ప్రచారాలకు తెర!

ABN , First Publish Date - 2021-11-14T07:04:11+05:30 IST

కుప్పం మున్సిపల్‌ ఎన్నికల ప్రచారానికి శనివారం సాయంత్రం 5 గంటలకు అధికారికంగా తెర పడింది.

ప్రచారాలకు తెర!

నివురుగప్పిన నిప్పులా కుప్పం


కుప్పం, నవంబరు 13: కుప్పం మున్సిపల్‌ ఎన్నికల ప్రచారానికి శనివారం సాయంత్రం 5 గంటలకు అధికారికంగా తెర పడింది. సోమవారం పోలింగు జరుగుతుంది.ప్రతిపక్షనేత ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంతో అధికార వైసీపీ అన్ని శక్తులనూ కుప్పంలో మొహరించింది. ప్రలోభాలు, బెదిరింపులు, దొంగ ఓట్ల ప్రణాళికలు ఇక అమలులోకి వస్తాయని భావిస్తున్నారు. కుప్పం మున్సిపల్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడిన నాటినుంచే అధికార, ప్రతిపక్షాలు రెండూ పోటాపోటీ ప్రచారాలు సాగించాయి.  ఈనెల 29, 30 తేదీల్లో టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పంలో పర్యటించారు. ఆయన ప్రచారానికి జనంనుంచి విశేష స్పందన లభించింది. ఆయన రోడ్‌ షోలకు, బహిరంగ సభకు భారీగా తరలివచ్చి, చంద్రన్నమీద తరగని అభిమానాన్ని కుప్పం ప్రజలు చాటుకున్నారు. ఆ తర్వాత రెండు రోజులకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆర్టీసీ బస్టాండు వద్ద బహిరంగ సభ నిర్వహించడంతో వైసీపీ ప్రచారం ప్రారంభమైంది. పెద్దిరెడ్డి పదిరోజులుగా ఇక్కడే మకాం వేసి తెర వెనుక వ్యూహాలను రచిస్తూనే, తన శైలికి విరుద్ధంగా ఇంటింటి ప్రచారాలు సాగించారు. మరోవైపు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌, ఈనెల 12వ తేదీన ఉదయంనుంచి రాత్రి 11 గంటలదాకా వార్డుల్లో పర్యటించి స్థానికులను పలకరించి ప్రచారం ఉధృతంగా సాగించారు. కుప్పం ప్రజలు నీరాజనాలు పట్టారు. ఈ స్పందన చూసిన అధికార పార్టీ శ్రేణులు లక్ష్మీపురం వద్ద ఆయన ప్రచారాన్ని అడ్డుకోవడానికి విఫల ప్రయత్నం చేసి భంగపడ్డారు.


ఎన్నడూ లేనంత ఉద్రిక్తత

అధికార, ప్రతిపక్షాలు పోటాపోటీ ప్రచారాలు సాగిస్తుండడంతో అక్కడక్కడా, అప్పుడప్పుడూ ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. టీడీపీ నేతల ధర్నా, కేసులు, అరెస్టులు కుప్పం ప్రజలను ఆందోళనకు గురిచేశాయి. అలాగే చంద్రబాబు, లోకేష్‌ పర్యటనలను అధికార పార్టీ కార్యకర్తలు అడ్డుకోవడానికి ప్రయత్నించిన సందర్భాలు సైతం ఉద్రిక్తమయ్యాయి. ఇతర ప్రాంతాల నేతల్లో చాలామంది శనివారం సాయంత్రానికి కుప్పం వదిలిపెట్టి వెళ్లిపోయారు. మంత్రి పెద్దిరెడ్డి సైతం ఉదయం పది గంటలకే ఇక్కడ ప్రచారాలు ముగించి బయలుదేరి వెళ్లారు. ఇప్పుడు కుప్పంలో పరిస్థితి నివురు గప్పిన నిప్పులా ఉంది. 

Updated Date - 2021-11-14T07:04:11+05:30 IST