ఉపాధి కూలీల వెతలు

ABN , First Publish Date - 2022-06-30T06:13:27+05:30 IST

జిల్లాలో ఉపాధి కూలీల వేతన బకాయిలు పేరుకుపోతున్నాయి. సుమారు ఆరు వారాల నుంచి డబ్బులు జమ కాకపోవడంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయ పనులు ఇంకా మొదలు కాకపోవడంతో ఉపాధి పనులపై ఆధారపడిన తాము కుటుంబ పోషణ కోసం అప్పులు చేయాల్సి వస్తున్నదని కూలీలు వాపోతున్నారు.

ఉపాధి కూలీల వెతలు
చెరువులో పూడికతీత పనులు చేస్తున్న ఉపాధి కూలీలు (ఫైల్‌ ఫొటో)

45 రోజుల నుంచి అందని కూలి డబ్బులు

జిల్లాలో రూ.125 కోట్ల వరకు బకాయిలు

ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న కూలీలు


(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)

జిల్లాలో ఉపాధి కూలీల వేతన బకాయిలు పేరుకుపోతున్నాయి. సుమారు  ఆరు వారాల నుంచి డబ్బులు జమ కాకపోవడంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయ పనులు ఇంకా మొదలు కాకపోవడంతో ఉపాధి పనులపై ఆధారపడిన తాము కుటుంబ పోషణ కోసం అప్పులు చేయాల్సి వస్తున్నదని కూలీలు వాపోతున్నారు. 

అనకాపల్లి జిల్లాలో 3,51,916 కుటుంబాలకు ఉపాధి హామీ పథకం జాబ్‌ కార్డులు వున్నాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 2.34 లక్షల కుటుంబాలకు సుమారు రెండున్నర కోట్ల పనిదినాలు కల్పించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఏప్రిల్‌ ఒకటి నుంచి మే నెల వరకు జిల్లాలోని వివిధ మండలాల్లో రూ.128.59 కోట్ల విలువైన పనులు చేశారు. మే నెల 14వ తేదీ వరకు రూ.42.68 కోట్లు ఉపాధి కూలీల బ్యాంకుల్లో జమ అయ్యాయి. ఇంకా రూ.85.91 కోట్లు బకాయిలు వున్నాయి. జూన్‌ నెలలో చేసిన పనులకు ఇంచుమించు రూ.40 కోట్లవరకు అందాల్సి వుంది. మొత్తం మీద రూ.125 కోట్ల వరకు బకాయిలు వుండొచ్చని అధికారులు అంచనాగా చెబుతున్నారు. ఖరీఫ్‌ వ్యవసాయ పనులు ఇంకా ప్రారంభం కాకపోవడంతో కూలీలు ఉపాధి వేతనాలపైనే ఆధారపడుతున్నారు. సుమారు 45 రోజుల నుంచి ఉపాధి వేతనాలు అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కుటుంబ పోషణ కోసం అధిక వడ్డీలకు అప్పులు చేయాల్సి వస్తున్నదని వాపోతున్నారు. 

ఇదిలావుండగా నెలన్నర నుంచి వేతనాలు అందకపోవడంతో కొంతమంది కూలీలు ఉపాధి పనులకు వెళ్లడంలేదు. ఏప్రిల్‌, మే నెలల్లో రోజూ సగటున లక్ష మంది వరకు పనుల్లోకి వెళ్లేవారు. ప్రస్తుతం 60 వేలమంది మాత్రమే ఉపాధి పనులు చేస్తున్నారు. కాగా కేంద్ర మార్గదర్శకాల ప్రకారం రోజూ ఒక్కో కూలీకి రూ.257 వేతనం లభించేలా పనులు చేయించాలి. కానీ జిల్లాలో  రోజువారీ సగటు వేతనం రూ.213 మాత్రమే. 

15 రోజుల్లో డబ్బులు చెల్లించకపోతే పరిహారం ఇవ్వాలి

ఉపాధి కూలీలకు చెల్లింపులు జరిపే ఫండ్‌ ట్రాన్సఫర్‌ ఆర్డర్‌(ఎఫ్‌టీవో) ప్రక్రియను రెండు దశల్లో చేపడతారు. మొదటి దశలో ఎఫ్‌టీవోలను జనరేట్‌ చేసి కేంద్రానికి ఎనిమిది రోజుల్లో రాష్ట్రం పంపాలి. ఆ తర్వాత కేంద్రం వేతనాలు జమచేసేందుకు మరో వారం రోజులు సమయం తీసుకోవాలి. మొత్తంగా 15 రోజుల్లో మస్టర్‌ ప్రక్రియ పూర్తికావాలి. మస్టర్లు జనరేట్‌ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నది. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం కూడా చెల్లింపుల్లో జాప్యం చేస్తున్నది. అయితే ఆలస్యంగా వేతనాలు చెల్లించినందుకుగాను.. ప్రతి రోజు ఇవ్వాల్సిన వేతనంలో 0.05 శాతం పరిహారంగా చెల్లించాలి. ఈ లెక్కన జిల్లాలో ఉపాధి కూలీలకు భారీగానే పరిహారం  అందాలి.

వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఉపాధి కూలీలకు సకాలంలో చెల్లింపులు జరగడం లేదని రైతు కూలీ సంఘ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ ఏడాది కూలీల వేతనాలు భారీగా బకాయిలు వుండడంపై జిల్లా నీటి యాజమాన్య సంస్థ(డ్వామా) అధికారులను వివరణ కోరగా.. వేతనాల పెండింగ్‌ తమ పరిధిలోనిది కాదని బదులిస్తున్నారు. డ్వామా పీడీ సందీప్‌ను వివరణ కోరగా... ఉపాధి కూలీల బకాయిలు పేరుకుపోయిన విషయం వాస్తవమేనని, ఈ వారంలో బకాయిలు చెల్లించే అవకాశం ఉందని తెలిపారు. 


Updated Date - 2022-06-30T06:13:27+05:30 IST