బోర్డు మీదే.. ప్రశ్నలు..!

ABN , First Publish Date - 2021-10-23T05:19:03+05:30 IST

పాఠశాల స్థాయిలో విద్యార్థులు నిర్వహిస్తున్న ఎఫ్‌ఏ పరీక్షలు ఉపాధ్యాయులకు, విద్యార్థులకు తలనొప్పిగా మారాయి.

బోర్డు మీదే.. ప్రశ్నలు..!

తలనొప్పిగా ఎఫ్‌ఏ పరీక్షలు

ఉపాధ్యాయుల వాట్సప్‌కు ప్రశ్నాపత్రం 

అది చూపి విద్యార్థులు సమాధానాలు రాయాలి!

ఇవేం పరీక్షలంటూ ఉపాధ్యాయులు ఆందోళన

 ముందుగానే పేపర్‌ లీక్‌ అవుతుందని ఆరోపణలు


గుంటూరు(విద్య), అక్టోబరు 22: పాఠశాల స్థాయిలో విద్యార్థులు నిర్వహిస్తున్న ఎఫ్‌ఏ పరీక్షలు ఉపాధ్యాయులకు, విద్యార్థులకు తలనొప్పిగా మారాయి. జిల్లా కామన్‌ ఎగ్జామినేషన్‌ బోర్డు నుంచి రావాల్సిన ప్రశ్నాపత్రాలు ఎస్‌ఈఆర్‌టీ నుంచి నేరుగా వాట్సప్‌ ద్వారా డీఈవోకు ఆ తరువాత ఎంఈవో, హెచ్‌ఎంలకు చేరు తున్నాయి. ఆ ప్రశ్నాపత్రాలు సెల్‌ఫోన్‌లో చూసి బోర్డుమీద రాస్తే విద్యార్థులు వాటిని చూసి సమాధానాలు రావాల్సిన పరిస్థితి నెలకొంది.  

 జిల్లాలో 1 నుంచి 10 తరగతుల విద్యార్థులకు ఈనెల 21 నుంచి ఎఫ్‌ఎ1  పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఏటా ఈ పరీక్షల కోసం జిల్లా కామన్‌ ఎగ్జామినేషన్‌ బోర్డు నుంచి ప్రశ్నాపత్రం ముద్రించి ఇచ్చేవారు. రెండు సంవత్సరాల నుంచి డీసీఈబీ నుంచి ప్రశ్నాపత్రం రావడం లేదని ఉపాధ్యాయులు చెబుతున్నారు.  గత ఏడాది ఓ ప్రైవేటు పబ్లిషర్‌కు పేపర్‌ సప్లయి బాధ్యత అప్పగించారు. వారు ఇష్టా రాజ్యంగా ప్రశ్నాపత్రాలు విక్రయించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈసారి రాష్ట్రవ్యాప్తంగా ఒకే నమూనాలో ప్రశ్నాపత్రం తయారుచేసి దానిని వాట్సప్‌ గ్రూపు ద్వారా సరఫరా చేస్తున్నారు. కొన్నిచోట్ల వాట్సప్‌ గ్రూపుల నుంచి ముందే ప్రశ్నా పత్రం లీక్‌ అవుతుందని ఆరోపణలు వస్తున్నాయి. ఒక్కోసారి ప్రశ్నాపత్రంలోని ప్రశ్నలు బోర్డుపై రాయడానికే దాదాపు అరగంట సమయం పడుతోంది. కొంత మంది ఉపాధ్యాయుల రాత విద్యార్థులకు అర్ధం కాక ఇబ్బందులు పడుతున్నారని ఫిర్యాదులు వస్తున్నాయి.


ఎస్‌ఈఆర్‌టీ ద్వారా ప్రశ్నాపత్రం వస్తుంది..

రాష్ట్రవ్యాప్తంగా ఎఫ్‌ఎ1 పరీక్షలకు ఎస్‌ఈఆర్‌టీ నుంచి ప్ర శ్నా పత్రం వస్తుంది. దానిని వాట్సప్‌ ద్వారా పంపి ప్రశ్నలు బోర్డుమీద టీచర్స్‌ రాస్తే విద్యార్థులు సమాధానాలు రాస్తారు. దీనివల్ల ఉపాధ్యాయులకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ప్రాథమిక స్థాయిలో ఉన్న కొన్ని ఇబ్బందుల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం.

- ఆర్‌ఎస్‌ గంగాభవాని, డీఈవో

 

Updated Date - 2021-10-23T05:19:03+05:30 IST