‘రాజావారు రాణిగారు’ ఫేమ్ కిరణ్ అబ్బవరం హీరోగా బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న ‘సెబాస్టియన్ పిసి524’ బుధవారం మదనపల్లిలోని సొసైటీ కాలనీ రామాలయం కల్యాణ మండపంలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. రేచీకటి నేపథ్యంలో సరికొత్త కథ, కథనాలతో వినోదాత్మకంగా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు దర్శకుడు తెలిపారు. కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ ‘‘హీరోగా తొలి చిత్రం ‘రాజావారు రాణిగారు’తో నాకు మంచి పేరొచ్చింది. ప్రస్తుతం కమర్షియల్ ఎంటర్టైనర్ ‘ఎస్.ఆర్. కళ్యాణమండపం’ చేస్తున్నా. నటనకు ఆస్కారమున్న కొత్త కథ చేస్తే బావుంటుందని ఆలోచిస్తున్నప్పుడు బాలాజీ ‘సెబాస్టియన్ పిసి 524’ కథ చెప్పారు. నటుడిగా నాకు సవాల్ విసిరే చిత్రమిది. రేచీకటి అనగానే సాఫ్ట్ సినిమా అనుకోవద్దు. ప్రేక్షకుల్ని బాగా నవ్విస్తాం. సింగిల్ షెడ్యూల్లో చిత్రీకరణ పూర్తి చేసి... ‘ఎస్.ఆర్. కల్యాణమండపం’ విడుదలైన రెండు నెలలకు వేసవిలో ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. నమ్రతా దరేకర్, కోమలీ ప్రసాద్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: రాజ్ కె. నల్లి.