విజయా డయాగ్నోస్టిక్‌ ఐపీఓకు సెబీ ఆమోదం

ABN , First Publish Date - 2021-07-27T05:57:47+05:30 IST

హైదరాబాద్‌కు చెందిన విజయా డయాగ్నోస్టిక్‌ సెంటర్‌తో పాటు మరో 5 కంపెనీల పబ్లిక్‌ ఆఫరింగ్‌

విజయా డయాగ్నోస్టిక్‌ ఐపీఓకు సెబీ ఆమోదం

మరో 5 కంపెనీలకూ గ్రీన్‌సిగ్నల్‌ 


న్యూఢిల్లీ: హైదరాబాద్‌కు చెందిన విజయా డయాగ్నోస్టిక్‌ సెంటర్‌తో పాటు మరో 5 కంపెనీల పబ్లిక్‌ ఆఫరింగ్‌ (ఐపీఓ) ప్రతిపాదనలకు క్యాపిటల్‌ మార్కెట్‌ నియంత్రణ మండలి ‘సెబీ’ ఆమోదం తెలిపింది. ఈ జాబితాలో కార్‌ట్రేడ్‌ టెక్‌, సుప్రియా లైఫ్‌ సైన్సెస్‌,  యాప్టస్‌ వేల్యూ హౌసింగ్‌ ఫైనాన్స్‌, క్రిష్ణా డయాగ్నోస్టిక్స్‌, అమీ ఆర్గానిక్స్‌ ఉన్నాయి. ఈ ఆరు కంపెనీలు మే-జూన్‌ మధ్య కాలంలో సెబీకి ఐపీఓ పత్రాలు సమర్పించాయి.


ఐపీఓలో భాగంగా విజయా డయాగ్నోస్టిక్‌ ప్రమోటర్లు ఎస్‌ సురేంద్రనాథ్‌ రెడ్డి, ఇన్వెస్టర్లు కారకోరమ్‌, కేదారా క్యాపిటల్‌కు చెందిన 3.57 కోట్ల షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎ్‌ఫఎస్‌) పద్ధతిన విక్రయించనున్నారు. ఈ షేర్లు కంపెనీలో 35 శాతం వాటాకు సమానం. అందులో 30 శాతం వాటాను కేదారా క్యాపిటల్‌ ఉపసంహరించుకోనుంది. కేదారా క్యాపిటల్‌ ఈ డయాగ్నోస్టిక్‌ సెంటర్‌లో 40 శాతం వాటాను రూ.400 కోట్లకు 2016లో కొనుగోలు చేసింది. 1981లో ప్రారంభమైన విజయా డయాగ్నోస్టిక్‌కు దేశంలోని 13 నగరాల్లో 80 అధునాతన పరీక్షా కేంద్రాలున్నాయి. 


ఈ వారంలో రెండు పబ్లిక్‌ ఇష్యూలు 


జూలైలో ఐపీఓల జోరు కొనసాగుతోంది. ఈ వారంలో గ్లెన్‌మార్క్‌ లైఫ్‌ సైన్సెస్‌, రోలెక్స్‌ రింగ్స్‌ పబ్లిక్‌ ఇష్యూకు రాబోతున్నాయి. గ్లెన్‌మార్క్‌ లైఫ్‌ సైన్సెస్‌ ఇష్యూ ఈ నెల 27న ప్రారంభమై 29న ముగియనుంది. ఇష్యూ ధర శ్రేణిని రూ.695-720గా నిర్ణయించిన కంపెనీ.. తద్వారా రూ.1,513 కోట్ల వరకు సమీకరించాలని లక్ష్యం గా పెట్టుకుంది. కాగా రోలెక్స్‌ రింగ్స్‌ ఐపీఓ ఈ నెల 28న ప్రారంభమై 30న ముగియనుంది. ఇష్యూ ధర శ్రేణిని రూ.880-900గా నిర్ణయించింది. తద్వారా రూ.731 కోట్లు సమీకరించాలన్నది కంపెనీ లక్ష్యం. 




అక్టోబరు చివర్లో పేటీఎం ఐపీఓ! 

దేశంలో అతిపెద్ద డిజిటల్‌ చెల్లింపుల సేవల కంపెనీ పేటీఎం.. ఈ ఏడాది అక్టోబరు చివర్లో పబ్లిక్‌ ఇష్యూకు రానున్నట్లు సమాచారం. సంస్థ ఐపీఓ ప్రతిపాదనకు ఇంకా సెబీ ఆమోదం లభించాల్సి ఉంది. పబ్లిక్‌ ఆఫరింగ్‌ ద్వారా కంపెనీ రూ.16,600 కోట్లు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. తద్వారా దేశంలో అతిపెద్ద ఐపీఓగా అవతరించనుంది. 


Updated Date - 2021-07-27T05:57:47+05:30 IST