రాష్ట్రాల రుణ పత్రాలకు ‘వడ్డీ’ల సెగ

ABN , First Publish Date - 2022-09-28T06:28:06+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే రుణ పత్రాల వడ్డీ రేట్లూ పై చూపులు చూస్తున్నాయి.

రాష్ట్రాల రుణ పత్రాలకు ‘వడ్డీ’ల సెగ

ముంబై: రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే రుణ పత్రాల వడ్డీ రేట్లూ పై చూపులు చూస్తున్నాయి. మంగళవారం జరిగిన వేలంలో సగటున 15 ఏళ్ల కాల పరిమితి ఉండే రాష్ట్ర ప్రభుత్వాల రుణ పత్రాల వడ్డీ రేటు 7.65 శాతానికి చేరింది. గత వారంతో పోలిస్తే ఇది 0.09 శాతం ఎక్కువ. గత రెండు వారాల నుంచి ఈ రుణ పత్రాలపై వడ్డీ రేట్లు పెరుగుతున్నాయి. అమెరికా ఫెడ్‌ రిజర్వ్‌ కీలక వడ్డీ రేట్లు ముప్పావు శాతం పెంచడం, ముందు ముందు మరింత పెంచుతామని సంకేతాలు ఇవ్వడం, 30న వెలువడే ఆర్‌బీఐ ద్రవ్య, పరపతి విధానంలో వడ్డీ రేట్లు మరింత పెరుగుతాయన్న అంచనాలు ఇందుకు దోహదం చేస్తున్నాయి. మంగళవారం జరిగిన వేలంలో 10 సంవత్సరాల కాలపరిమితి ఉండే  రాష్ట్ర ప్రభుత్వాల రుణ పత్రాల సగటు వడ్డీ రేట్లూ 0.03 శాతం పెరిగి 7.29 శాతానికి చేరింది.


తెలంగాణ డుమ్మా 

మంగళవారం జరిగిన రుణ పత్రాల వేలంలో తెలంగాణ, మధ్యప్రదేశ్‌, చత్తీ్‌సగఢ్‌ పాల్గొనలేదు. నిజానికి ఈ మూడు రాష్ట్రాలు రుణ పత్రాల వేలం ద్వారా రూ.5,000 కోట్ల వరకు సమీకరించేందుకు ముందు ఆసక్తి చూపాయి. వడ్డీ రేటు ఎక్కువగా ఉండడంతో ఆ ప్రయత్నం మానుకున్నాయి. పన్ను వసూళ్లు ఆశాజనకంగా ఉండడం, కేంద్ర నుంచి జీఎ్‌సటీ ద్వారా వచ్చే వాటా పెరగడం ఇందుకు కారణంగా కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌, గోవా, హరియాణా, కేరళ, రాజస్థాన్‌ మాత్రం మంగళవారం జరిగిన రుణ పత్రాల వేలం ద్వారా రూ.2,700 కోట్లు సమీకరించాయి. మహారాష్ట్ర, పంజాబ్‌, తమిళనాడు, మణిపూర్‌, మిజోరం మరో రూ.6,900 కోట్లు సమీకరించాయి. 

Updated Date - 2022-09-28T06:28:06+05:30 IST