రెండో రోజు మేడారం ఆదాయం రూ.2.50 కోట్లు

ABN , First Publish Date - 2022-02-25T18:50:42+05:30 IST

హనుమకొండలోని తిరుమల తిరుపతి దేవస్థానం కల్యాణ మండపంలో సమ్మక్క, సారలమ్మ జాతర హుండీల లెక్కింపు గురువారం రోజు ప్రశాంతంగా కొనసాగింది. 116 ఐరన్‌ హుండీలను విప్పి

రెండో రోజు మేడారం ఆదాయం రూ.2.50 కోట్లు

హనుమకొండ(మేడారం): హనుమకొండలోని తిరుమల తిరుపతి దేవస్థానం కల్యాణ మండపంలో సమ్మక్క, సారలమ్మ జాతర హుండీల లెక్కింపు గురువారం రోజు ప్రశాంతంగా కొనసాగింది. 116 ఐరన్‌ హుండీలను విప్పి లెక్కించగా రెండోరోజు ఆదాయం రూ.2 కోట్ల50 లక్షల 62 వేలు వచ్చినట్టు దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు. దీంతో మొదటి, రెండోరోజు కలిపి లభించిన మొత్తం ఆదా యం రూ.3కోట్ల 85వేల 22వేలకు చేరుకున్నది. మొద టి రోజు 65 హుండీలను లెక్కించారు. గురువారం లెక్కించిన వాటిని కలుపుకొని మొత్తం హుండీలు 181కి చేరాయి. లెక్కించిన నగదును బ్యాంకు అధికారులకు వెంటనే అప్పగించారు. రెండోరోజు కూడా హుండీల నుంచి బంగారు, వెండి కానుకలు బయట పడ్డాయి. తాలిబొట్లు, గొలుసులు, వెండి కడియాల వంటివి ఉన్నట్టు తెలుస్తోంది. వీటిని సీలువేసిన ఐరన్‌ హుండీలో వేస్తున్నారు. నగదు లెక్కింపు పూర్తయిన తర్వాత వీటి విలువను అప్రేజర్ల సాయంతో మదింపు వేసి బ్యాంకు లాకర్లో భద్రపరుస్తారు. 


వేరే గుర్తింపు కార్డుతో..

హుండీల లెక్కింపు సందర్భంగా ఒక మహిళా వలంటీర్‌ వేరే గుర్తింపు కార్డుతో లోపలికి ప్రవేశించినట్టు తెలిసింది. దీంతో భద్రతా సిబ్బంది ఆ మహిళను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత మందలించి బయటకు పంపించి వేసినట్టు సమాచారం. కాగా, హుండీల లెక్కింపులో పాల్గొన్న మరొక మహిళ కొంత నగదును దొంగిలించేందుకు ప్రయత్నించగా భద్రాతా సిబ్బంది గుర్తించినట్టు తెలుస్తోంది. మందలించి వదిలిపెట్టినట్టు కూడా తెలిసింది. అయితే ఈ విషయాన్ని దేవాదాయ అధికారులు ధ్రువీకరించలేదు.

Updated Date - 2022-02-25T18:50:42+05:30 IST