రెండో విడత వ్యాప్తి?

ABN , First Publish Date - 2020-09-17T06:46:44+05:30 IST

ఒకసారి వచ్చి, తగ్గిపోయిన వారికి కరోనా మరోసారి సోకే ప్రమాదం లేకపోలేదని ఈ మధ్య వార్తలు వస్తున్నాయి. అట్లా సోకిన ఉదంతాలు కూడా తెలుస్తున్నాయి...

రెండో విడత వ్యాప్తి?

ఒకసారి వచ్చి, తగ్గిపోయిన వారికి కరోనా మరోసారి సోకే ప్రమాదం లేకపోలేదని ఈ మధ్య వార్తలు వస్తున్నాయి. అట్లా సోకిన ఉదంతాలు కూడా తెలుస్తున్నాయి. రోజుకు లక్ష కొత్త కేసులు వచ్చే స్థాయికి భారతదేశం చేరుకుంది. అమెరికా, బ్రెజిల్‌ తరువాత మనమే ఉన్నాము. ఆంధ్రప్రదేశ్‌లో మరణాలు ఐదువేలు దాటగా, తెలంగాణ వెయ్యిని చేరుకుంటోంది. దేశంలో వ్యాధి ఆరోహణ దశలోనే ఉన్నది కానీ, తగ్గుముఖంలో లేదు. వ్యక్తిగతంగా రెండోసారి సోకడం సరే, దేశంలోనే మరోసారి వస్తే? పతాకస్థానానికి చేరి తగ్గుతున్న దశలో కానీ, ముందుగానే తగ్గిపోయిన ప్రాంతాలలో గానీ కరోనా తిరగబెడితే? అంటే, దేశంలో రెండోసారి ఉధృతి సంభవిస్తే? మన వైద్య, ఆరోగ్య యంత్రాంగం, నిపుణులు, అధికారులు, నాయకులు ఈ విషయమై ఆలోచిస్తున్నారా? వ్యాక్సిన్‌ త్వరలో రానున్నదిలెమ్మన్న ధీమాతో ఉన్నారా? 


వ్యాక్సిన్‌ త్వరలో వస్తే అంతకు మించి సంతోషం ఏముంటుంది? టీకా పంపిణీ మొదలయ్యాక కూడా, అనేక సమస్యలుంటాయి. అత్యవసర శ్రేణుల వారికి మొదట అందజేస్తామని అంటున్నారు. తక్కినవారికి అందరికీ అందడానికి సమయం పడుతుంది. ఈ లోగా, టీకా అందని చోట్ల రెండోసారి కరోనా సోకవచ్చు. టీకా దేశంలో అందుబాటులోకి ఎప్పుడు వస్తుందో ఖచ్చితంగా తెలియదు, వచ్చాక, ఈ పరిస్థితి మొత్తంగా అదుపులోకి రావడానికి ఎంతకాలం పడుతుందో తెలియదు. ఈ అనిశ్చిత భవితవ్యాన్ని ఎదుర్కొనడానికి ప్రభుత్వానికి ఒక ప్రణాళిక ఉండాలి. ఉన్నదా?


భారత ప్రధాని నరేంద్రమోదీ కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొనలేక, ప్రజల దృష్టిని మళ్లించే పనిలో పడ్డారని సుప్రసిద్ధ బ్రిటిష్‌ దినపత్రిక ‘ది గార్డియన్‌’ గత ఆదివారం నాడు తన సంపాదకీయంలో వ్యాఖ్యానించింది. ప్రపంచం మొత్తంలో రోజువారీ కొత్త కొవిడ్‌–19 కేసుల సంఖ్యలో మూడో వంతు తమ దేశం నుంచే వస్తుంటే, స్థూల దేశీయోత్పత్తి పావు వంతు కుదించుకుపోతే– కరోనా వ్యాప్తి పెద్దగా లేనట్టు నిశ్చింతగా కనిపించడం ఆ పత్రికకు విడ్డూరంగా కనిపించింది. పోయిన నెలలో జరిగిన రామాలయ నిర్మాణారంభ కార్యక్రమం, తన అభిమానుల్లో ఉద్వేగాలను రగిలించడానికి, కరోనా సంక్షోభం ఉనికిని నిరాకరించడానికి నిర్వహించినదిగా ఆ సంపాదకీయం అభిప్రాయపడింది. రెండో సారి ముంచుకువచ్చే కొవిడ్‌, మొదటి దఫా కంటె తీవ్రంగా ఉంటుందని ‘ది గార్డియన్‌’ హెచ్చరించింది. ‘‘మొదటి దశలో వైరస్‌ నగరాల్లో వ్యాపించింది. అక్కడ ఉత్తమ వైద్యసదుపాయాలున్నాయి. రెండో విడత వ్యాప్తి వైద్యసదుపాయాలు లేని గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతోంది’’ అని ఆ పత్రిక రాసింది. 


పత్రికల్లో, ప్రసారసాధనాల్లో కరోనా వార్తలు పెద్దగా కనిపించకుండా, ఇతర సమాచారంతో నింపడానికి అన్ని ప్రభుత్వాలూ ప్రయత్నిస్తున్నాయి. ప్రస్తుతం చేస్తున్నదానికి మించి, మరేమీ చేయనక్కరలేదని, లేదా చేయలేమని చేతులెత్తేసిన రాష్ట్రప్రభుత్వాలు, టీకా రాకడ కోసం ఎదురుచూస్తున్నాయి. వాటిని కూడా పూర్తిగా తప్పు పట్టడానికి లేదు. పన్ను ఆదాయం పడిపోయింది. కేంద్రం పరిహారం ఇవ్వదు. ప్రత్యేకంగా ఏ సాయమూ అందించదు. పైగా, అప్పు తెచ్చుకోమంటుంది. ప్రజాజీవితాన్ని దాదాపుగా పూర్తిస్థాయిలో అనుమతిస్తున్నారు. మనుగడ కోసం బయట సంచరించక తప్పదు. భద్ర గృహాలున్నవారు, భద్ర ప్రయాణ సదుపాయాలున్నవారు సురక్షితంగా ఉండే అవకాశాలు ఎక్కువ. ఇరుకు ఇళ్లలో కిక్కిరిసి జీవించేవారికి, ప్రజారవాణా సాధనాలను ఉపయోగించక తప్పనివారికి, జనసమ్మర్దంతో వ్యవహరించవలసి వచ్చేవారికి భద్రత తక్కువ. ఆంధ్రప్రదేశ్‌లో అయితే, కరోనా మృత్యురూపంలో విలయతాండవం చేస్తున్నది. కరోనా వల్ల ఉత్పన్నమయిన పరిస్థితిని చర్చించడానికి కూడా ప్రభుత్వాలకు మనస్కరించడం లేదు. చిన్నపాటి చర్చతో కరోనా అంశాన్ని ముగించిన తెలంగాణ శాసనసభలు, కరోనా తీవ్రత కారణంగానే అర్థాంతరంగా సమావేశాలు ముగించుకున్నాయి. తెలంగాణతో సహా రాష్ట్రాల్లో కరోనా బాధితుల గణాంకాలను తగ్గించి చూపుతున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాలలో వ్యాప్తి పెరిగితే, పూర్తి సమాచారం వెల్లడికి ఇంకా అనేక అవరోధాలుంటాయి. ప్రజలు పెద్దగా ఆందోళన చెందకుండా ఉండడానికి తప్ప, సంఖ్యను తగ్గిస్తే ఏమి ఉపయోగం?


కరోనా పర్యవసానాలలో మరణం ఒక పార్శ్వం మాత్రమే. కోట్లాది మందికి జీవనాధారాలు తగ్గిపోవడం, ఆదాయాలు పోవడం లేక పడిపోవడం, రుణాలు తీర్చలేకపోవడం వంటి అనేక సమస్యలు ఉన్నాయి. వలస కార్మికులు పట్టణాల నుంచి తమ తమ స్వస్థలాలకు వెళ్లారు. అక్కడ వారికి గ్రామీణ ఉపాధి పథకం వంటివి అండగా ఉంటూ వచ్చాయి ఆ పథకాన్ని మరిన్ని రోజులకు విస్తరించడం, మరింత మందికి విస్తరించడం– అసంఖ్యాకులను ఆకలి నుంచి రక్షిస్తుంది. కానీ, ఈ నెలతో నిధులు ముగిసిపోయే ఆ పథకాన్ని పొడిగించడానికి కేంద్రానికి ఇష్టం లేదు. 2008 ఆర్థిక సంక్షోభం కాలంలో, యుపిఎ ప్రభుత్వ హయాంలో రూపొందిన ఆ పథకం మీద ఆధారపడితే, ప్రతిపక్షమైన కాంగ్రెస్‌కు ఎక్కడ పేరొస్తుందో అని మోదీ విముఖంగా ఉన్నారని ‘ది గార్డియన్‌’ రాసింది. ఈ సమయంలో ప్రజలలో విశ్వాసం కలిగించే విధంగా ఒక ఐక్యతను నిర్మించే బదులు మోదీ, జైళ్లలో టవర్ల నుంచి పహారా కాసినట్టుగా దేశాన్నంతా నిఘా నీడలోకి తోశారని, ప్రశ్నించిన వారందరిని నోరు మూయించడమో, నిర్బంధించడమో చేస్తున్నారని ఆ బ్రిటిష్‌ పత్రిక తీవ్రంగా విమర్శించింది. 


కరోనా వైరస్‌ వ్యాప్తి అవరోహణ దశకి రాలేదని, ఇంకా కష్టకాలం ముందున్నదని గ్రహించవలసి ఉన్నది. ఆ కష్టకాలం కేవలం వైద్య, ఆరోగ్య సమస్యలకు పరిమితమైనది కాదు. ఉపాధికి, ఆదాయాలకు, మనుగడకు సంబంధించిన సంక్షోభం. వివేకంతో, దూరదృష్టితో, కొంత చొరవతో పరిష్కారాన్ని అన్వేషించవలసి ఉన్నది. గణాంకాలను తొక్కిపెట్టి, ప్రజల దృష్టిని మళ్లించి కానీ ఈ సమస్యను అధిగమించలేరు.

Updated Date - 2020-09-17T06:46:44+05:30 IST