సర్దుబాటుకు.. శ్రీకారం

ABN , First Publish Date - 2021-10-12T05:45:04+05:30 IST

జిల్లాలోని ఎయిడెడ్‌ స్కూల్స్‌ విద్యార్థులు ఇతర పాఠశాలల్లోకి తరలించే కార్యక్రమానికి విద్యాశాఖ త్వరలో శ్రీకారం చుట్టనుంది.

సర్దుబాటుకు.. శ్రీకారం

ఎయిడెడ్‌ విద్యార్థుల తరలింపునకు ప్రణాళిక

విద్యార్థుల సర్దుబాటుకు జిల్లాకు ప్రత్యేక అధికారి 

డిప్యూటీ డీఈవోలు, ఎంఈవోల సమన్వయంతో తరలింపు

దసరా సెలవులు తరువాత వేగం పుంజుకోనున్న  ప్రక్రియ


గుంటూరు(విద్య), అక్టోబరు 11: జిల్లాలోని ఎయిడెడ్‌ స్కూల్స్‌ విద్యార్థులు ఇతర పాఠశాలల్లోకి తరలించే కార్యక్రమానికి విద్యాశాఖ త్వరలో శ్రీకారం చుట్టనుంది. ఇందుకోసం ఇప్పటికే జిల్లాకు ఒక ప్రత్యేక అధికారిని ప్రభుత్వం నియమించినట్లు విద్యాశాఖ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఎయిడెడ్‌ స్కూల్స్‌ జిల్లాలో దాదాపు 350 వరకు ఉన్నాయి. ఇప్పటికే 270 స్కూల్స్‌లో ఉపాధ్యాయుల్ని ఆయా యాజమాన్యాలు ప్రభుత్వానికి సరెండర్‌ చేశాయి. ఆయా ఉపాధ్యాయులు 700 మంది ప్రస్తుతం డీఈవో పూల్‌లో ఉన్నారు. అయితే ప్రభుత్వానికి సరెండర్‌ అయిన పాఠశాలల్లో చదివే విద్యార్థులను సమీపంలోని జడ్పీ, ఎంపీపీ, మున్సిపల్‌ స్కూల్స్‌లో చేర్పించడానికి గల అవకాశాలు పరిశీలించాల్సిందిగా ఇప్పటికే ఎంఈవో, డిప్యూటీ డీఈవోలకు మౌఖిక ఆదేశాలు అందాయి. దీంతో వారు తమ పరిధిలో ఉన్న ఎయిడెడ్‌ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను లెక్క తేల్చేపనిలో ఉన్నారు. జిల్లాలో ప్రభుత్వంలో విలీనం అయిన 270 ఎయిడెడ్‌ పాఠశాలల్లో దాదాపు 6 వేల నుంచి 7 వేల మంది విద్యార్థులు ఉన్నట్లు సమాచారం. ఆయా విద్యార్థుల తల్లిదండ్రులతో ముందుగా సమావేశాలు ఏర్పాటు చేసి వారి ఇష్టప్రకారం విద్యార్థుల్ని ఇతర పాఠశాలలకు తరలించాలని విద్యాశాఖ వర్గాలు యోచిస్తున్నాయి. ఈ విషయంలో తల్లిదండ్రుల్ని బలవంత పెట్టవద్దని స్పష్టమైన ఆదేశాలు డిప్యూటీ డీఈవో, ఎంఈవోలకు అందాయి.


మార్గదర్శకాలు ఇలా..

ప్రస్తుతం ఎయిడెడ్‌ పాఠశాలల్లో విద్యార్థులు ఏ తరగతిలో చదువుతుంటే అదే తరగతిలో సమీపంలోని ప్రభుత్వ స్కూల్స్‌లో  చేర్పించాలి.  ఒకవేళ విద్యార్థులు హాస్టల్స్‌లో వసతి పొందుతూ చదువుతూ ఉంటే వారిని హాస్టల్స్‌లో చేర్పించి దానికి సమీపంలోని స్కూల్స్‌లో చేర్పిస్తారు. ప్రభుత్వ ఉత్తర్వులతో జిల్లాలో 270 పాఠశాలలు ప్రైవేటు స్కూల్స్‌గా మారిన విషయం తెలిసిందే. అయితే విద్యార్థులు అక్కడే ఉండి చదువుకుంటామంటే ఈ విద్యా సంవత్సరానికి ఉపాధ్యాయుల్ని కూడా డిప్యూటేషన్‌పై అక్కడ నియమించి విద్యను అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి ఎటువంటి ఫీజులు వారి వద్ద వసూలు చేయకుండా ఆయా స్కూల్స్‌కు  ప్రత్యేక ఉత్తర్వులు ఇవ్వనున్నారు. ముందుగా తల్లిదండ్రులతో ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేసి వారి నుంచి అంగీకారం పొందిన తరువాత టీసీలు జారీ చేసేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. తల్లిదండ్రులను, యాజమాన్యాలను, విద్యార్థులను నొప్పించకుండా ఈ తరలింపు ప్రక్రియ చేపట్టేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ప్రభుత్వం నుంచి అధికారులకు ఆదేశాలు అందాయి. దసరా సెలవులు ముగిసిన తరువాత ఈ కార్యక్రమం వేగం పుంజుకోనుందని ఉపాద్యాయ సంఘాల నాయకులు చెబుతున్నారు.


Updated Date - 2021-10-12T05:45:04+05:30 IST