వరద పోటు

ABN , First Publish Date - 2022-08-11T05:57:03+05:30 IST

గోదావ రి మహోగ్రరూపం దాల్చి నెల రోజులైంది. దీని నుంచి ప్రజ లు కోలుకుంటున్న తరుణంలో ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా ఇప్పుడు మళ్లీ వరద పోటెత్తింది. బుధవారం ఆచంట, యలమంచిలి, నరసాపురంలోని పుష్కర ఘాట్‌లన్నీ నీట మునిగాయి.

వరద పోటు
నీట మునిగిన కనకాయలంక కాజ్‌ వే

నెల రోజులకే రెండోసారి పెరుగుతున్న గోదావరి ప్రవాహం.. ఆందోళనలో లంకలు

నీట మునిగిన కనకాయలంక కాజ్‌ వే

స్లూయిజ్‌ తలుపులు మూసివేత

గంగడపాలెం వద్ద ఇసుక బస్తాలు వేసిన రైతులు.. స్లూయిజ్‌లను పట్టించుకోని అధికారులు 


ఆచంట/యలమంచిలి/నరసాపురం, ఆగస్టు 10 : గోదావ రి మహోగ్రరూపం దాల్చి నెల రోజులైంది. దీని నుంచి ప్రజ లు కోలుకుంటున్న తరుణంలో ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా ఇప్పుడు మళ్లీ వరద పోటెత్తింది. బుధవారం ఆచంట, యలమంచిలి, నరసాపురంలోని పుష్కర ఘాట్‌లన్నీ నీట మునిగాయి. పడవలు రాకపోకలను కుదిం చారు. ఆచంట మండలం లంకగ్రామాలైన అయోధ్యలంక, పెదమల్లంలంక, భీమలాపురం లంక, కోడేరు లంక వాసులు పది రోజులపాటు వరద నీటిలోనే జీవనం సాగించారు. గోదావరి తగ్గే వరకు లంక వాసులు ఇంటికే పరిమితమ య్యారు. లంక గ్రామాల్లో పడవలపైనే రాకపోకలు సాగాయి. కనీసం విద్యుత్‌ సరఫరా లేకపోవడంతో రాత్రుళ్లు గోదావరి నీటిలోనే బిక్కుబిక్కుమంటూ గడిపారు. రైతులు సాగు చేసి న రకరకాల కూరగాయలు, ఉద్యాన పంటలు పూర్తిగా నాశ నమయ్యాయి. గోదావరి తగ్గినప్పటికి రైతులు వేసిన పంట పొలాల్లోకి వెళ్లలేని పరిస్థితి. చేతికొచ్చిన పంటలతోపాటు అనేక ఇళ్లు దెబ్బతిన్నాయి. మూగ జీవాలకు పశుగ్రాసం లేక అల్లాడిపోతున్నాయి. ప్రస్తుతం వరద ప్రాంతాలవాసులు, రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ప్రస్తుతం ఇంకా నేటికి పశువులకు పశుగ్రాసం లేక ఇబ్బందులు పడుతూనే ఉన్నాయి. కోడేరు వద్ద గోదావరి పరిస్థితిని తహసీల్దార్‌ నజీముల్లాషా పరిశీలించారు. 


నీట మునిగిన కనకాయలంక కాజ్‌ వే

గోదావరి వరద ప్రవాహం పెరగడంతో యలమంచిలి మండలం కనకాయ లంక కాజ్‌ వే పూర్తిగా నీట మునిగి ఆరడుగుల మేర నీరు ప్రవహిస్తోంది. గ్రామస్థులు ఇతర గ్రామాలకు వెళ్లాలంటే కాజ్‌ వేనే ఆధారం. ఇది నీట మున గడంతో పడవలను ఆశ్రయించారు. కనకాయలంక, పెదలం క, అబ్బిరాజుపాలెం, యలమంచిలి, చించినాడ, ఏనుగువాని లంక, బాడవ గ్రామాల లంక భూముల్లోకి వరద నీరు చేరు తోంది. లంక భూముల్లోని కొబ్బరి రాశులను ఏటిగట్టు వెలు పల ప్రాంతాలకు తరలించే ప్రయత్నాల్లో రైతులు నిమగ్నమ య్యారు. లంకగ్రామాల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలె త్తకుండా తగిన చర్యలు చేపట్టాలని నరసాపురం సబ్‌ కలెక్టర్‌ విష్ణుచరణ్‌ అధికారులకు ఆదేశాలిచ్చారు. కనకాయ లంక కాజ్‌ వే వద్ద వరద పరిస్థితిని బుధవారం ఆయన పరి శీలించారు. పునరావాస కేంద్రాల ఏర్పాటుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సబ్‌ కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని తహసీల్ధారు ఎల్‌.నరసింహారావుకు సూచించారు. 


నిండుకుండలా వశిష్ఠ

ఎగువ నుంచి బుధవారం నాలుగు లక్షల క్యూసెక్కుల వరద నీరు పోటెత్తడంతో వశిష్ట గోదావరి నిండు కుండలా మారింది. పరివాహక ప్రాంతాల్లో నీటిమట్టాలు పెరుగుతుం డటంతో కాజ, మాధవాయిపాలెం, దర్భరేవు, ఈస్ట్‌ కుక్కులేరు తోపాటు నరసాపురం ప్రాంతంలోని ఏడు మైనర్‌ స్లూయిస్‌ తలుపులు మూసివేశారు. బుడిగల రేవు నుంచి అమరేశ్వర స్వామి ఆలయ వరకు చేపట్టిన గట్టు పనుల్ని వేగవంతం చేశారు. ముందస్తు ఇసుక బస్తాలను ఏటిగట్టు మీదకు తరలిస్తున్నారు. వరద హెచ్చరికతో మత్స్యకారులు గోదావరి లో కట్టిన వల్లకట్లను తొలగించి ఒడ్డుకు చేర్చారు. వేట సాగించే బోట్లను దరికి చేరుస్తున్నారు. సాయంత్రానికి అన్ని రేవుల వద్ద నీటిమట్టాలు గణనీయంగా పెరిగాయి.  


 యనమదుర్రుకు తప్పిన గండం 

భీమవరం/పెంటపాడు, ఆగస్టు 10 : మెట్టలో జోరు వాన లు తగ్గడంతో యనమదుర్రుకు వరద ముప్పు ప్రస్తుతానికి తప్పింది. ఎర్ర కాలువలో వరద నీరు దిగువకు వచ్చేశాయి. బుధవారం నందమూరు ఆక్విడెక్టు వద్ద 28.2 అడుగులకు ఎర్రకాలువ నీటి మట్టం తగ్గినది. దీంతో దిగువన వరద క్రమంగా తగ్గుముఖం పట్టింది. మంగళవారం రాత్రి కలెక్టర్‌ పి.ప్రశాంతి యనమదుర్రు వరద ఎర్రకాలువ పరిస్థితులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ‘ఎర్రకాలువ నుంచి వరద నీరు వస్తున్నందు వల్ల మొదటి ప్రమాద హెచ్చరిక ఉపసంహరణ చేశాం. నందమూరు వద్ద మంగళవారం 35 అడుగులు నమోదు కాగా సాయత్రం 32 అడుగులకు నమోదైంది. 28.2 తగ్గింది. ఎగువన వర్షాలు తగ్గడంతో ప్రమాదం తప్పే అవకాశం ఉంది’ అని యనమదుర్రు డ్రెయిన్‌ ఏఈ బి.వినయ్‌ తెలిపారు. పెంటపాడు మండలం బి.కొండేపాడు, మీనవల్లూరు గ్రామాల మీదుగా యనమదుర్రు డ్రెయినేజ్‌ వెళుతుంది. కాల్వ ప్రవాహం ఉద్రిక్తంగా ఉండటంతో బి.కొండేపాడు, మీనవల్లూరు, రామచంద్రపురం, అత్తిలి మండలం తిరుపతిపురం గ్రామాల రైతులు భయాందోళనలకు గురవు తున్నారు. కాలువ ప్రవాహం ఇంకా అధికమైతే చుట్టు పక్కల పొలాలకు ముంపు భయం ఉంది. 

రైతులకు తప్పదుగా..

గత నెల భారీ వరదలకు గంగడపాలెంలో కెనాల్‌కున్న స్లూయిజ్‌ తలుపులు పనిచేయక భారీగా వరద నీరు  లీకైంది. స్లూయిజ్‌ పక్కన గండిపడి వరద నీరు చేలల్లోకి, పల్లపు ప్రాంతాల్లోకి చేరింది. ప్రస్తుతం గోదావరికి వరదనీటి ప్రవాహం పెరుగుతుండటంతో గంగడపాలెంలోని పలువురు రైతులు బుధవారం స్వచ్ఛందంగా తరలివచ్చి స్లూయిజ్‌  వద్ద లీకేజి ఏర్పడకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. స్లూయిజ్‌ తలుపుల వద్ద ఇసుక బస్తాలు వేశారు. వరద   తగ్గి పక్షం రోజులు కావస్తున్నా ఎలాంటి మరమ్మతులు చేపట్టలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా స్పందించి గట్టును పటిష్టం చేయాలని రైతులు కోరుతున్నారు. 


Updated Date - 2022-08-11T05:57:03+05:30 IST