కార్యాలయాల కోసం అన్వేషణ

ABN , First Publish Date - 2022-08-15T05:27:18+05:30 IST

జిల్లాలో కొత్త మండలాల ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతోంది.

కార్యాలయాల కోసం అన్వేషణ

- కొత్త మండలాల ఏర్పాటుకు మొదలైన కసరత్తు

- ఎప్పుడైనా తుది నోటిఫికేషన్‌ వెలువడే అవకాశం

- జిల్లాలో పెరగనున్న మరో రెండు మండలాలు

జగిత్యాల, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కొత్త మండలాల ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతోంది. జిల్లాలో బీమారం, ఎండవల్లి గ్రామాల కేంద్రంగా రెండు కొత్త మండలాల ఏర్పాటుకు గత నెల 23వ తేదీన ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రెవెన్యూ గ్రామాల ప్రాతిపాదికన మండలాల పునర్విభజనకు ప్రతిపాదించారు. భీమారం, ఎండవల్లి మండలాల కోసం తాత్కాలిక, శాశ్వత అవసరాలు ఏమిటనే దానిపై పరిశీలన చేస్తున్నారు. పూర్వ మండలాల్లో ఉన్న అధికారులు, డివిజన్‌ అధికారులతో కలిసి అనధికారిక ప్రయత్నాలు మొదలయ్యాయి. ముఖ్యంగా పంచాయతీరాజ్‌ మినహా మిగితా కార్యాలయాల ఏర్పాటుకు అన్వేషణ మొదలు పెట్టింది. ఇది వరకే ఒక అభిప్రాయానికి వచ్చిన అధికార యంత్రాంగం ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందగానే సంబంధిత ప్రక్రియ పూర్తి చేయాలని యోచిస్తున్నారు. 

- అభ్యంతరాలు, వినతులు..

జిల్లాలోని మేడిపల్లి మండలంలో గల భీమారం, వెల్గటూరు మండలంలో గల ఎండపల్లి గ్రామాల కేంద్రంగా రెండు నూతన మండలాలు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సుమారు 20 రోజుల క్రితం ప్రాథమిక నోటిఫికేషన్‌ జారీ చేసింది. పలు గ్రామాలను కొత్త మండలాల్లో చేర్చుతూ ఉత్తర్వులు వెలువడ్డాయి. సంబంధిత నోటిఫికేషన్‌పై అభ్యంతరాలు, వినతిపత్రాలను స్వీకరించడానికి ప్రభుత్వం పదిహేను రోజుల గడువును విధించింది. సుమారు వారం రోజుల క్రితం వరకు అధికారులు వినతిపత్రాలను స్వీకరించారు. ఆయా మండలాల తహసీల్దార్లు, ఆర్‌డీవోలు, కలెక్టర్‌ కార్యాలయంలో వినతులను స్వీకరించారు. రెండు మండలాల్లో కలిపి సుమారు పది వరకు అభ్యంతరాలు, వినతులు దాఖలు అయినట్లు సంబంధిత అధికారులు తెలిపారు.

- మరిన్ని కొత్త మండలాల డిమాండ్‌...

జిల్లాలో రెండు నూతన మండలాలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ప్రాథమిక ఉత్తర్వులు జారీ చేయడంతో పలు ప్రాంతాల్లో మరిన్ని కొత్త మండలాల ఏర్పాటు డిమాండ్‌ తెరపైకి వచ్చాయి. జిల్లాలో మేడిపల్లి మండలం భీమారంను మండల కేంద్రంగా ప్రభుత్వం ప్రకటించడంతో అదే మండలంలోని మన్నెగూడెం వాసులు తమ గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ విస్తృతంగా ఆందోళనలు చేస్తున్నారు. అదేవిధంగా రాయికల్‌ మండలంలోని అల్లీపూర్‌ను, ఒడ్డెలింగాపూర్‌లను మండల కేంద్రాలుగా ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ వచ్చింది. మెట్‌పల్లి మండలంలోని బండలింగాపూర్‌, జగ్గసాగర్‌ గ్రామాలను సైతం మండల కేంద్రాలుగా చేయాలని ఆయా గ్రామాల ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. ఆందోళనలు నిర్వహించడం, వినతి పత్రాలను అందజేయడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 

-  ప్రభుత్వ ఆమోదముద్రకు ఎదురుచూపులు

పదిహేను రోజుల పాటు అభ్యంతరాలు, వినతిపత్రాలను స్వీకరించిన అధికారులు సంబంధిత వివరాలను తెలియజేస్తూ ప్రభుత్వానికి సంబంధిత ఫైల్‌ను అందించారు. ప్రస్తుతం ప్రభుత్వం వద్ద ఫైల్‌ పెండింగ్‌లో ఉంది. ప్రభుత్వ పెద్దలు తీసుకునే నిర్ణయంపై కొత్త మండలాల ఏర్పాటు ప్రక్రియ ఆధారపడింది. ఎప్పుడైనా ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. వీలయితే స్వాతంత్ర దినోత్సవం రోజున గెజిట్‌ విడుదల చేసే అవకాశాలున్నట్లు సంబంధిత అధికార వర్గాల ద్వారా తెలిసింది. లేదంటే దసరా పండగ సందర్బంగా నూతన మండలాల ఏర్పాటుకు తుది నోటిఫికేషన్‌ వెలువడచ్చన్న అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై ఆయా గ్రామాల ప్రజలు ఎదురుచూపులతో గడుపుతున్నారు.

- అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన..

జిల్లాలో ఏర్పాటు కానున్న రెండు కొత్త మండలాల్లో తాత్కాలిక కార్యాలయాలు ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలనే అంశంపై ఇప్పటికే డివిజన్‌, మండల స్థాయిలో రెవెన్యూ అధికారులు క్షేత్ర స్థాయి ప్రాథమిక పరిశీలన చేశారు. ప్రభుత్వ అనుబంధ శాఖల కార్యాలయాల భవనాలకు మొదటి ప్రాధాన్యం ఇవ్వడం లేదంటే స్థానిక ప్రజాభీష్టం మేరకు అద్దె భవనాలు గుర్తిస్తున్నారు. దీంతో ఎక్కడెక్కడ కొత్త మండలాల్లో శాశ్వత ప్రాతిపాదికన భవన నిర్మాణాలు చేపట్టేందుకు అవసరమైన స్థలాల కోసం అన్వేషిస్తున్నారు. స్థానిక అధికారులు ఇప్పటికే ప్రాథమికంగా భవనాలను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. ప్రభుత్వం ఏ క్షణం తుది నోటిఫికేషన్‌ జారీ చేసినా కొత్త మండలాలను ప్రారంభించడానికి అధికారులు సిద్ధమయ్యారు.


Updated Date - 2022-08-15T05:27:18+05:30 IST