సశాస్త్రీయ సనాతనం!

Published: Thu, 27 Jan 2022 00:29:07 ISTfb-iconwhatsapp-icontwitter-icon
సశాస్త్రీయ సనాతనం!

హిందూసాంప్రదాయ విశిష్టత ఏమిటంటే– దానికి ఆరంభం లేదు, అంతం లేదు, ఒక ప్రవక్త లేడు, ఒక పుస్తకంపై ఆధారపడి దాని ప్రయాణం సాగదు. సనాతన ధర్మం అనేది శాస్త్రంలో శాస్త్రీయతను చాటిచెప్పే ఏకైక సంప్రదాయం. ఏ బంధాలు, కఠినమైన బంధనాలు లేకుండా వేల సంవత్సరాలు అనేక దాడులను తట్టుకొని నిలదొక్కుకొని, రక్తమాంసాలతో నిత్యం తర్పణం చేసుకునే ప్రపంచానికి ఒక లైట్ హౌసుగా ఉన్నది హిందుత్వం, హిందూ సంప్రదాయం.


అణువు, పరమాణువు, ఆత్మ, పరమాత్మ చతుర్గుణ వేదం, అదే వేదాంతం. సృష్టిలోని ప్రతి ప్రాణి అణు పరమాణు సముదాయం. ఉదాహరణకు మనిషి కానీ, ఏ ఇతర ప్రాణి కానీ పంచభూత సమ్మేళనం–అంటే పృథ్వి, ఆకాశం, వాయువు, అగ్ని, జలాల సముదాయం. అంటే ఘన, ద్రవ, వాయువులు, వాటి మధ్య స్పందన వలన అగ్ని, వీటన్నింటి మధ్యలో ఉన్న సూక్ష్మ అనంతాన్ని ఆకాశంగా మనం భావించవచ్చు. ఇంకా సూక్ష్మాతి సూక్ష్మమైన అంశానికి వెళితే– ప్రతి మనిషి ప్రధానంగా 11 ధాతువుల సమ్మేళనం. మనిషి శరీరంలో 90శాతం బాడీ మాస్ ఆక్సిజన్, కార్బన్, హైడ్రోజన్, నైట్రోజన్, కాల్షియమ్, ఫాస్ఫరస్‌తో నిండి ఉంటుంది. మరో 0.85శాతం పొటాషియం, సల్ఫర్, సోడియం, క్లోరిన్, మెగ్నీషియం, మొత్తంగా 60 ధాతువులు ఉంటాయి. మన చుట్టూ ఉన్న ప్రకృతి, అంతరిక్షంలో ఉన్న వందల కోట్ల గ్రహాలు, నక్షత్రాలు కూడా వివిధ ఖనిజ ధాతు సమ్మేళనమే. వాటి మధ్యలో ఉండే ఆకాశం అతి తక్కువ ఖనిజ ధాతు సమ్మేళనంతో, ప్రధానంగా హైడ్రోజన్, హీలియం, ప్లాస్మాతో నిండి డార్క్ ఎనర్జీతో ఉంటుంది. దీన్నిబట్టి భౌతికంగా తీసుకుంటే మనం ప్రకృతిని పరమాత్మగా భావిస్తే, అనంత విశ్వాన్ని విరాట్పురుషుడిగా భావిస్తే జీవాత్మ గాని (ప్రాణి) పరమాత్మ గాని (ప్రకృతి) అంతా అణు, పరమాణు ధాతు సమ్మేళనం అని అర్థం అవుతుంది.


మరణం తర్వాత జరిగే భౌతిక పరిణామాలను చూద్దాం. శాస్త్ర ప్రకారం వాయువు స్తంభించినప్పుడు, శరీరంలో అగ్ని (ప్రాణం) ఆగిపోతుంది. జలం ఆవిరైపోతుంది. ఆకాశం కుదించుకుపోతుంది. మిగిలిన పృథ్వి (అస్థికలు, భస్మం) మళ్లీ తిరిగి ప్రకృతిలో కలుస్తాయి. దహనం చేసిన తర్వాత ఆక్సిజన్, నైట్రోజన్, కార్బన్ గాలిలో కలుస్తాయి. ఫాస్ఫరస్ అగ్నికి దోహదపడుతుంది. కాల్షియమ్ అంటే (అస్థికలు లేదా చితి భస్మం) రూపంలో మిగిలి ఉంటుంది. అంటే జీవిలో ఉన్న అణు పరమాణు ధాతు సమ్మేళనం మొత్తం ప్రకృతి ధాతుసమ్మేళంలో కలుస్తుంది. ప్రకృతికి ప్రతిబింబం అయిన జీవి మళ్లీ ప్రకృతిలో కలుస్తాడు. అది మనిషి కావొచ్చు, పక్షి కావొచ్చు, పశువు కావొచ్చు.


ఆత్మ శాశ్వతమా? అణువు శాశ్వతమా? అన్న ప్రశ్న దగ్గరకు వస్తే– మన శాస్త్రాలు ఆత్మ శాశ్వతము, శరీరం తాత్కాలికం అని బోధిస్తాయి. ప్రతి వ్యక్తికీ తన అంతరాత్మనే ఆత్మ. ఆ అంతరాత్మ అణు పరమాణు సముదాయమైన శరీరం నుంచి వచ్చే దైవిక భావన. ఎందుకంటే ప్రకృతి నుంచి వచ్చిన ప్రాణిలో మేధోసంపత్తి నుంచి అంతరాత్మ, ఆత్మ ఉద్భవిస్తాయి. శరీరం విచ్ఛిన్నమైన తర్వాత భౌతిక అణు పరమాణు సముదాయం పరమాత్మకు ప్రతిరూపమైన ప్రకృతిలో విలీనం అయినప్పుడు, ఆత్మ కూడా పరమాత్మలో విలీనం కాకతప్పదు. అంతేకాని చనిపోయిన ప్రతి ప్రాణి ఆత్మ ఆకాశంలో విహార యాత్ర చేయదు, పరమాత్మ అనే సముద్రంలో ఇమిడిపోతుంది. అణువు శాశ్వతమే, ఆత్మ శాశ్వతమే అవి కేవలం పరమాత్మలో భాగమే. ఆత్మకు, పరమాత్మకు ఉన్న సంబంధం సముద్రానికి నీటి బిందువుకి ఉన్న సంబంధం. ఆత్మ నీటి బిందువు, కోట్ల బిందువుల సమ్మేళనమే పరమాత్మ అనే సముద్రం. నీటి బిందువు లేకుంటే సముద్రం లేదు, సముద్రం లేకుంటే నీటి బిందువు లేదు.


పరమాత్మ ఎవరు? దేవుడు ఎవరు? ప్రాణి ఎవరు? 

ఋగ్వేదంలోని సూక్తాలు, భగవద్గీత దేవుడు గురించి వివరంగా చెబుతాయి. పరమాత్మకు పుట్టక లేదు, మరణం లేదు, ఆది లేదు, అంతం లేదు, కాలం లేదు, దేహం లేదు. నీ జ్ఞానాన్ని బట్టి దేవుడి రూపం ఊహించుకోవచ్చు. యజుర్వేదంలో ఒక శ్లోకం: ‘నా తస్య ప్రతిమ అస్తి, యస్య నమ మహద్యశ్య’ అని చెబుతుంది. ‘పరమాత్మకు ఒక నిర్దిష్టమైన రూపం ఉండదు. వారి రూపం చూపలేనంత మహాశక్తివంతం’.


మనిషి తన ఆసక్తిని బట్టి, మేధో సామర్థ్యాన్ని బట్టి దైవత్వం వైపు అనేక మార్గాలను ఎంచుకోవచ్చు. ప్రధానంగా మూడు మార్గాలు ఉన్నాయి: ఒకటి కర్మ యోగ, రెండోది భక్తి యోగ, మూడోది జ్ఞాన యోగ. కర్మ యోగి తన కర్తవ్యాన్ని బాధ్యతాయుతంగా నిర్వహించి మోక్ష ప్రాప్తి పొందుతాడు. భక్తి యోగి భగవంతుడి ఎడల చిత్తశుద్ధితో ప్రార్థించి ప్రసన్నం చేసుకుంటాడు. జ్ఞాన యోగం అతి క్లిష్టమైనది. ఈ జ్ఞాన మార్గాన్ని ఎంచుకున్నవాడు పరమాత్ముడిలో భాగమవుతాడు. జీవాత్మకు, పరమాత్మకు మధ్య వ్యత్యాసాన్ని అధిగమిస్తాడు. కుల మత వర్గ విభేదాలను వదలి, పరమాత్ముడు ఏకం అని గ్రహిస్తాడు. భయం, ఈర్ష్య, కోపం, తపన, అహం అన్ని మాయం అవుతాయి. స్థితప్రజ్ఞుడవుతాడు.


భక్తి మార్గాలు అనేకం ఉన్నాయి. ఎందరో జ్ఞానులు తమకు అర్థమైనంతవరకు ‘నా దారే రహదారి’ అని రూట్ మ్యాపులు వేశారు. అద్వైతం ప్రకారం– బ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే. ఆత్మ, పరమాత్మ ఒక్కటే. అవిద్య (అజ్ఞానం) వలన అవి రెండుగా కనిపిస్తాయి. జ్ఞానంతో వాటి మధ్య వ్యత్యాసం తొలిగి మోక్ష ప్రాప్తి పొందుతారు.


మాధవాచార్య బోధించిన ద్వైత వేదాంతం ప్రకారం– జీవాత్మ, పరమాత్మ వేరు. ఆత్మ, అణువు వేరు. పరమాత్మ, ప్రకృతి వేరు. విష్ణువు ఒక్కడే దేవుడు. ఆ దేవుడుకి ఒక రూపం ఉంటుంది. ఆ దేవుడే మొత్తం విశ్వాన్ని, జీవరాశులను నడిపిస్తాడు. ఆత్మ ఎప్పుడు పరమాత్మలో కలవదు. అంతిమంగా రాజు రాజ్యాన్ని ఏలినట్టు శ్రీ విష్ణువు ఒక్కడే లోకాలను ఏలుతాడు. ఇది వైష్ణవులు నమ్మే సిద్ధాంతం. వేదాలకు, ఉపనిషత్తులకు, భగవద్గీత స్ఫూర్తికి విరుద్ధం.


రామానుజాచార్యులవారు అద్వైత సిద్ధాంతానికి మెరుగులు దిద్ది విశిష్ట అద్వైత వేదాంతాన్ని బోధించారు. ఇందులో విశ్వరూపుడు, విశ్వకర్మ, విశ్వ నిర్మాత అయిన ఈశ్వరుడు (నారాయణుడు) జీవాత్మ అజీవాత్మలకు సృష్టికర్త మాత్రమే కాదు, వాటిలో నివసిస్తాడు కూడా. ఈశ్వరుడు పరిపూర్ణమైన సర్వజ్ఞుడు, సర్వేశ్వరుడు, నిరాకారుడు, స్వతంత్రుడు, విశ్వసృష్టికర్త, పరిపాలకుడు, వినాశకుడు. ఈశ్వర సృష్టిలోని ప్రతి వస్తువులో అంతర్లీనంగా, అతీతంగా ఉంటాడు. అతను కర్మ ఫల ప్రదాత.


శాస్త్రాన్ని, ప్రస్తుత శాస్త్రీయతను క్రోడీకరిస్తే అణువు – ఆత్మ, ప్రకృతి – పరమాత్మ అస్తిత్వాలు మనకు కనిపిస్తాయి. అణువు భౌతిక పదార్థానికి మూలం, అది జీవం లేదా అజీవం కావొచ్చు. ప్రకృతిలో ఉన్న పదార్థాలు– భూమి, వాయువు, జలం, ఆకాశం, గ్రహాలు... ఇలా అన్నిటికి మూలం అణువు. సాధారణంగా మనం మనుషులనే జీవాత్మ అంటాం. కానీ సకల ప్రాణులలోనూ జీవాత్మ ఉంటుంది. చెట్టు నుంచి గుట్ట, గ్రహం నుంచి గ్రహాంతరం వరకు జీవం అంతర్లీనమై ఉంటుంది. సూక్ష్మంగా ఆలోచిస్తే ప్రతి అణువు నిరంతర ప్రయాణం చేసే శక్తి వాటిలోనే ఉంటుంది. సైన్స్ ప్రకారం ఆ శక్తి మూలాల్ని ప్రొటాన్స్, న్యుట్రాన్స్, ఎలెక్ట్రాన్స్ అంటారు. సూర్యుడి చుట్టూ భూమి తిరిగినట్టు, మనిషికి ఉచ్ఛ్వాస నిశ్వాసలున్నట్లు అనునిత్యం భ్రమణం జరుగుతూనే ఉంటుంది. ఇవన్నీ ప్రకృతిలో, విశ్వంలో భాగమే. ఇక ఆత్మ, పరమాత్మ భౌతికం కాదు, దైవికం. కేవలం అనుభూతి ద్వారానే దర్శించవచ్చు. ఆ అనుభూతి కర్మయోగ, భక్తియోగ లేదా అత్యున్నతంగా జ్ఞానయోగ ద్వారా పొందవచ్చు. మన వేదాలు, ఉపనిషత్తు, భగవద్గీతల్లో బోధించిన నీవు, నేను, జీవాత్మ, పరమాత్మ... అంత మాయ, అది నా సృష్టినే. దేహం విడి ఇంకో రూపం తీసుకుంటుంది, కానీ నశించదు కృశించదు. అంటే ఆ విశ్వంలో అణు సముదాయం స్థిరంగా ఉంటుంది. సైన్స్ ప్రకారం విశ్వజననం బిగ్ బాంగ్ థియరీతో జరిగినట్టు– వేదాలలో అంధకారం నుంచి ఒక బిందువు (విరాట పురుషుడు) తనకు తాను దహించుకుపోయి విస్ఫోటించి తద్వారా గ్రహాలు, నక్షత్రాలు, కృష్ణబిలాలు, అంతరిక్షం, భూమి, సూర్యుడు, సకల జీవరాశులు ఉద్భవించాయి అని బోధిస్తాయి. భౌతికాన్ని అవగాహన ద్వారా అర్థం చేసుకోవచ్చు. దైవికాన్ని కేవలం అనుభూతి ద్వారానే దర్శించుకోవచ్చు. ఇది నాకు బోధపడ్డ విధానం. 


పిల్లవాడు చందమామ కావాలని మారాం చేస్తే తల్లి అద్దంలో చందమామను చూపించి పిల్లవాడి కోరిక తీరుస్తుంది. పిల్లవాడు నిజంగా చందమామ అద్దంలో ఉన్నదని భావిస్తే అది అజ్ఞానం, తల్లిది జ్ఞానం. అలానే ఎంతో శాస్త్రీయబద్ధమైన వేదాలకు, ఉపనిషత్తులకు కొందరు సంకుచిత భావాలను ఆపాదిస్తున్నారు. విశ్వవ్యాప్తి చెందాల్సిన హిందుత్వ శాస్త్రీయ సంప్రదాయం గొప్పదనాన్ని రోజు రోజుకు కుదించే ప్రయత్నాలు చేస్తున్నారు. వేదాలు రాసిన వేద వ్యాసుడు ఒక మత్స్యగ్రంథి సత్యవతి కొడుకు, రామాయణం రాసిన వాల్మీకి బోయవాడు, భగవద్గీతను బోధించిన కృష్ణుడు గొల్లవాడు, మహాభారతాన్ని కళ్ళకు కట్టినట్లు చెప్పిన విదురుడు దాసి కొడుకు. వాటిని చదివి వినిపించేవారు మేమే గొప్ప అనుకుంటే, వాటిని రాసినవారు, బోధించినవారు ఏమనుకోవాలి. వసుధైక కుటుంబం, సర్వేజనా సుఖినోభవంతు అనే మూల హిందూ సంప్రదాయాన్ని ప్రచారం చేయటం మాని, మేము–మీరు, నేను–నువ్వు అనే ధార్మిక విరుద్ధ ఆలోచనలలో చిక్కుకుపోయినవారు హిందుత్వ సంప్రదాయానికి విరోధులు, అధార్మికులు.

డాక్టర్ బూర నర్సయ్య గౌడ్

మాజీ ఎంపీ

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.