సర్దుపాట్లు

ABN , First Publish Date - 2021-10-11T05:26:59+05:30 IST

ఎయిడెడ్‌ విద్యాసంస్థలపై ప్రభుత్వ నిర్ణయం.. సరికొత్త సమస్యలు తెచ్చిపెట్టింది. ఆయా విద్యాసంస్థల్లో పని చేసే ఉపాధ్యాయులు, అధ్యాపకుల సర్దుబాటు సమస్యగా మా రింది.

సర్దుపాట్లు

సరికొత్తగా ఎయిడెడ్‌ తలనొప్పులు  

విద్యా సంస్థల విలీనంతో సమస్యలు

ఉద్యోగోన్నతల ఆశలపై సర్దుబాటు నీళ్లు

కాంట్రాక్టు అధ్యాపకుల పోస్టులకు ఎసరు

విద్యా వలంటీర్ల నియామకం అనుమానమే 

పాఠశాలలు, కళాశాలల్లో ఉద్యోగోన్నతలకు బ్రేక్‌


గుంటూరు(విద్య), అక్టోబరు 10: ఎయిడెడ్‌ విద్యాసంస్థలపై ప్రభుత్వ నిర్ణయం.. సరికొత్త సమస్యలు తెచ్చిపెట్టింది. ఆయా విద్యాసంస్థల్లో పని చేసే ఉపాధ్యాయులు, అధ్యాపకుల సర్దుబాటు సమస్యగా మా రింది. జిల్లాలో ఎయిడెడ్‌ విద్యాసంస్థల్లో పనిచేసే ఉపాధ్యాయులు, అధ్యాపకులు ప్రభుత్వ పాఠశాలల్లో, కళాశాలల్లోకి రావడంతో కొత్తగా తలనొప్పులు పుట్టుకువస్తున్నాయి. ఇప్పటికే జిల్లాలో దాదాపు 270 పాఠశాలల నుంచి వచ్చిన దాదాపు 700 మంది ఉపాధ్యాయులు వచ్చారు. వీరి నియామకాలతో ఇక కొత్త పోస్టులు భర్తీ ఉండక పోవ చ్చు. అంతేగాక ఉన్న ఉపాధ్యాయులకు  ఉద్యోగోన్నతులు నిలిచిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం అవుతోంది. ఎయిడెడ్‌ పాఠశాలల నుంచి వచ్చిన స్కూల్‌ అసిస్టెంట్లను ఉన్నత పాఠశాలల్లో సర్దుబాటు చేయనున్నారు. దీంతో ఎస్‌జీటీలకు ఉద్యోగోన్నతులు నిలిచిపోతాయి.  మరోవైపు దాదాపు 50 మంది వివిధ జడ్పీ, ప్రభుత్వ పాఠశాలల్లో హెచ్‌ఎంలుగా చేరే అవకాశం ఉంది. దీంతో ఆయా పాఠశాలల్లో ఎప్ప టి నుంచే స్కూల్‌ అసిస్టెంట్ల నుంచి హెచ్‌ఎం హోదాలోకి రావాల్సిన ఉపాధ్యాయులకు ఇక ఆ అవకాశం దక్కకపోవచ్చు. పాఠశాలల్లో ఖాళీ పోస్టుల స్థానంలో బోధనకు విద్యావలంటీర్లను నియమిస్తూ వస్తున్నా రు. తాజాగా ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరానికి విద్యా వలంటీర్ల ని యామకంపై ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఎయిడెడ్‌ ఉపాఽ ద్యాయుల సర్దుబాటుతో  విద్యా వలంటీర్ల అవసరం ఉండదు. దీంతో విద్యా వలంటీరు పోస్టులైనా వస్తాయని ఎదురుచూస్తున్న నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. 


కాంట్రాక్టు అధ్యాపకుల పోస్టులకు ఎసరు

జిల్లాలో ఐదు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, మరో 21 ప్రభుత్వ జూని యర్‌ కళాశాలలు ఉన్నాయి. ఆయా  కళాశాలల్లో రెగ్యులర్‌ అధ్యాప కులతో పాటు ఎన్నో ఏళ్లుగా కాంట్రాక్టు అధ్యాపకులు పెద్దసంఖ్యలో పనిచేస్తున్నారు. ప్రస్తుతంఎయిడెడ్‌ అధ్యాపకుల్ని సర్దుబాటు చేయాల్సి వచ్చింది. ఈ పరిస్థితుల్లో ఆయా కళాశాలల్లో పని చేస్తున్న  కాంట్రాక్టు అధ్యాపకుల పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నర్థకంగా మారింది. దాదాపు రెండున్నర దశాబ్దాల నుంచి కాంట్రాక్టు అధ్యాపకులు ఆయా కళాశా లల్లో పనిచేస్తున్నారు. ఇటీవల ఎయిడెడ్‌ కళాశాలల్లో పనిచేసే అధ్యాప కుల్ని ప్రభుత్వం ఆర్‌జేడీ కార్యాలయాల్లో రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. తాజాగా వారికి డిగ్రీ, జూనియర్‌ కళాశాలల్లో ఖాళీగా ఉన్న పోస్టుల్లో నియామకం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఫలితంగా కాంట్రాక్టు ఉపాధ్యాయుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది.


వర్సిటీలో గెస్టుఫ్యాకల్టీల ఆందోళన

ప్రభుత్వ కళాశాలల్లో మిగిలిపోయిన ఎయిడెడ్‌ కళాశాలల అధ్యాపకులను ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఖాళీగా ఉన్న పోస్టుల్లో భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఎన్నో  సంవత్సరాలుగా పనిచేస్తున్న గెస్టుఫ్యాకల్టీలు ఆందోళనకు గురవుతు న్నారు. వర్సిటీలో కాంట్రాక్టు అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు 120 మంది, గెస్ట్‌ ఫ్యాకల్టీలు 70 మందికిపైగా బోధన విధులు నిర్వహిస్తున్నారు. ప్రభు త్వ కళాశాలల్లో పోస్టులు పూర్తిస్థాయిలో భర్తీ అయిన తరువాత మిగి లిన ఎయిడెడ్‌ అధ్యాపకుల్ని వర్సిటీలో నియమించాలని ప్రతిపాదనలు ఉన్నట్లు గెస్టుఫ్యాకల్టీలు చెబుతున్నారు. ఇటీవల వారికి ఆప్షన్లు సైతం  ఇచ్చారని చెబుతున్నారు. దీంతో తమ పరిస్థితి ఏమిటని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్సిటీ స్థాయిలో పీజీ విద్యార్థులకు బోధన అందిస్తున్న వారి స్థానంలో డిగ్రీ, జూనియర్‌ కళాశాలల అధ్యాపకుల నియామకంపై విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలా ప్రత్యక్షంగా పరోక్షంగా పాఠశాలల్లో, కళాశాలల్లో, వర్సిటీల్లో దాదాపు 1500 నుంచి 2 వేల పోస్టులపై విలీన ప్రభావం పడే ప్రమాదం ఉందని అధ్యాపక, ఉపాధ్యాయ సంఘాలు వెల్లడిస్తున్నాయి.


 

Updated Date - 2021-10-11T05:26:59+05:30 IST