కొత్త దారుల వెతుకులాట

Jun 12 2021 @ 00:37AM

ప్రస్తుత బాధాకర రాజకీయ పరిస్థితుల నుంచి బయటపడేందుకు ‘నెహ్రూవియన్’ పద్ధతులకు వెళ్ళడం సాధ్యమూ కాదు, వాంఛనీయమూ కాదు. ఆత్మ విశ్వాసపూరిత జాతీయవాదం, ధార్మిక విలువలతో కూడిన లౌకికవాదం, మార్కెట్ సోషలిజం, సామాజిక న్యాయం, పర్యావరణ పరిరక్షణ, భారతీయ ఆధునికత కోసం అన్వేషణ, ప్రజాస్వామిక గణతంత్ర రాజ్యవాదం పట్ల నిబద్ధతతో కూడిన కొత్త సమతుల్య భావజాలాన్ని మనం అభివృద్ధిపరచుకోవాలి.


వర్తమాన భారతదేశానికి ఒక భావజాల సమతౌల్యత అవసరం. స్వతంత్ర భారతదేశ చరిత్రలోనే అత్యంత నిరాశామయ కాలంలో మనం ఉన్నాం. భవిష్యత్తు మీద పరిపూర్ణ విశ్వాసాన్ని కలిగించే ఒక కొత్త మధ్యే మార్గ భావజాలాన్ని ఆవిష్కరించుకోవలసి ఉంది. మన రాజ్యాంగ విలువల పట్ల ప్రజల మనఃస్థితి సంపూర్ణ సానుకూలతతో ఉండేలా ఒక భావజాల ఏకాభిప్రాయాన్ని సృష్టించవలసిన అవసరముంది. ఈ కర్తవ్య నిర్వహణ అంత సులువు కాదు, ఉత్తేజపూరితమూ కాదు. చికాకు పరిచే కార్యమది. అయితే మన ప్రజాస్వామ్యం, లేదా మన గణతంత్ర రాజ్య భవిష్యత్తు అతి, మితవాదాలకు భిన్నమైన ప్రాతిపదికలతో కూడిన భావజాలాన్ని రూపొందించుకుని అనుసరించడంపై ఆధారపడి ఉంది. అత్యవసరంగా పరిష్కరించుకోవల్సిన ప్రస్తుత మేధా, రాజకీయ సమస్యల్లో ఇది ఒకటి. 


స్వాతంత్ర్యానంతరం తొలి ఐదు దశాబ్దాల పాటు ఉదారవాద ప్రజాస్వామ్యమే మన భావజాలంగా ఉంది. జాతీయవాదం, సామ్యవాదం, లౌకికవాదం, సామాజిక న్యాయం, ఆధునికతతో సమ్మిళితమైన ఈ ఉదారవాద ప్రజాస్వామ్యం మన భావజాల సమతౌల్యతను నిర్వచించేది. కాలం గడుస్తున్న కొద్దీ ఇది బలహీనపడి క్షీణించిపోయింది. ఉదారవాద ప్రజాస్వామ్యం చౌకబారు జనరంజక రాజకీయాలకు దారితీసింది. జాతీయవాదం శుష్కనినాదంగా మిగిలిపోయింది. సామ్యవాదం లాభాల ప్రైవేటీకరణ, సమస్యల సామాజికీకరణగా పరిణమించింది. లౌకికవాదం రాజకీయ అవకాశవాదమైపోయింది. సామాజిక న్యాయం కులఆధారిత రిజర్వేషన్లకే పరిమితమయింది. ఆధునికత సాంస్కృతిక బానిసత్వానికి ఒక ముసుగు అయింది. మరి ఇటువంటి భావజాలం పట్ల ప్రజలు విముఖులు కావడంలో ఆశ్చర్యమేముంది? 


పాతిక సంవత్సరాలుగా ప్రజలు మృదు నిరంకుశాధికారతత్వం, కలహశీల, సంకుచిత జాతీయవాదం, మార్కెట్ ఆరాధన, అధిక సంఖ్యాకవాద ధోరణులు, కుల దురభిమానాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ భావజాల వైఖరులు మన రాజ్యాంగ విలువలకు పూర్తిగా విరుద్ధమైనవి. సామాజిక అంతరాలు, ఆర్థిక అసమానతలు పెచ్చరిల్లిపోయేందుకు దోహదం చేస్తున్న ఈ విషపూరిత భావజాలం గురించి ప్రతి భారతీయుడూ కలవరపడి తీరాలి. సమాజంలో ఎటువంటి సుస్థిరతకు దోహదం చేయని ఈ భావజాలం మన గణతంత్ర రాజ్య నిర్మాతల స్వప్నాలు, ఆశయాలు, సంకల్పాలకు పూర్తిగా భిన్నమైన భారత్‌ను రూపొందిస్తుంది. అదే జరిగిన పక్షంలో దేశంలో సమైక్యత, సమగ్రత కొరవడుతాయనడంలో ఎటువంటి సందేహం లేదు. 


నిజమే, మన ప్రస్తుత రాజకీయ పరిస్థితులు చాలా బాధాకరంగా ఉన్నాయి. అయితే ఈ దుస్థితి నుంచి బయటపడేందుకు మనం తొలినాటి ‘నెహ్రూవియన్’ భావజాల ఏకాభిప్రాయానికి వెళ్లలేము. వామపక్ష-ఉదారవాద- ప్రగతిశీల రాజకీయాలు నెహ్రూవియన్ పద్ధతులు పోవాలని కోరుతున్నాయి. అయితే అది సాధ్యమూ కాదు, వాంఛనీయమూ కాదు. ఎందుకంటే పాత భావజాల ఏకాభిప్రాయం భ్రష్టమయింది. పర్యావరణ సమస్యలకు అది ప్రాధాన్యమివ్వలేదు. కులం, జెండర్ అసమానతలను, ప్రజల సాంస్కృతిక, మతపరమైన మనోభావాలను పట్టించుకోలేదు. ఈ పరిస్థితుల్లో కొత్త భావజాల సమైక్యతను సృష్టించుకోవడం మినహా మనకు మరో ప్రత్యామ్నాయం లేదు. కొత్త భావజాల సమతౌల్యతలో ఉండి తీరాల్సిన ఏడు అంశాల గురించి విశదంగా చూద్దాం. 


కొత్త సైద్ధాంతిక సమతౌల్యత నిజమైన, ఆత్మ విశ్వాసపూరితమైన జాతీయవాదం నుంచి ప్రభవించి తీరాలి. ప్రస్తుతం ప్రజల మనస్సులను బలీయంగా ప్రభావితం చేస్తున్న నిస్సార, కర్కశ జాతీయవాదానికి అమూర్త అంతర్జాతీయవాదం, జాతీయవాదానంతర వాదాలు సమాధానాలు కానేకావు. యూరోపియన్ మేధావులలాగా మనం జాతీయవాదాన్ని ఉపేక్షించలేము. మన మహోన్నత జాతీయోద్యమం, స్వాతంత్ర్య పోరాట సంప్రదాయాలు, విలువల నుంచి ప్రేరణ పొందిన దేశభక్తి ప్రపూరిత జాతీయవాదాన్ని ఇప్పుడు మనం పెంపొందించుకోవాలి. భారత్‌ను గర్వకారణంగా భావిస్తూ ఆ భావనకు వాస్తవిక అర్థాన్ని సమకూర్చాలి. బాహ్యంగా, అంతర్జాతీయ సమాజంలో మనదైన ప్రముఖ స్థానాన్ని సాధించుకోవడం; అంతర్గతంగా, మన సమాజంలోని సకల వైవిధ్యాలను సమాదరించే జాతీయ సమైక్యతను నిర్మించుకోవడం ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుంది. 


రెండో అంశం– మన సాంస్కృతిక, ధార్మిక విలువలతో దృఢంగా పెనవేసుకున్న లౌకికవాదాన్ని అభివృద్ధి పరచుకోవలసిన అవసరం ఉంది. ఈ పుణ్యభూమి సంప్రదాయాలలో మూలాలు లేని లౌకికవాదం మత సంకుచితత్వాన్ని ఓడించలేదు. లౌకికవాదం గురించి పాశ్చాత్య విజ్ఞులు సాగించే చర్చలో, రాజ్యానికి మతానికి ఎటువంటి సంబంధముండకూడదనేది ఒక ప్రధాన అంశం. అయితే మనం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ప్రజల మధ్య మతపరమైన ఘర్షణలు; మత తెగల మధ్య కలహాలు. ‘సర్వ ధర్మ సంభవ్’ అన్న ఆదర్శాన్ని ఆచరించే రాజ్యవ్యవస్థ మనకు కావాలి. రాజ్యం అన్ని మతాలను సమానంగా గౌరవిస్తూ అన్ని మతాలకు సమాన దూరంలో ఉండాలి. ఏ మతసమూహం పట్ల ఎటువంటి వివక్ష చూపకూడదు. అదే సమయంలో ఏ మత సమూహంలో నైనా అణచివేత, అన్యాయాలకు వ్యతిరేకంగా నిష్పాక్షిక చర్యలు చేపట్టాలి. మత సంప్రదాయాలను ఉపేక్షించడం వల్ల లౌకిక రాజ్యవ్యవస్థను నిర్మించలేం. మన మత సంప్రదాయాలు అన్నిటితోనూ సమరీతిలో అనుబంధాన్ని నెలకొల్పుకోవాలి. 


మూడో అంశం– అట్టడుగు స్థాయి వ్యక్తి శ్రేయస్సుకు ప్రాధాన్యమిచ్చే మార్కెట్ సోషలిజాన్ని అభివృద్ధి పరచుకునేందుకు మనం కృషి చేయాలి. పెట్టుబడిదారీ వ్యవస్థలోని అసమానతలకు ఉద్యోగి స్వామ్య వ్యవస్థ ఆధ్వర్యంలోని రాజ్య సామ్యవాదం సమాధానం కానేకాదు. మార్కెట్ మన జీవితంలో ఒక అంతర్భాగం అన్న సత్యాన్ని మనం అంగీకరించి తీరాలి. మన అర్థనీతి ‘eco–norm–ics’ గా పరిణమించాలి. అంటే నైతిక విలువలు, పర్యావరణ సుస్థిరతతో ఆర్థిక హేతుబద్ధతను సమన్వయపరచాలి. సంక్షేమ విధానాల ప్రాధాన్యం మౌలిక అవసరాలయిన ఆహారం, గృహవసతి నుంచి ఉపాధి, విద్య, ఆరోగ్యభద్రతకు మారాలి.


నాలుగో అంశం సామాజిక న్యాయం. ఈ లక్ష్యసాధనకు బహుముఖ దృక్పథాన్ని అనుసరించాలి. దీనివల్ల వర్తమాన రాజకీయాలను అమితంగా ప్రభావితం చేస్తున్న అస్తిత్వ నిరాకరణ, అస్తిత్వ ఆరాట ధోరణులను అధిగమించడం సాధ్యమవుతుంది. అయితే ఇందుకు వర్తమాన భారతదేశంలోని కుల అసమానతలను అంగీకరించి, వాటి నిర్మూలనకు గతంలో కంటే మరింత చిత్తశుద్ధితో కృషిచేయవలసిన అవసరముంది. అలాగే ఇతర సామాజిక అసమానతలను–(-జెండర్, లైంగికత, వర్గం, ప్రాంతం, మతసమూహం, గ్రామీణ–పట్టణ అంతరాలు) గుర్తించి తీరాలి. ఈ సమస్యల పరిష్కారానికి రాజ్యవ్యవస్థ విధానపరంగా ప్రతిస్పందించాలి. సామాజికన్యాయ సాధనకు ప్రధాన ఉపకరణంగా పరిగణిస్తున్న కులఆధారిత రిజర్వేషన్ల విధానంలో స్వల్ప మార్పులు చేయాలి. అలాగే చట్టసభలలోను, రాజకీయ వ్యవస్థలలోనూ మహిళలు, అణగారిన వర్గాల వారికి సముచిత ప్రాతినిధ్యం కల్పించటంపై మరింత శ్రద్ధాసక్తులు చూపాలి. 


ఐదో అంశం పర్యావరణ పరిరక్షణ. ప్రతి రాజకీయ ఎజెండాలోనూ దీనికి అగ్రప్రాధాన్యం ఉండితీరాలి. అభివృద్ధి పేరిట జరుగుతున్న పర్యావరణ విధ్వంసాన్ని, ముఖ్యంగా ఆదివాసీ సమాజాల విచ్ఛిన్నతనూ ఇంకెంత మాత్రం ఉపేక్షించకూడదు. అలాగే వాతావరణ మార్పును నిరాకరించడం అవివేకమే అవుతుంది. జల్–జంగల్–-జమీన్ పై ప్రజల నియంత్రణ కోసం జరిగిన ఉద్యమాలే ప్రజా పర్యావరణవాదానికి పునాదులు వేశాయి. వ్యవసాయ విధానాలు, పద్ధతులలో కూడా మార్పులు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 


ఆరో అంశం– మన సాంస్కృతిక విధానాలు, రాజకీయాలు భారతీయ ఆధునికతను అన్వేషించాలి. ఆ అన్వేషణే వాటికి స్ఫూర్తి కావాలి. ఆ అన్వేషణ మన స్వాతంత్ర్యోద్యమ విలువలను నిండుగా ప్రతిబింబించి తీరాలి. దీనివల్ల మనం నిస్సారమైన, అనుకరణ ప్రాయమైన ఆధునికతను త్యజించగలుగుతాము. ఇందుకు గాను మనం సమున్నత నాగరికతా వారసత్వాన్ని పునర్నిర్మించుకోవాలి. అదే సమయంలో విశాల దృక్పథంతో ప్రపంచవ్యాప్తంగా ప్రతి సమాజం నుంచి నేర్చుకోవాలి. భారతీయ భాషల సమగ్ర వికసానికి కృషి చేయాలి. పాఠశాల స్థాయి నుంచే మన జ్ఞానసంప్రదాయాలను సముచిత రీతిలో గౌరవించే విద్యావిధానాలను రూపొందించుకోవాలి. 


ఆఖరి అంశం– ప్రజాస్వామిక గణతంత్ర రాజ్యవాదానికి మనం నిబద్ధమై తీరాలి. అది ఒక లక్ష్యంగా, ఒక సాధనా మార్గంగా ఉండాలి. ప్రజాస్వామ్యమంటే రాజ్యాంగాన్ని రూపొందించుకోవడం, సంస్థల నిర్మాణం, ఎన్నికల నిర్వహణ మాత్రమే కాదనే వాస్తవాన్ని మనం గుర్తించి తీరాలి. వివేకశీలురైన, సమాన ప్రతిపత్తిగల పౌరులతో కూడిన ఒక రాజకీయ సమాజాన్ని నిర్మించుకోవడమే ప్రజాస్వామ్య పరమార్థం. రాజకీయ అధికారాల వికేంద్రీకరణ, సహజ వనరుల సమలభ్యత, విధాన నిర్ణయాలలో ప్రజలకు ప్రత్యక్ష పాత్ర కల్పించడం ద్వారా ఆ సమున్నత ప్రజాస్వామ్యాన్ని అభివృద్ధిపరచుకోవాలి. 


నిజానికి ఇవేవీ కొత్త అంశాలు కావు. అవన్నీ మన రాజ్యాంగంలో ఉన్న విలువలే. వాటిని విశదీకరించాను. ప్రజల జీవితాలతో వాటికి ప్రగాఢ సంబంధం నెలకొల్పేందుకు ప్రయత్నించాను. ఈ దృష్ట్యా ఒక కొత్త భావజాల సమతౌల్యతను సృష్టించడం కేవలం విద్యావిషయిక లేదా మేధా కర్తవ్యం కాదు అందుకు ప్రజాభిప్రాయాన్ని మౌలికంగా మార్చివేయవలసి ఉంది. ఇదొక రాజకీయ సవాల్. యోగేంద్ర యాదవ్

స్వరాజ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.