బడి గంట మోగింది!

ABN , First Publish Date - 2022-07-05T06:46:37+05:30 IST

నేటి నుంచి బడి గంట మోగనుంది.

బడి గంట మోగింది!

నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం

 కిట్‌లు, పుస్తకాలు ఒక్కో స్కూలులో 10 మందికి ఇవ్వాలని ఆదేశాలు

 తరగతి గదులు చాలకుంటే ఎక్కడి పిల్లలు అక్కడే

 విద్యాకానుక కిట్‌లు సరిపడా రాని వైనం

 ఉపాధ్యాయుల పునర్విభజన జరగకుండా నూతన విద్యావిధానం అమలయ్యేనా!

నేటి నుంచి బడి గంట మోగనుంది. అన్ని పాఠశాలలూ తెరుచుకోనున్నాయి. ప్రతి ఏటా జూన్‌ 13వ తేదీ నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కావడం ఆనవాయితీగా వస్తోంది. కరోనా వ్యాప్తి కారణంగా గతేడాది ఆగస్టు 16వ తేదీ నుంచి పాఠశాలలను ప్రారంభించారు. దీంతో పదో తరగతి పరీక్షల నిర్వహణ ఆలస్యమైంది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 40 రోజుల ముందుగానే పాఠశాలలు తెరుచుకుంటున్నాయి. అయితే విద్యార్థులకు అవసరమైన విద్యా కానుక కిట్‌లు సరిపడా చేరలేదు. సబ్జెక్ట్‌ టీచర్ల కొరత వెంటాడుతోంది. ఇన్ని సమస్యల నడుమ ఈ విద్యా సంవత్సరం నేటి నుంచి మొదలవుతోంది.  

ఆంధ్రజ్యోతి- మచిలీపట్నం : నూతన విద్యావిధానం ప్రకారం అంగన్‌వాడీ 1, 2, తరగతులు ఒక పాఠశాలగా, ఉన్నత పాఠశాలకు కిలోమీటరు దూరంలో ఉన్న ప్రాథమిక పాఠశాలల్లోని 3,4,5 తరగతులను విలీనం చేస్తే అందుకు అనుగుణంగా టీచర్లను పునర్విభజన లేదా బదిలీ చేయాల్సి ఉంది. ఈ ప్రక్రియ జిల్లాలో జరగలేదు. ఈ పునర్విభజన ప్రక్రియను, లేదా బదిలీ ప్రక్రియను ఎలా చేస్తారనే అంశంపై స్పష్టతలేదు. 117 జీవోను రద్దు చేయాలని, కోరుతూ టీచర్లు మండల, డివిజన్‌, జిల్లాస్థాయిలో ఆందోళనలు ఇటీవల కాలం వరకు చేస్తూనే ఉన్నారు. 3,4,5 తరగతులను తమ గ్రామంలోని పాఠశాల నుంచి దూరంగా ఉన్న పాఠశాలలోకి విలీనం చేయవద్దనే ఆందోళనలు ప్రారంభమయ్యాయి. జిల్లాలో రూ.100 కోట్లతో చేపట్టే రెండో విడత నాడు-నేడు పనులు పూర్తిస్థాయిలో ప్రారంభం కాలేదు. 

 జగనన్న విద్యాకానుక అందేనా? 

జగనన్న విద్యాకానుక కిట్‌లు పాఠశాలలకు నేటికీ పూర్తిస్థాయిలో చేరలేదు. ఈ కిట్‌లో యూనిఫాం, బ్యాగు, బెల్టు, బూట్లు, సాక్సులు, పాఠ్యపుస్తకాలు, నోట్‌పుస్తకాలు, వర్క్‌బుక్‌లు, ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీ ఉండాలి. బూట్లు, సాక్సులు, అన్ని పాఠ్యపుస్తకాలు అందుబాటులో లేవు. జిల్లా కేంద్రం నుంచి మండల కేంద్రాలకు ఈ కిట్‌లు పూర్తిస్థాయిలో చేరలేదు. సమగ్రశిక్ష డైరెక్టర్‌ నెట్రిసెల్వీ ఆడియో సమాచారం టీచర్లకు, ఎంఈవోలకు పంపారు. పాఠశాలల పునఃప్రారంభం నాటికి  ఒక్కో పాఠశాలలో కనీసం 10 మంది విద్యార్థులకైనా పూర్తిస్థాయిలో కిట్‌లను అందజేసేలా ఏర్పాట్లు చేసుకోవాలని, ఎంఈవోలు ఈ బాధ్యతలను తీసుకోవాలని ఈ సమాచారంలో సూచన చేశారు. 

 సబ్జెక్టు టీచర్ల కొరత 

ఉమ్మడి కృష్ణా జిల్లాలో సబ్జెక్టు టీచర్ల కొరత ఉంది. గ్రేడ్‌-2 ప్రధానోపాధ్యాయులు 308 మందికిగాను 286 మంది పనిచేస్తున్నారు. స్కూల్‌ అసిస్టెంట్‌ లెక్కల టీచర్లు 814 మందికిగాను 788 మంది మాత్రమే ఉన్నారు. ఫిజిక్స్‌ టీచర్లు 598 మందికిగాను 581 మంది ఉన్నారు. బయోలాజికల్‌ సైన్సు టీచర్లు 632 మంది పనిచేయాల్సి ఉండగా 580 మంది అందుబాటులో ఉన్నారు. ఇంగ్లీష్‌ టీచర్లు 659 మందికిగాను 617 మంది మాత్రమే ఉన్నారు. తెలుగు టీచర్లు 786 మందికిగాను 748 మంది ఉన్నారు. సోషల్‌ టీచర్లు779 మందికిగాను 654 మంది ఉన్నారు. పీడీలు 357 మందికిగాను 301 మంది మాత్రమే ఉన్నారు.  ఎస్‌జీటీ తెలుగు టీచర్లు మిగులుబాటుగా ఉన్నవారు, వారికున్న విద్యార్హతలను బట్టి పదోన్నతులు ఇవ్వాల్సి ఉండగా ఈప్రక్రియ ఎప్పటికి పూర్తవుతుందో తెలియని దుస్థితి నెలకొంది. 

 నూతన విద్యావిధాన ం అమలయ్యేనా?

నూతన విద్యావిధానంలో పాఠశాలలు ఈ విద్యా సంవత్సరం నుంచి పనిచేయాల్సి ఉంది. అంగన్‌వాడీ, 1,2 తరగతులను ఒక పాఠశాలగా పరిగణించాల్సి ఉంది. ఉన్నత పాఠశాలలకు కిలోమీటరు దూరంలో ఉన్న ప్రాథమిక పాఠశాలల్లోని 3,4,5 తరగతులను   విలీనం చేసి, అందుకు అనుగుణంగా విద్యార్థులు, ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాల్సి ఉంది. ఇందుకోసం ప్రభుత్వం ఈ ఏడాది జూన్‌10వ తేదీన జీవో నెంబరు 117ను జారీ చేసింది. ఈ జీవో ప్రకారం 30 మంది విద్యార్థులకు ఒక టీచరు ఉండాలనే నిబంధన విధించింది. 31 మంది కంటే అధికంగా పిల్లలుంటే ఇద్దరు టీచర్లను పాఠశాలకు కేటాయిస్తామని చెబుతున్నారు. ఉన్నత పాఠశాలల్లో ఉమ్మడి జిల్లాలోని 1788 ప్రాథమిక పాఠశాలల్లోని 3,4,5 తరగతులను విలీనం చేసినట్లుగా అధికారికంగా చూపుతున్నారు.  ఉన్నత పాఠశాలల్లో సరిపడినన్ని తరగతి గదులు లేకుంటే 3,4,5 తరగతులను ప్రాథమికపాఠశాలలోనే నిర్వహించాల్సి ఉంది.

Updated Date - 2022-07-05T06:46:37+05:30 IST