నారద స్కామ్ కేసు విచారణ నుంచి తప్పుకున్న 'సుప్రీం' జడ్జి

ABN , First Publish Date - 2021-06-22T20:27:54+05:30 IST

పశ్చిమబెంగాల్‌కు సంబంధించిన ఒక కేసు విచారణ నుంచి సుప్ర్రీంకోర్టుకు చెందిన మరొక..

నారద స్కామ్ కేసు విచారణ నుంచి తప్పుకున్న 'సుప్రీం' జడ్జి

న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్‌కు సంబంధించిన ఒక కేసు విచారణ నుంచి సుప్ర్రీంకోర్టుకు చెందిన మరొక న్యాయమూర్తి తప్పుకున్నారు. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రమేయం ఉన్నట్టు చెబుతున్న నారద ముడుపుల కేసు (నారద స్కామ్) విచారణ నుంచి జస్టిస్ అనిరుద్ధ బోస్ మంగళవారంనాడు తప్పుకున్నారు. ఆయన కోల్‌కతాకు చెందిన వారు. ''ఈ కేసు వినాలని అనుకోవడం లేదు''అని ఆయన పేర్కొన్నారు. దీంతో జడ్జి హేమంత్ గుప్తా ఈ కేసును మరో బెంచ్‌కు పోస్ట్ చేయాలని రిజిస్ట్రీని కోరారు. జస్టిస్ వినీత్ శరణ్ సారథ్యంలోని బెంచ్ ముందుకు ఈ కేసు ప్రస్తుతం  విచారణకు రానుంది.


దీనికి ముందు, బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం కొన్ని ప్రాంతాల్లో చెలరేగిన హింసకు సంబంధించిన కేసులో విచారణ నుంచి కోల్‌కతాకే చెందిన జస్టిస్ ఇందిర బెనర్జీ తప్పుకున్నారు. నారద స్కామ్‌లో తమ స్టేట్‌మెంట్‌ను రికార్డు చేయడానికి కోల్‌కతా హైకోర్టు నిరాకరించడాన్ని మమతా బెనర్జీ, న్యాయశాఖ మంత్రి మొలాయ్ ఘటక్ సుప్రీంకోర్టులో సవాలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒత్తిడికి అవకాశం ఉన్నందున నారద కేసు విచారణను బెంగాల్‌లో కాకుండా వేరే చోటకు షిప్ట్ చేయాలని సీబీఐ విజ్ఞప్తి చేసింది. దీనిపై సీఎం, న్యాయశాఖ మంత్రి తమ వాదన వినిపించేందుకు అఫిడవిట్లు సమర్పిస్తామని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. అయితే, అఫిడవిట్లు సమర్పించకుంటే వచ్చే చిక్కులు సకాలంలో గుర్తించకుండా, ఇప్పుడు తమ ఇష్టానుసారం అవిఢవిట్లు సమర్పిస్తామంటే అనుమతించేది లేదని హైకోర్టు స్పష్టం చేసింది. దీనిని మమత, ఘటక్‌లు సుప్రీంకోర్టులో సవాలు చేశారు.

Updated Date - 2021-06-22T20:27:54+05:30 IST