల్ల ప్రాథమిక పాఠశాలల్లోనూ ఉపాధ్యాయులు చాలరు. ఇదే విషయం ‘ఆంధ్రజ్యోతి’ వెలుగులోకి తీసుకురాగా.. అప్పటివరకు ఉన్న ఉపాధ్యాయ, విద్యార్థి నిష్పత్తిని 1:30 నుంచి 1:20కు మార్చారు. ఇది మంచిదే. అయినా అక్కడ ఉపాధ్యాయుల కొరత ఇంకా ఉంటూనే ఉంది. మరోవైపు ఉన్నత పాఠశాలల్లో మాత్రం ఈ నిష్పత్తి 1:30గానే ఉంది. దీనివల్లా ఇబ్బందేమీ లేదు. కానీ ఇక్కడా కొరత ఉంది. అంటే అటు ప్రాథమిక పాఠశాలల్లోనూ ...ఇటు ఉన్నత పాఠశాలల్లోనూ ఉపాధ్యాయులు అరకొరగానే ఉన్నారు. అర ుుతే ఏ పాఠశాల విద్యార్థులు అదే పాఠశాల లో ఉండడంతో ఏదోలా సర్దుబాటు చేసుకుని నడిపించేస్తున్నారు. తరగతి గదులు చాలీచాలనట్లున్నా వరండాలోను, ఇంకోచోట కూర్చోబెట్టి చదువు చెప్పేసేవారు. ఉపాధ్యాయులు కొంత తక్కువగా ఉన్నా ఏదో ఒకలా సర్దుబాటు చేసుకునేవారు. కానీ ఇప్పుడు ఉన్నత పాఠశాలల్లో ప్రాథమిక పాఠశాలల విలీనంతో రెంటికీ చెడ్డ రేవడిలా పరిస్థితి తయారైంది. కొత్తచోటకు వెళ్లడం విద్యార్థులకు ఇబ్బంది. అదే సమయంలో కొత్త పాఠశాలకు వెళ్లాక...మళ్లీ తరగతుల వారీగా ఉపాధ్యాయుల బోధన, తరగతి గదుల కేటాయింపు ఇవన్నీ ఉండాలి.


కానీ ఉపాధ్యాయులు, తరగతి గదులు లేవు. దీంతో వెళ్లిన విద్యార్థులను కొన్నిచోట్ల వెనక్కి పంపేస్తున్నారు. ఉన్నత పాఠశాలలో విలీనం అని కాగితం మీద చూపిస్తున్నా మళ్లీ ప్రాథమిక పాఠశాలకే వచ్చి పాఠాలు వింటున్నారు. అంతేకాదు...గతంలో ప్రాథమిక పాఠశాలల్లో ఉన్న ఉపాధ్యాయులే వీరికి పాఠాలు చెప్తున్నారు. అంతే తప్ప ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు వచ్చి చెప్పడం లేదు. వచ్చేందుకు ఉన్నత పాఠశాలల్లోనూ ఉపాధ్యాయుల కొరత ఉంది. విద్యార్థులు అటూ ఇటూ తిరగడం... మొత్తంగా చదువు చట్టుబండలు కావడం తప్ప...విలీనంచేసి ఏం సాధించారనే విమర్శ బలంగా వినిపిస్తోంది. 

Updated Date - 2021-11-09T15:57:39+05:30 IST