మునిసిపాలిటీకి రెండో వైస్‌ చైర్మన్‌

ABN , First Publish Date - 2021-07-28T05:57:33+05:30 IST

మునిసిపాలిటీకి రెండో వైస్‌ చైర్మన్‌ను ఎన్నుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

మునిసిపాలిటీకి రెండో వైస్‌ చైర్మన్‌
ఎలమంచిలి మునిసిపల్‌ కార్యాలయం

30న ఎన్నిక నిర్వహించేందుకు సన్నాహాలు

ఏ సామాజిక వర్గానికి వరిస్తుందోనని ఉత్కంఠ 

ఎలమంచిలి, జూలై 27 : మునిసిపాలిటీకి రెండో వైస్‌ చైర్మన్‌ను ఎన్నుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి ఈ నెల 30న నిర్వహించ తలపెట్టిన ఎన్నికకు హాజరు కావాలని పాలకవర్గ సభ్యులకు మునిసిపల్‌ అధికారులు ఇప్పటికే సమాచారం అందజేశారని తెలిసింది. అయితే రెండో వైస్‌ చైర్మన్‌ పదవి ఎవరిని వరిస్తుందన్న ఉత్కంఠ అందరిలో నెలకొంది. కౌన్సిలర్లు చేతులెత్తి వైస్‌ చైర్మన్‌ను ఎన్నుకునే విధానం అమలులో ఉంది. మునిసిపాలిటీలో 25 వార్డులకు గతంలో ఎన్నికలు జరిగాయి. ఇందులో అత్యధికంగా 23 కౌన్సిల్‌ స్థానాలను వైసీపీ, ఒకటి టీడీపీ, ఒకటి స్వతంత్ర అభ్యర్థి కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో చైర్‌పర్సన్‌ పదవిని గవర సామాజిక వర్గానికి, వైస్‌ చైర్మన్‌ పదవి కాపు సామాజిక వర్గానికి కేటాయించారు. ప్రస్తుతం రెండో వైస్‌ చైర్మన్‌ పదవి ఏ వర్గానికి చెందుతుందనే చర్చ జోరుగా సాగుతోంది.  ఆర్య వైశ్యులకు ఈ పదవి వరించ వచ్చునని పలువురు భావిస్తున్నప్పటికీ, మరి కొంతమంది ఈ పదవి కోసం ప్రయత్నించే అవకాశం లేకపోలేదు. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు ఇదే అంశం పట్టణంలో హాట్‌ టాపిక్‌గా నిలిచింది. పట్టణంలోని ప్రైవేటు కల్యాణ మండపంలో 30వ తేదీ ఉదయం 11 గంటలకు ఆర్డీవో అధ్యక్షతన ఎన్నిక జరగనుందని, ఇప్పటికే అందరికీ సమాచారం ఇవ్వడం జరిగిందని మునిసిపల్‌ కమిషనర్‌ కృష్ణవేణి తెలిపారు. 

Updated Date - 2021-07-28T05:57:33+05:30 IST