స్కూలుకెళ్లని సృజనకారుడు

ABN , First Publish Date - 2022-01-29T09:08:27+05:30 IST

నేనుఎవరి గురించి అయితే మాట్లాడుతున్నానో ఆ ప్రతిభామూర్తి పాఠశాల గడప తొక్కని వ్యక్తి. ఇక కళాశాల చదువు గురించి చెప్పడానికి ఏముంటుంది? మరీ ముఖ్యంగా, ఏ కళలో ఆయన నిష్ణాతుడో...

స్కూలుకెళ్లని సృజనకారుడు

నేనుఎవరి గురించి అయితే మాట్లాడుతున్నానో ఆ ప్రతిభామూర్తి పాఠశాల గడప తొక్కని వ్యక్తి. ఇక కళాశాల చదువు గురించి చెప్పడానికి ఏముంటుంది? మరీ ముఖ్యంగా, ఏ కళలో ఆయన నిష్ణాతుడో, ఆ కళలో ఎవరి వద్దా శిక్షణ పొందని ప్రజ్ఞాశాలి. నేను కీర్తిగానం చేస్తున్న ఈ సృజనకర్త ఆధునిక మహాకవి దేవులపల్లి కృష్ణశాస్త్రి కుమారుడు. 1940లలోనే ‘కామిక్ బుక్’ సృష్టించిన ఆ వ్యక్తి ఈ వ్యాసకర్తకు జనకుడు. 


ఆయన తన స్టూడియోలో నిరంతరం బొమ్మల జగత్తును రూపిస్తుండేవారు. ఆ గదిలో ఎన్నో కామిక్స్ ఉండేవి. అవన్నీ డెల్, గోల్డ్ కే, సన్, కోమ్ట్ ముద్రణలు. ఒక్కొక్క పుస్తకమూ పలువురు చిత్రకళా నిపుణుల, కథా కథన కుశలుర సంయుక్త కృషి. మొదటి పేజీ క్రింద భాగంలో ఒక కథా రచయిత, ఒక గీతకారుడు, ఒక వర్ణ మాంత్రికుడు, ఒక అక్షర రూపకర్త, వారందరినీ సమైక్యపరిచి పుస్తకాన్ని సృష్టించిన ఎడిటర్ పేరు ఉండేవి. వారందరూ తమ తమ వృత్తి విభాగాల్లో శిక్షణ పొందినవారు. మా నాన్న ఆ పనులన్నిటినీ స్వయంగా నేర్చుకుని సొంతంగా నిర్వహించుకున్న కళా సృజన కౌశల్యుడు.


నవ కవితాచక్రవర్తి అయిన దేవులపల్లి వేంకట కృష్ణశాస్త్రి తన తనయుడిని ఏ పాఠశాలకు పంపలేదు. తనతో లోక సంచారం చేయడం, సాహిత్యసభల్లో పాల్గొనడం, కవితా పఠనాలను వినడమే సరైన విద్య అని భావించారు. ఇంకేముంది, కాలమంతా మా చిన్నారి నాన్నదే. సంచారంతో పాటు అద్భుత ఊహాలోకాల యాత్రికుడూ అయ్యారు. టార్జాన్ బొమ్మలను గంటల తరబడి చూస్తుండేవారు. లెక్కలేనన్ని తెల్లకాగితాలను స్కెచ్‌లతో నింపేసేవారు. తానూ ఒక బర్నె హోగార్త్ కావాలనేది సంకల్పం.


మా నాన్నగారు చిత్ర సృజన చేస్తుండగా వీక్షించడం ఇంద్రజాల ప్రదర్శనను చూడడంలా ఉండేది. 11 అంగుళాల వెడల్పు, 14 అంగుళాల పొడవు ఉన్న అందమైన కాగితంపై ఆయన ఊహలు బొమ్మలుగా రూపెత్తేవి. ఆయన ఆ తెల్ల కాగితాన్ని మూడు సమాన దీర్ఘచతురస్రాలుగా, ఒక దానికింద ఒకటిగా విభజించేవారు. వాటిలోనూ, వాటి చుట్టూ ఖాళీలను ఉంచేవారు. ఆ తరువాత పెన్సిల్‌తో తన ఊహలను బొమ్మలుగా, అక్షరాలుగా ఆ దీర్ఘచతురస్రాలను నింపివేసేవారు. మనం నిత్యం చూసే దృశ్యాలు వింత సోయగాలతో బొమ్మలుగా పునరావతారమెత్తేవి.


బడికి వెళ్లనే వెళ్లని పదహారేళ్ళ బాలుడే అయినప్పటికీ, తల్లి భాష తెలుగులో తన సొంత కామిక్ పుస్తకాన్ని సృష్టించారు. దానిపేరు ‘బానిస పిల్ల’. అందులోని కథ, బొమ్మలు సంపూర్ణంగా ఆయనవే. తన ఇంగ్లీష్ ట్యూటర్ (హాలీవుడ్!) పట్ల ఆయనకు ఎంత అభిమానమో! ముఖ్యంగా ‘సలోమె వేర్ షి డ్యాన్స్‌డ్’ అనే 1945 నాటి సినిమా అంటే చెప్పలేని ఇష్టం (హీరోయిన్ డి కార్లో నాన్నగారి తొలి కలల రాణి) సరే, నిత్యం తాను సృజిస్తున్న బొమ్మలతో ఆయన గుమ్మం ఎక్కని, దిగని పత్రికా కార్యాలయాలు లేవు. ఆ కామిక్స్‌ను ఆదరించిన ఎడిటర్లూ లేరు. ‘మరీ విదేశీయంగా కన్పిస్తున్నాయి. భారతీయ ఇతివృత్తంతో సృజించండి’ అని వారు సలహా ఇచ్చారు.


సంభాషణలు, కథనాలను వదిలివేసి రేఖల సృష్టికే పరిమితమయ్యారు నాన్న. పెన్సిల్‌తో వ్యక్తులు, ప్రదేశాలను చిత్రించేవారు. వివిధ కోణాల్లో విభిన్న రీతుల్లో ఉన్న ఆ చిత్రాలు వీక్షకులను అమితంగా ఆకట్టుకునేవి. తన తొలి సమగ్ర సృజనలను తానే స్వయంగా ప్రచురించుకునేందుకూ సంకల్పించుకున్నారు. మరి డబ్బు? తండ్రిగారిని అడిగేందుకు ఆత్మాభిమానం అడ్డువచ్చింది. ఒక వితరణశీలి అవసరమయ్యాడు. పుస్తకం వెనుక పేజీపై ఒక సహృదయుడైన వ్యాపారి వాణిజ్య ప్రకటనను ముద్రించడానికి సిద్ధపడ్డారు. అలా ఆయన ప్రథమ పుస్తకం ‘బుజ్జాయి- రామ్ పబ్లికేషన్స్’ (రామ్ అనేది ఆర్థిక సహాయం చేసిన వ్యాపారి పేరు) ప్రచురణగా వెలువడింది. ముద్రించిన వెయ్యి ప్రతులూ ప్రెస్ నుంచి వచ్చీరాగానే అమ్ముడుపోయాయి. అది ప్రప్రథమ భారతీయ కామిక్ కాకపోవచ్చునేమో కానీ, నిస్సందేహంగా ప్రథమ తెలుగు కామిక్ పుస్తకం. అలా మా నాన్నగారి సృజనాత్మక జీవితం వేగాన్ని, ఉద్వేగాన్ని సంతరించుకుంది. 


కళాకారుడుగా, మనిషిగా పరిణతి పొందుతూ అనేక బాలల పుస్తకాలను ప్రచురించారు. వాటిలో అవార్డులు పొందిన పుస్తకాల సంఖ్య తక్కువేమీ కాదు. మా నాన్నని కలుసుకోవాలనుకున్న వారి సంఖ్య ఆయన తండ్రి అభిమానుల సంఖ్యను మించిపోయింది. డుంబు ఆయన సృష్టించిన ఒక కొంటె బాలుడు. డెనిస్ ది మెనాస్, హెన్రీ, విలియంల స్ఫూర్తితో పుట్టిన సంపూర్ణ బాల పాత్ర లక్షలాది తెలుగు హృదయాలలో స్థానం సంపాదించుకుంది. తెలుగు బాలబాలికలు ఎందరికో వారి తల్లిదండ్రులు బుజ్జాయి, డుంబు అని పేరు పెట్టుకున్నారు. సుప్రసిద్ధ దినపత్రిక ‘ఆంధ్రజ్యోతి’కి రాజకీయ కార్టూన్లను ఇచ్చేవారు. ఆసేతుహిమాచలం ఆయనకు పేరు ప్రతిష్ఠలు తీసుకొచ్చిన పుస్తకం ‘కంప్లీట్ పంచతంత్ర’. ఆ నాటి ప్రముఖ ఆంగ్ల వార పత్రిక ‘ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా’లో సీరియల్‌గా ప్రచురితమై అఖిల భారతంలోనూ ఆబాలగోపాలం హృదయాలను చూరగొన్నది. ఆ పత్రికలో భారతీయ కళాకారుడు ఒకరికి అటువంటి గౌరవం దక్కడం అదే మొదటిసారి. నక్కలు, సింహాలు, కాకులు, తోడేళ్లు అచ్చమైన భారతీయతతో అందరినీ అలరించాయి. ‘పంచతంత్ర’ ప్రచురితమవుతున్నప్పుడే ఇండియా బుక్ హౌస్ యజమాని మిర్చందాని మా నాన్నగారిని ఆహ్వానించారు. హైదరాబాద్‌లోని ఐబిహెచ్ కార్యాలయంలో ఆయనతో మా నాన్న సమావేశమయ్యారు. ‘మీ ‘పంచతంత్ర’ ను చూస్తున్నాం. అటువంటి పుస్తకాలను ప్రచురించాలని నిర్ణయించుకున్నాం. మీరు మాకు అటువంటి కామిక్స్‌ను ఇవ్వాలని’ మిర్చందాని కోరారు. అయితే ‘పంచతంత్ర’ను ఇంకా నాలుగు భాగాలు చిత్రించవలసి ఉన్నందున ఆ ఆహ్వానాన్ని మా నాన్న మర్యాదపూర్వకంగా తిరస్కరించారు. ఆ తరువాత కొద్ది సంవత్సరాలకు అదే ప్రచురణ సంస్థ ‘అమర్ చిత్రకథ’ ప్రారంభించింది.


నేనూ బాలల సాహిత్య చిత్రకారుడిని కావాలనుకుంటున్నానని మా నాన్నతో ఒకసారి అన్నాను. అప్పుడు ఆయన మూడు విషయాలు చెప్పారు. ఒకటి- బాలల సాహిత్యానికి బొమ్మలు వేయడంలో ముఖ్యమైన విషయం వ్యక్తీకరణ; రెండు- చిత్రిస్తున్న రేఖ సరిగా రానప్పటికీ ఎలాంటి సంకోచం లేకుండా చిత్రించాలి; మూడు- ఒక చిత్రకారుడుగా కావాలనే కోరికను విడనాడకపోతే బడితె పూజ చేస్తాను! బుజ్జాయి (దేవులపల్లి సుబ్బరాయ శాస్త్రి) స్వయంశిక్షణతో ఎదిగిన కళాకారుడు, ఇలస్ట్రేటర్, కామిక్ స్ట్రిప్ ఆర్టిస్ట్, రచయిత. జానపదాలు, అపరాధపరిశోధనలు, పురాణగాథలు, జీవితచరిత్రలు,  రాజకీయాలు... ఇతి వృత్తాలుగా వందలాది కామిక్స్‌ను సృష్టించిన ప్రతిభామూర్తి. గత ఆరు దశాబ్దాలుగా అనేక ఆంగ్ల పత్రికలలోనూ, వివిధ భారతీయ భాషా పత్రికలలోనూ ఆయన కామిక్స్ ప్రచురితమయ్యాయి. అంతగా సుప్రసిద్ధం కాని ఆయన సృజనలలో కృష్ణశాస్త్రి దేవులపల్లి ఒకరు.

కృష్ణశాస్త్రి దేవులపల్లి

(వ్యాసకర్త బుజ్జాయి కుమారుడు. తన తండ్రి కృషిని వివరిస్తూ 2016లో ఇంగ్లీష్ వెబ్ పత్రిక ‘స్క్రోల్’లోఆయన రాసిన వ్యాసాన్ని సంక్షిప్త రూపంలో బుజ్జాయి స్మృతికి నివాళిగా ప్రచురిస్తున్నాం)

Updated Date - 2022-01-29T09:08:27+05:30 IST