ప్రయాణమా.. ప్రమాదమా..

ABN , First Publish Date - 2021-04-17T05:20:33+05:30 IST

ప్రయాణమా.. ప్రమాదమా..

ప్రయాణమా.. ప్రమాదమా..

ముంబయి, ఢిల్లీకి ఇండిగో విమానాలు రద్దు

ముంబయికి ఓ రైలు నిలిపివేత

తగ్గుతున్న వెయిటింగ్‌ లిస్ట్‌ సంఖ్య

బస్సుల్లో పడిపోయిన ఆక్యుపెన్సీ

కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగానే..

విజయవాడ, ఆంధ్రజ్యోతి .. కరోనా మహమ్మారి ప్రయాణాలపైనా ప్రభావం చూపిస్తోంది. సెకండ్‌ వేవ్‌ విస్తరిస్తున్న దశలో ప్రయాణాలు ఇప్పుడిప్పుడే తగ్గుతున్నాయి. ఇటు విమానాల్లోనూ, అటు రైళ్లు, బస్సుల్లోనూ ప్రయాణికుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది.  

రెండు ఇండిగో విమాన సర్వీసులు రద్దు

ఇప్పటికే విజయవాడ నుంచి ముంబయి, ఢిల్లీలకు నడుపుతున్న విమానాలను ఇండిగో సంస్థ రద్దు చేసింది. ఈ నెలలో రెండు సర్వీసులను నిలుపుదల చేసింది. వాటిని సరకు రవాణాకు వీలుగా నడుపుతోంది. దీంతో ముంబయికి రెండు ఎయిర్‌ ఇండియా విమానాలు మాత్రమే ఉదయం, సాయంత్రం నడుస్తున్నాయి. అయితే, ఎయిర్‌ ఇండియాలో ప్రయాణించే వారి సంఖ్య తగ్గలేదు. శుక్రవారం కూడా 140 మంది ప్రయాణికులు ముంబయి వెళ్లారు. వీరంతా ఎప్పుడో బుక్‌ చేసుకున్నవారు కావటంతో ప్రయాణాలను కొనసాగించారు. ఇక విజయవాడ నుంచి చెన్నైకు యథాతథంగానే విమానాలు నడుస్తున్నాయి. 

రైళ్లలో తగ్గుతున్న ప్రయాణికులు

విజయవాడ నుంచి ఢిల్లీ, ముంబయి, చెన్నైకు ప్రయాణికులు స్వల్పంగా తగ్గారు. ముంబయికి వెళ్లే కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌, విశాఖపట్నం-ఎల్‌టీ  డైలీగా లోకమాన్య ఎక్స్‌ప్రెస్‌ వారంలో రెండు రోజుల చొప్పున నడిచేవి. ప్రస్తుతం విశాఖపట్నం-ఎల్‌టీ ఎక్స్‌ప్రెస్‌ను రైల్వే తాత్కాలికంగా రద్దు చేసింది. డబ్లింగ్‌ వర్క్స్‌ పనులు జరుగుతుండటమే కారణమని రైల్వే వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం కోణార్క్‌ ఒక్కటే డైలీ ఎక్స్‌ప్రెస్‌గా నడుస్తోంది. లోకమాన్య తిలక్‌ ఎక్స్‌ప్రెస్‌ వారంలో రెండు రోజులు నడుస్తోంది. ఇక విజయవాడ నుంచి ఢిల్లీ వెళ్లే తమిళనాడు, జీటీ, ఏపీ ఎక్స్‌ప్రెస్‌, నిజాముద్దీన్‌ యథాతథంగానే నడుస్తున్నాయి. చెన్నైకు కూడా రైళ్లు నడుస్తున్నాయి. అయితే, ఈ ప్రాంతాలకు వెళ్లే రైళ్లలో గతంలో వెయిటింగ్‌ లిస్ట్‌ వందల సంఖ్యలో ఉండేది. ప్రస్తుతం వెయిటింగ్‌ లిస్ట్‌ కొనసాగుతున్నా.. పాతిక, ముప్పై వరకే ఉంటోంది. దీనినిబట్టి ఇప్పుడిప్పుడే స్వల్పంగా ప్రయాణికులు తగ్గుతున్నట్టు తెలుస్తోంది.

ఖాళీగా ఆర్టీసీ బస్సులు

విజయవాడ నుంచి చెన్నైకు రోజూ రెండు ఏసీ బస్సులు, రెండు నాన్‌ ఏసీ బస్సులు నడుస్తున్నాయి. ఈ బస్సులకు ఇంతకుముందు వరకు ఉన్న ఆదరణ ఇప్పుడు లేదు. రెండు ఏసీ బస్సుల్లో 30 శాతానికిపైగా ఆక్యుపెన్సీ పడిపోయింది. నాన్‌ ఏసీ బస్సుల్లో అయితే పక్షం రోజులుగా 15 శాతం చొప్పున ఆక్యుపెన్సీ తగ్గిపోయినట్టు తెలుస్తోంది. 

Updated Date - 2021-04-17T05:20:33+05:30 IST