మన టీకా ఠీవి

ABN , First Publish Date - 2021-02-28T05:53:50+05:30 IST

150ఏళ్ల కిందటే

మన టీకా ఠీవి


అప్పట్లోనే మెడికల్‌ హబ్‌

నిజాం కాలంలోనే ఆరోగ్య సంరక్షణ శాఖ

- నేడు నేషనల్‌ సైన్స్‌ డే 


హైదరాబాద్‌ సిటీ, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): 150ఏళ్ల కిందటే కొన్ని రకాల టీకాల తయారీకి హైదరాబాద్‌ కేంద్రంగా నిలిచింది. ఇవాళ నేషనల్‌ సైన్స్‌ డే. ఈ సందర్భంగా టీకా పరిశోధనల్లో మేటిగా నిలిచిన హైదరాబాద్‌ వైద్య రంగ ఠీవిని స్మరించుకుందాం. హైదరాబాద్‌ అంకురించిన దశాబ్దకాలంలోపే ఈ నేలపై ‘‘దారుల్షిఫా’’ యునాని ఆస్పత్రి పురుడుపోసుకుంది. రెండు అంతస్తుల ఆస్పత్రి భవనంలో మశూచి, క్షయ ప్రాణాంతక రోగాలకూ చికిత్స అందించేవారని చారిత్రక ఆధారాల ద్వారా వెల్లడవుతోంది. సర్‌ రొనాల్డ్‌రోస్‌ మలేరియా పారాసైట్‌ జీవితచక్రానికి చెందిన పరిశోధన సాగింది కూడా నగరంలోనే. అప్పట్లోనే హైదరాబాద్‌ మెడికల్‌ హబ్‌గా నెలకొందనడానికి ఉదాహరణలెన్నో.  శతాబ్దకాలంలో నగరాన్ని చిగురుటాకులా వణికించిన ప్రాణాంతక వ్యాధులెన్నో. అందులో ప్లేగు, కలరా ప్రధానమైనవి. 1911లో కలరా మహమ్మారి సుమారు ఐదు వేలమందిని పొట్టనపెట్టుకుంది. అదే ఏడాది ప్లేగుతో 15వేలమంది నగరవాసులు కన్నుమూశారు.  


ఆరోగ్యశాఖ తొలినాళ్లలో...

తొలి సాలార్‌జంగ్‌ సంస్కరణల్లో భాగంగా నిజాం రాజ్యంలో ఆరోగ్య శాఖను నెలకొల్పి, తద్వారా ప్రజా ఆరోగ్య సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారు. అందుకు నారాయణగూడలోని ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటీవ్‌ మెడిసిన్‌ (ఐపీఎం) కార్యాలయమే నిదర్శనం. ఆరో నిజాం మీర్‌ మహబూబ్‌ అలీఖాన్‌ ఏలికలో మొదటి సాలార్‌జంగ్‌ మీర్‌ తురాబ్‌ అలీఖాన్‌ పర్యవేక్షణలో 1868లో నిజాం ఆరోగ్య సంరక్షణశాఖ కార్యాలయం ప్రారంభమైంది. అదే ప్రస్తుతం నారాయణగూడలోని ఐపీఎం భవనం. అదే భవనం కేంద్రంగా 1870లో ప్లేగు నివారణా శాఖ సేవలు మొదలయ్యాయి. తద్వారా ప్లేగు నివారణా చర్యలు తీసుకోవడంతో పాటు టీకాల పంపిణీ తదితర కార్యక్రమాలు నిర్వహించారు. 1904లో సెంట్రల్‌ పబ్లిక్‌ హెల్త్‌ ల్యాబరేటరీస్‌ ఆధ్వర్యంలో ఆహారం, తాగునీరు నాణ్యతా పరిశీలన శాలను నెలకొల్పారు. ఆరేళ్లకు అదే ఆవరణలో మశూచి(స్మాల్‌పాక్స్‌) టీకా తయారీ కేంద్రం మొదలైంది. ప్లేగు, మశూచి వంటి ప్రాణాంతక వ్యాధులపై పరిశోధనలు, వ్యాక్సిన్‌ తయారీ తదితర కార్యకలాపాలకు ఆలవాలమైన నిజాం ఆరోగ్యసంక్షేమశాఖ ప్రాంగణానికి కెమికల్‌ ఎగ్జామినర్‌ కార్యాలయాన్ని తరలించారు. దాంతో నారాయణగూడలోని నిజాం హెల్త్‌ డిపార్టుమెంట్‌లో అంటువ్యాధులపై పరిశోధనలు ఊపందుకున్నాయి.  


కలరా, టైఫాయిడ్‌ లకూ...

నిజాం నెలకొల్పిన ఆరోగ్య సంక్షేమశాఖలో మొదట రొనాల్డ్‌రోస్‌ వంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన శాస్త్రవేత్తలూ సేవలందించిన సంగతి తెలిసిందే. కలరా, టైఫాయిడ్‌ వ్యాధుల టీకాల తయారీ ఈ నేలపై 1941లో మొదలైంది. అప్పటికి నిజాం వ్యాక్సిన్‌ డిపార్టుమెంట్‌గా పేరు పొందిన ఆ కేంద్రం, 1949లో సెంట్రల్‌ ల్యాబరేటరీస్‌గా మారింది. కొంతకాలానికి ‘ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటీవ్‌ మెడిసిన్‌’గా గుర్తింపు పొందింది. ఆ సంస్థ తొలి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్‌ వైఎస్‌ నారాయణ రావు తెలుగు నేలపై నెలకొన్న ఐపీఎం కేంద్రాన్ని వ్యాధి నివారణా ఔషధాల పరిశోధనలో ప్రఖ్యాతి గాంచిన గుయిండిలోని కింగ్‌ ఇనిస్టిట్యూట్‌కు ఒక నమూనాగా తీర్చిదిద్దారు. తర్వాత రాబిస్‌ నివారణా టీకా, టీటీ ఇంజక్షన్‌ ల తయారీ కేంద్రంగానూ ఐపీఎం కేంద్రం వర్ధిల్లింది. 

 

Updated Date - 2021-02-28T05:53:50+05:30 IST