తరగతి గది బోధన షురూ..

ABN , First Publish Date - 2021-02-25T06:33:08+05:30 IST

తరగతి గది బోధన షురూ..

తరగతి గది బోధన షురూ..
ల్యాబర్తిలో విద్యార్థులతో మాట్లాడుతున్న డీఈవో వాసంతి

6, 7, 8వ క్లాస్‌ విద్యార్థులకు పాఠాలు ప్రారంభం


పర్యవేక్షించిన అధికారులు


కొవిడ్‌ నిబంధనలు అమలు చేయాలి: డీఈవో 


 వరంగల్‌ రూరల్‌ కల్చరల్‌, ఫిబ్రవరి 24 : ప్రభుత్వ ఆదేశాల మేరకు వరంగల్‌ రూరల్‌ జిల్లాలో బుధవారం 6 నుంచి 8వ తరగతి విద్యార్థులకు ప్రత్యక్ష బోధనను ప్రారంభించామని జిల్లా విద్యాశాఖ అధికారి డి. వాసంతి తెలిపారు. జిల్లాలో ప్రభుత్వ జిల్లా పరిషత్‌ పాఠశాలలు, మోడల్‌ స్కూళ్లు, కేజీవీబీ, ట్రైస్‌, ప్రైవేటు మొత్తం 285 ఉండగా, విద్యార్థులు 6 నుంచి 8వ తరగతి వరకు 17,954 మంది  ఉన్నారు. వీరిలో 1295 మంది విద్యార్థులు మొదటి రోజు పాఠశాలలకు హాజరైనట్లు డీఈవో పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలకు 675 మంది విద్యార్థులు హాజరు కాగా వీరందరికి మధ్యాహ్న భోజనం అందజేసినట్లు డీఈవో తెలిపారు. జిల్లాలోని వర్ధన్నపేట మండలం ల్యాపర్తి, కొత్తపల్లి, బండవుతాపూర్‌ పాఠశాలలను డీఈవో సందర్శించి విద్యార్థుల హాజరు శాతం, కొవిడ్‌ నిబంధనల అమలు, ఇతర ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఉపాధ్యాయులతో మాట్లాడి ఇతర వివరాలు తెలుసుకున్నారు. 


సైనిక్‌ స్కూల్‌ను సందర్శించిన ఆర్డీవో ..


ఖానాపురం : పాఠశాలల్లో కొవిడ్‌ నిబంధనలు పాటించాలని ఆర్డీవో పవన్‌కుమార్‌ అన్నారు. అశోక్‌నగర్‌లోని గిరిజన సైనిక్‌ స్కూల్‌ను ఆయన సందర్శించి, వసతిగృహాలు, తరగతి గదులు, భోజనశాల, స్టోర్‌ రూమ్స్‌ పరిశీలించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పాఠశాలలోని గదులను పరిశుభ్రంగా ఉంచాలని, విద్యార్థులు మాస్క్‌లు ధరించి సామాజిక దూరం పాటించేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సైనిక పాఠశాల ప్రిన్సిపాల్‌ రాజు, డైరెక్టర్‌ శ్రీనివాసరావుకు సూచించారు. ఆర్‌ఐ ఉపేందర్‌ తదితరులు పాల్గొన్నారు. 




 క్లాసులో 20 మంది మాత్రమే ఉండాలి: రూరల్‌ ఆర్డీవో

పర్వతగిరి : కొవిడ్‌ నిబంధనల మేరకు పాఠశాలలు నిర్వహించాలని వరంగల్‌ రూరల్‌ ఆర్డీవో మహేందర్‌జీ అన్నారు. మండలంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలను ఆయన తనిఖీ చేసి మాట్లాడారు. ప్రతీ క్లాసులో 20 మంది విద్యార్థులు మాత్రమే ఉండాలని, క్లాసురూంలను తప్పనిసరిగా శానిటైజ్‌ చేయాలని సూచించారు. హెచ్‌ఎంలు సుభాషిణి, మాధవి, ఆర్‌ఐ సత్యనారాయణ, వీఆర్వో యాదగిరి పాల్గొన్నారు. 

 దుగ్గొండి : మండలంలోని దుగ్గొండి, మైసంపల్లి పాఠశాలలను బుధవారం ఎంఈవో సత్యనారాయణరావు తనిఖీ చేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరును పరిశీలించారు. కొవిడ్‌ నిబంధనలు పాటించి బోధనసాగించాలని  ఉపాధ్యాయులకు సూచించారు.

 


Updated Date - 2021-02-25T06:33:08+05:30 IST